– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– గెర్రె గ్రామంలో హత్యకు గురైన బాధిత కుటుంబానికి పరామర్శ
– గ్రామంలో నిరసన ప్రదర్శన
– 27న కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
నవతెలంగాణ-కాగజ్‌నగర్
”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 140కి పైగా కుల, మతాంతర దురహంకార హత్యలు జరిగాయి.. వీటిపై ప్రభుత్వాలు ఉదాసీనం గా వ్యవహరిస్తు న్నాయి.. వెంటనే కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తేవాలి..” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. కొమురంభీం- ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో ఈ నెల 18న హత్యకు గురైన గర్భిణి రాణి కుటుంబాన్ని శనివారం ఆయన పరామ ర్శించారు. మృతురాలి తల్లిదండ్రులు, సోదరులతో మాట్లాడారు. ‘తమది తక్కువ కులం కావడంతోనే నా కూతురును పొట్టన పెట్టుకున్నారు’ అని తల్లి అనూష రోదిస్తూ తెలిపింది. హత్య జరిగిన ప్రదేశాన్ని జాన్‌వెస్లీ పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇప్పటికీ కుల, మతాంతర దురహంకార హత్యలు జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. బీసీ సామాజిక తరగతికి చెందిన శేఖర్, ఎస్టీ సామాజిక తరగతికి చెందిన రాణిని ప్రేమించి వివాహం చేసుకోవడం ఇష్టం లేని శేఖర్ తండ్రి సత్తయ్య గర్భిణి అని కూడా చూడకుండా కోడలిని గొడ్డలితో నరకడం దారుణ మని అన్నారు. వారం రోజులు గడిచినా ఇప్పటి వరకు ఇక్కడికి జిల్లా కలెక్టర్, ఎస్పీ రాకపోవడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. బాధిత కుటుంబం పేద గిరిజన కుటుంబం కావడమే అందుకు కారణమా అని ప్రశ్నించారు. రాబోయే రోజులలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుం డా చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము ప్రతిఘ టిస్తామని, తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రామాల్లో మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా అవగా హన సదస్సులు పెట్టాల్సిన అధికారులు ఏం చేస్తు న్నారని ప్రశ్నించారు. రాణి కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల వ్యవసాయ భూమితో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసు విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ హత్యలో రాణి భర్త శేఖర్‌పైనా కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున అతన్ని వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలని కోరారు. రాణి హత్యకు నిరసనగా ఈ నెల 27న కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తున్నట్టు తెలిపారు. పార్టీలకతీతంగా అన్ని ప్రజా సంఘాలు ఈ ముట్టడి విజయవంతానికి కృషి చేయాలని కోరారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలి
కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై చేపట్ట తలపెట్టిన ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దహెగాం మండలానికి వచ్చిన ఆయన స్థానికంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే.. విభజన అనంతరం రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టిందని అన్నారు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పడమే తప్ప అడుగు ముందుకు వేయడం లేదని అన్నారు. దీని నిర్మాణానికి నిధులు విడుదల చేసి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన వెంట తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కూశన రాజన్నతో పాటు జిల్లా నాయకులు ఉన్నారు.
కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తేవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



