తాతా కామేశ్వరి… అక్షరమంటే ఆమెకెంతో మమకారం. చదవడమంటే ఎంతో ఇష్టం. కానీ తెలుగు వాతావరణానికి కాస్త దూరంగా ఉండడం వల్ల మొదట్లో తన కోరికను అంతగా ఆచరణలో పెట్టలేకపోయారు. తన రచనా వ్యాసంగా కాస్త ఆలస్యంగా మొదలుపెట్టినా నిరంతరం రాస్తూనే ఉన్నారు. వయసు ఎనిమిది పదులు దాటినా నిత్య విద్యార్థిగా అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఈ వయసులోనూ ఎంతో ఆసక్తితో కొన్ని పత్రికలకు తన కథలు పంపిస్తున్నారు. ఎన్నో కథా సమూహాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలా ఈ తరం రచయితలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
19 నవంబర్ 1944లో శ్రీకాకుళం జిల్లాలోని చీపురుపల్లిలో పుట్టారు. నలుగురు పిల్లల్లో ఈమే చిన్నవారు. కామేశ్వరికి ఓ తమ్ముడు ఉన్నాడు. కామేశ్వరి తల్లి పేరు కూడా కామేశ్వరినే. ఈమె గృహిణి. తండ్రి జి.ఎల్.కె.శాస్త్రీ రైల్వే ఉద్యోగి. ఆయన ఉద్యోగ రీత్యా కామేశ్వరి తన మూడు నాలుగు ఏండ్ల వయసు నుండే ఉత్తర భారతదేశంలోనే పెరిగారు. ముఖ్యంగా బీహార్‌లో చంబల్‌పూర్‌లో ఎక్కువ కాలం ఉన్నారు. అక్కడ తెలుగు నేర్చుకోవడం కష్టంగా ఉండేది. అయినా తెలుగు భాషపై ఉన్న ఆసక్తితో పుస్తకాలు తెచ్చుకొని చదివేవారు. అక్కడే ఆమె టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని రైల్వేలో టైపిస్ట్‌గా చేశారు.
మర్చిపోలేని అనుభవాలు
కామేశ్వరికి చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం, రాయడం అంటే చాలా ఇష్టం. బడిలో చదువుకునేటప్పుడు అన్నింట్లో పాల్గొనేవారు. అనేక బహుమతులు కూడా పొందారు. నాటకాల్లో ద్రౌపదిగా ఆమె నటించేవారు. పెద్ద జుట్టున్న కామేశ్వరిని ఆపాత్రకు ఎన్నికచేశారు. హిందీ నాటకంలో విశ్వామిత్ర వేషంలో నటించి శభాష్ అనిపించుకున్నారు. ఇవి ఆమెకు మర్చిపోలేని అనుభవాలు.
ఆంధ్ర సమితి ఆధ్వర్యంలో
అక్కడి తెలుగువారంతా కలిసి ఆంధ్ర సమితి అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. చిన్నతనంలో అందులో జరిగే ప్రతి కార్యక్రమంలో ఆమె పాల్గొనే వారు. తర్వాత కాలంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. కార్యక్రమాల నిర్వహణకోసం ఓ హాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి లైబ్రరీలో పుస్తకాలు తీసుకొని చదివేవారు. యండమూరి, రంగనాయకమ్మ నవలలు ఎంతో ఇష్టంగా చదివేవారు. పండగలు వచ్చినప్పుడు పిల్లలతో చిన్న చిన్న నాటకాలు, మౌన యాక్షన్ వంటివి చేయించేవారు. వాటిని కామేశ్వరినే రాసేవారు.
పెండ్లి తర్వాత…
కామేశ్వరి ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు చదువుకున్నారు. అప్పట్లో ఆడపిల్లలను చదివించడానికి పెద్దలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఆపై చదువులు చదివించాలంటే ఎక్కడో దూరంగా ఉండే హాస్టల్లో ఉంచి చదివించాలి. ఆడపిల్లల్ని ఎక్కడో ఉంచి చదివించడం నచ్చని ఆమె తల్లిదండ్రులు అంతటితో చదువు ఆపేసి పెండ్లి చేశారు. కామేశ్వరి భర్త శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. తెలుగువారే అయినా ఆయనకు బెంగాల్‌లో ఉద్యోగం. పెండ్లి తర్వాత బెంగాల్‌లోని దుర్గాపుర్‌లో ఆమె తన కొత్త జీవితం ఆరంభించారు. అక్కడ కూడా ఆమె తెలుగు వారితో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సాహిత్యంతో పాటు వంటలు చేయటమంటే ఆమెకెంతో ఇష్టం. ఆంగ్లం, తెలుగులో వంటల పుస్తకాలు కూడా రాశారు.


మూడు కథా సంపుటాలు
కామేశ్వరి భర్త బెంగాలీ భాషలో నుంచి భారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కామేశ్వరి అప్పుడప్పుడు చిన్న చిన్న నాటకాలు రాసినా తన 70వ ఏటనే సీరియస్‌గా రాయడం మొదలుపెట్టారు. ఈ వయసులోనూ ఆమె టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. సుమారు 51 కథా సమూహాల్లో చురుకుగ్గా ఉంటున్నారు. ఇప్పటి వరకు ఆమె నివేదన, అర్పణ, వెలుగు అనే మూడు కథా సంపుటాలు ప్రచురించారు. ఆమె రాసిన అనేక కథలు ఆన్లైన్ మ్యాగజైన్స్‌లో వచ్చాయి. ధరణిలో ఆమె కథలు ఎక్కువగా వస్తుంటాయి. ‘పయనించే ఓ చిలుకా’ కథకు కథామంజరివారి బహుమతి వచ్చింది. న్యూజెర్సీవారు ఆమె రాసిన ‘అభీష్టం’ అనే కథను ప్రచురించారు. అక్షరయాన్ వారి మాతృ వందనం సత్కారం జీవితంలో గొప్పగా భావిస్తారు ఆమె.

త్వరలో మరో పుస్తకం
నాకు బెంగాలీ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ బాగా వచ్చు. చాలా ఆలస్యంగా రచనలు చేయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు ఒక్కో పుస్తకంలో 51 కథలతో మూడు పుస్తకాలు తీసుకొచ్చాను. ఇంకా వంద కథలు ఉన్నాయి. వాటితో కూడా మరో పుస్తకం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడూ ఏదో ఒకటి చదవడం, రాయడం నాకు ఇష్టం. ఇంగ్లాష్, తెలుగులో వంటల పుస్తకం కూడా తీసుకొచ్చాను. మావారు చాలా ఏండ్ల కిందటే కన్నుమూశారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఆదిత్య బిర్లా వారి ఆఫీసులో గ్రూప్ హెడ్‌గా పని చేస్తుంది. చిన్నమ్మాయికి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. వర్క్ ఫ్రం హౌమ్ చేస్తుంది. ప్రస్తుతం నేను ఆమెతోనే ముంబయి లో ఉంటున్నాను. నా కథలన్నీ తనే ఎడిట్ చేసి పెడుతుంది. మా పెద్దమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది. మా అల్లుడు బెంగాలీ. నాకు ఒక మనుమడు. యు.ఎస్‌లో రీసర్చ్ చేస్తున్నాడు.
– అచ్యుతుని రాజ్యశ్రీ