గర్భాశయ ఫైబ్రాయిడ్/లియోమయోమాస్ అనేవి స్త్రీల గర్భాశయంలో అనియంత్రిత పెరుగుదలతో ఏర్పడే కండరపు కణితులు. ఇవి క్యాన్సర్ కానివి. తెలుగులో వీటిని ‘గర్భాశయ కణితులు’ లేదా ‘గర్భాశయ గడ్డలు’ అంటారు. ఇవి చిన్న గింజలంత పరిమాణం నుండి అతి భారీగా, పెద్ద పుచ్చకాయంత పరిమాణంలో కూడా ఉండవచ్చు. కొందరికి వీటి వల్ల ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొందరికి తీవ్ర రక్తస్రావం, నొప్పి, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు కలిగించవచ్చు. గణాంకాల ప్రకారం 20-80 శాతం మంది స్త్రీలు 45-50 ఏండ్ల వయసులో ఫైబ్రాయిడ్లతో బాధపడే అవకాశముంది. కొందరిలో రుతుక్రమం ప్రారంభం కాకముందు, అతి తక్కువ మందిలో రుతు విరతి తర్వాత కూడా ఇవి అరుదుగా కనిపిస్తాయి. మరి ఇవి ఎందుకు వస్తాయో పరిష్కారాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం…
ఫైబ్రాయిడ్ ఉత్పత్తికి కారణాలు
స్పష్టమైన కారణాలు ఇంతవరకు గుర్తించలేదు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన మార్పులు, ఊబకాయం, ఆలస్యమైన రుతువిరతి, విటమిన్ డి లోపం, అధిక రక్తపోటు వంటివి కొన్ని కారణాలుగా ఉండొచ్చు. ఒక అధ్యయనం ప్రకారం పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అనే హార్మోనల్ జబ్బుతో బాధపడుతున్న మహిళల్లో, జబ్బు లేని మహిళల కంటే 65 శాతం ఎక్కువ ఫైబ్రాయిడ్లను కలిగి ఉన్నారని తేలింది.
ఫైబ్రాయిడ్లు పలు రకాలా?
అవును.. ఫైబ్రాయిడ్లు గర్భాశయం బయటి, మధ్య, లోపలి పొరలలో దేని నుండి అయినా పెరగవచ్చు. కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా వృద్ధి చెందవచ్చు. గర్భాశయంలో స్థానికరణాన్ని బట్టి ఇంట్రామ్యూరల్, సబ్‌సెరోసల్, సబ్‌ముకోసల్, పెడున్క్యులేటెడ్, సర్వైకల్, బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్లు అని ఆరు రకాలుగా వర్గీకరించబడ్డాయి.
లక్షణాలు
గర్భాశయ ఫైబ్రాయిడ్ ఉన్న 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. తరచుగా సాధారణ వైద్య తనిఖీలో బయటపడుతుంటాయి. కొందరిలో దీర్ఘకాలపు, తీవ్ర ఋతు స్రావం, నొప్పితో కూడిన సంభోగం (డిస్పేరూనియా), పొత్తి కడుపులో అసౌకర్యం, నొప్పి వంటివి సాధారణ లక్షణాలైతే తరచుగా మూత్రవిసర్జన, వాష్రూమ్ చేరేలోపలే మూత్రం కారిపోవడం వంటి తీవ్ర ఇబ్బందులు, మలబద్ధకం, సంతానలేమి, పునరావృత గర్భస్రావాలు, అసాధారణ పిండస్థానం, అకాల ప్రసవం వంటి సమస్యలు ఇంకొందరిలో తలెత్తవచ్చు. గర్భధారణ సమయంలో ఫైబ్రాయిడ్ మెలితిప్పబడటం (రెడ్ డీజెనెరేషన్) అనేది తీవ్రమైన సమస్యలలో ఒకటి. పైన పేర్కొన్న సబ్‌సెరోసల్, పెడన్క్యులేటెడ్ ఫైబ్రాయిడ్ మెలితిరగడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు. మూత్రవిసర్జన నిలుపుదల, తీవ్రమైన ఇబ్బంది, మూత్రపిండాల వైఫల్యం, యోని/ఇంట్రా-పెరిటోనియల్ అంతర్గత రక్త స్రావం, మెసెంటెరిక్ సిరలో రక్తం గడ్డ కట్టడం, పేగు గ్యాంగ్రీన్ అనగా ప్రేగులకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి, ప్రేగులు చనిపోవడం వంటివి రెడ్ డీజెనెరేషన్ వల్ల జరుగవచ్చు.
చికిత్స ఎప్పుడు అవసరం
ఫైబ్రాయిడ్ అనగానే గర్భసంచిని తీసివేయడం చికిత్స కానే కాదు. చాలా సందర్భాలలో వీటికి చికిత్స అవసరం పడదు. పలు రకాల గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కాలక్రమేణా వాటంతట అవే తగ్గిపోతాయి. కొన్ని సంతానోత్పత్తి వయసులో అభివృద్ధి చెందుతుంటాయి. మరికొన్ని అలాగే ఉండిపోతాయి. రుతువిరతి (మెనోపాజ్) తర్వాత ఈస్ట్రోజెన్ స్టిమ్యులేషన్ లేకపోవడంతో అన్ని ఫైబ్రాయిడ్స్ సాధారణంగా పెరగడం ఆగిపోతాయి. అయితే రుతుక్రమం ఆగిపోయే వయసులో గర్భాశయ ఫైబ్రాయిడ్ల పెరుగుదలను, ఊబకాయం వంటివి ప్రేరేపించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రుతువిరతి తర్వాత కూడా ఫైబ్రాయిడ్స్ పెరుగుతుంటే చికిత్స తప్పక చేయించుకోవల్సిందే.
చికిత్స ఎలా ఉంటుంది?
స్త్రీ వైద్య నిపుణులు సాధారణంగా కడుపు నొప్పి, రక్తస్రావం వంటి ఇబ్బందులకు నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, యాంటీఫైబ్రినోలైటిక్స్, గోనాడోట్రోపిన్ విడుదల చేసే హార్మోన్ అగోనిస్ట్ మందులు, విటమిన్, ఐరన్ సప్లిమెంట్స్, ప్రొజెస్టెరోన్ విడుదల చేసే గర్భాశయ పరికరాల వాడకం వంటి చికిత్సా విధానాలతో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ పెరుగుదలను, వాటివల్ల కలిగే సమస్యలను అరికట్టే ప్రయత్నం చేస్తారు. చాలా సందర్భాలలో సఫలీకృతులౌతారు. ఆలా కాని పక్షంలో వాటివల్ల ప్రయోజనం లేకపోయినా/ సైజు పెరుగుతు న్నట్టనిపించినా శస్త్రచికిత్సను ఎంచుకుంటారు. గర్భాశయ ధమని యొక్క ఎంబోలైజేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, హిస్టెరోస్కోపిక్ మైయోమెక్టోమీ, ఎండోమెట్రియల్ అబ్లేషన్, మైయోలిసిస్, మైయోమెక్టమీ – ఓపెన్, లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్, ఉదర మయోమెక్టమీ లేదా లాపరోటమీ, టోటల్ హిస్టెరెక్టమీ – ఓపెన్, లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్ ఇలా మహిళ ఆరోగ్య స్థితి, వయసు, ఫైబ్రాయిడ్ రకం సైజు/సూచికల తీవ్రత/సంక్లిష్టతల దృష్ట్యా ఏ శస్త్రచికిత్స చేయాలో నిర్ణయిస్తారు. ఎంబోలైజేషన్ చికిత్స వల్ల గర్భాశయ ఫైబ్రాయిడ్‌కి రక్తసరఫరా ఆగిపోతుంది. అటువంటప్పుడు తగు మోతాదులో రక్తం అందక ఫైబ్రాయిడ్ క్షీణించి, కాలక్రమేణా కుంచించుకొని, కనుమరుగైపోతుంది. ఒకవేళ చాలా పెద్ద ఫైబ్రాయిడ్ అయితే దానిలో కాల్షియం చేరి, నిక్షేపణ జరిగి గట్టిపడుతుంది. పరిమాణం కూడా తగ్గక, కాలక్రమేణా కాల్సిఫైడ్ యుటెరైన్ ఫైబ్రాయిడ్‌గా రూపాంతరం చెందుతుంది. బరువు, ఒత్తిడితో కలిగే సమస్యలు పునరావృతం కావొచ్చు! ఇది ప్రధానంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో, వారెప్పుడో చేయుంచుకొన్న చికిత్సకు సంబంధించిన దీర్ఘ కాలిక పరిణామంగా దీన్ని భావించవచ్చు.
నివారణ సాధ్యమేనా?
క్రమశిక్షణతో కూడిన ఒత్తిడిలేని జీవనశైలి, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, శరీర బరువు, ఎత్తు, బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ) పరిధిలో ఉండేటట్టు చూసుకుంటే సాధ్యమే అంటున్నాయి అధ్యయనాలు. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది. బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, టర్నిప్ వంటి బీటా-కెరోటిన్, ఫోలియేట్, ఫైబర్, విటమిన్ సి, ఇ, కె, అలాగే ఇతర పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభించే తాజా కూరగాయలు ఆహారంలో చేర్చుకుంటే గర్భాశయ ఫైబ్రాయిడ్‌ను తగ్గించవచ్చు. గర్భాశయ ఫైబ్రాయిడ్‌లను నివారించడంలో ఐరన్, మెగ్నీషియం వంటి సప్లిమెంట్స్ సహాయపడతాయి.
నిర్ధారణ ఎలా చేస్తారు?
లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే సాధారణ కటి పరీక్షలో ఫైబ్రాయిడ్‌లు గుర్తించబడతాయి. చికిత్స ప్రారంభించే ముందు ఫైబ్రాయిడ్ల రకాన్ని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు, ఉదరం, పెల్విస్ అల్ట్రాసౌండ్, ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసోనోగ్రఫీ, కంప్యూటెడ్ టోమోగ్రఫీ, మాగెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్, హిస్టెరోస్కోపీ, హిస్టెరోసల్పింగోగ్రఫీ, సోనోహిస్టెరోగ్రామ్ వంటి పరీక్షలు నిర్వహిస్తారు.
డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్


