నవతెలంగాణ-హైదరాబాద్ : వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రే ఓ యువతి పాలిట మృత్యుశాలగా మారింది. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఓ ఉన్మాది 19 ఏళ్ల యువతిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు అక్కడే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… నర్సింగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఈ నెల 27న ఆస్పత్రికి వచ్చింది. ప్రసూతి వార్డులో ఉన్న స్నేహితురాలి బంధువును చూసేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయలుదేరింది. అయితే, ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న అభిషేక్ కోష్టి అనే యువకుడు అప్పటికే ఆసుపత్రి వద్ద ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. వార్డు నంబర్ 22 బయట ఆమెతో కొద్దిసేపు మాట్లాడిన అభిషేక్, ఒక్కసారిగా యువతిపై దాడికి దిగాడు.
సోమవారం వెలుగులోకి వచ్చిన మొబైల్ వీడియో ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. నల్ల చొక్కా ధరించిన అభిషేక్, యువతిని చెంపపై కొట్టి కిందపడేశాడు. ఆమె ఛాతీపై కూర్చుని, తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ ఘోరం జరుగుతున్నా అక్కడున్న వైద్యులు, నర్సులు, వార్డు బాయ్‌లు, ఇతర ప్రజలు నిలువరించే ప్రయత్నం చేయకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. తీవ్ర రక్తస్రావంతో విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.