Monday, July 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమాస్టర్‌ ప్లాన్‌ అంటే మ్యాప్‌ కాదు..

మాస్టర్‌ ప్లాన్‌ అంటే మ్యాప్‌ కాదు..

- Advertisement -

– ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రణాళిక ఉండాలి : హైదరాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌పై హెచ్‌సీఎఫ్‌ చర్చాగోష్టిలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ అంటే ఒక మ్యాప్‌ మాత్రమే కాదనీ, ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికగా ఉండాలని అర్బన్‌ పాలసీ నిపుణులు డాక్టర్‌ దొంతి నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో ”హైదరాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ – తీరుతెన్నులు – నిశిత పరిశీలన” అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ నగర అభివద్ధి ప్రణాళిక – మాస్టర్‌ ప్లాన్‌ ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలని చెప్పారు. ఏ మాస్టర్‌ ప్లాన్‌లోనయినా నిపుణుల భాగస్వామ్యం ఉంటుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, జీవనోపాధి అవకాశాలు కల్పించేలా, తాగునీరు, డ్రయినేజీ, ప్రజారోగ్యం, విద్యా అవకాశాలు, ట్రాఫిక్‌, కాలుష్యం మొదలగు సమస్యలకు పరిష్కారం చూపేలా మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలని అభిప్రాయపడ్డారు. కానీ అందుకు భిన్నంగా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏవో ప్రయివేట్‌ కన్సల్టెన్సీలకు అప్పజెప్పి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందకుండానే… రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో అనేక కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నదనీ, ప్లాన్‌కు అనుగుణంగా ప్రాజెక్టులు ఉంటాయా ? లేక ప్రాజెక్టులు ప్రకటించి, ప్రణాళికను రూపొందిస్తారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు, హెచ్‌ఎండీఏ పరిధిని రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరణ జరుగుతుందని అదే అభివృద్ధి అని లీకుల మీద లీకులు ఇస్తున్నారని తెలిపారు. 2011 మాస్టర్‌ ప్లాన్‌లోని తప్పులు పునరావృతం కాకుండా శాస్త్రీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల భాగస్వామ్యంతో మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సామాజిక కార్యకర్త ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ 2011లో తయారైన మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్ష జరగాలనీ, ఆ తప్పులు పునరావృతం కాకుండా కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని చెప్పారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయివేటు కన్సల్టెన్సీకి అప్పజెప్పినట్టుగా తెలుస్తున్నదన్నారు. అలా చేస్తే అంతిమంగా ఆ ప్రణాళిక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజాసంస్థలు, సామాజిక నిపుణుల సూచనలు, సలహాలు స్వీకరించి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌సీఎఫ్‌ సలహాదారులు రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ఉపయోగపడే ఒక మంచి మాస్టర్‌ ప్లాన్‌ని సాధించుకునేందుకు ఇతర ప్రజా సంఘాలతో కలిసి హెచ్‌సీఎఫ్‌ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమానికి హెచ్‌సీఎఫ్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ జయసూర్య అధ్యక్షత వహించగా ఫోరం ప్రధాన కార్యదర్శి కె వీరయ్య, నాయకులు ఎం.శ్రీనివాసరావు, పి.నాగేశ్వరరావు, రాజమౌళి, సుకుమార్‌, సంగీత, మాధవి, గోపాల్‌, పి.మోహన్‌తో పాటు పలు సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -