– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం
– కాలానికనుగుణంగా పనితీరు మారాలి : డీపీఆర్‌వోల వర్క్‌షాపులో సమాచార మంత్రి పొంగులేటి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణకు స్పష్టమైన కొత్త దిశను చూపించిందని రాష్ట్ర సమాచార, హౌసింగ్, రెవెన్యూ శాఖ హంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు ఏ మార్పుకోసమైతే కాంగ్రెస్‌పై విశ్వాసం ఉంచారో, ఆ మార్పు రెండేండ్ల కాలంలోనే ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నదన్నారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. తెలంగాణ సమాచార పౌర సంబంధాలశాఖ, మీడియా అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన జిల్లా ప్రజా సంబంధాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన పునశ్చరణ తరగతులకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మేం అధికారం చేపట్టినప్పుడు అన్నీ రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొందన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ సంక్షోంభం నుంచి బయటపడి, అభివృద్ధి, సంక్షేమాలను పరుగులు పెట్టిస్తున్నాయని అన్నారు. సీఎం గారి ఆలోచనలకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ పేదలకు అండగా నిలిచామని చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గృహనిర్మాణం, సన్న బియ్యం పంపిణీ, రేషన్‌కార్డులు, ఉపాధి కల్పన వంటి ప్రతి రంగంలోనూ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెడుతున్నాయని అన్నారు. అయితే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రజలకు చేరడం లేదని వివరించారు. ప్రస్తుత మీడియా మార్పులకు అనుగుణంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు డిజిటల్ మీడియా సమన్వయంతో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వేగంగా విస్తరిస్తున్న సోషల్‌మీడియాను సైతం ప్రచారానికి శక్తివంతమైన ఆయుధంగా వినియోగించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఈ పని ఎక్కువగా జరగాలని చెప్పారు. ప్రతి జిల్లాకు సమర్థవంతమైన డీపీఆర్‌వోలను నియమించాలనీ, ఇతర విభాగాల్లో ఉన్నవారి డిప్యూటేషన్లను రద్దుచేయాలని ఆదేశించారు. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలనీ, ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రెండేండ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ మాస పత్రికను మంత్రి, ఇతరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐడీసీ చైర్మెన్ మువ్వ విజరుబాబు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, సీఎం సీపీఆర్వో జి మల్సూర్ పాల్గొన్నారు.
రెండేండ్లల్లోనే తెలంగాణకు కొత్త దిశ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



