చైనాలో ప్రారంభం
బీజింగ్ : చైనాలో దృష్టి లోపం ఉన్న ప్రయాణికుల కోసం షెన్‌జెన్ మెట్రో శనివారం ఏఐ ఆధారిత రోబోటిక్ ‘గైడ్ డాగ్’ను ప్రారంభించింది. ప్రపంచ రైలు రవాణా పరిశ్రమలో ఇలాంటి సాధనాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి అని దేశీయ మీడియా సంస్థలు తెలిపాయి. క్సియాసాన్ అని పిలవబడే ఈ స్మార్ట్ రోబోటిక్ గైడ్ డాగ్ (చిన్న వెల్లుల్లి) దక్షిణ చైనాలోని గువాంగ్‌డాంగ్ రాష్ట్రం పుటియన్ జిల్లాలో ఉన్న హువాంగ్‌ముగాంగ్ రవాణా కేంద్రంలో ట్రయల్ కార్యకలాపాలు ప్రారంభించింది. దృష్టి లోపం తక్కువగా ఉన్న వారు మెట్రో స్టేషన్లలో తిరగడానికి ఇది సహాయకారిగా వ్యవహరిస్తుంది. రైలు రవాణాలో ఇలాంటి సర్వీసును ప్రారంభించడం ఇదే ప్రథమం.
వికలాంగులకు మద్దతు ఇవ్వడంలో ఏఐ పాత్రను ఇది నొక్కి చెబుతోంది. రోబోటిక్ గైడ్ డాగ్‌కు భద్రతకు సంబంధించిన పరీక్షలు, తనిఖీలు పూర్తయ్యాయి. ఒక నెల రోజుల పాటు దృష్టి లోపం ఉన్న ప్రయాణికుల వెంట సిబ్బంది ఉంటూ సహకారాన్ని అందిస్తారు. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే ఇతర స్టేషన్లలో కూడా దీనిని ప్రవేశపెడతారు. 12వ జాతీయ వికలాంగుల క్రీడలకు మద్దతుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ‘ఇది అచ్చంగా నా కళ్ల మాదిరిగానే నేను ఎక్కడికి వెళ్లాలని అనుకున్నా అక్కడికి నన్ను తీసికెళుతోంది’ అని దృష్టి లోపం ఉన్న ఓ ప్రయాణికుడు సంతోషంతో తెలిపాడు.



