డాలర్‌తో 90.21కు క్షీణత
పతనంపై ప్రభుత్వం ఆందోళన చెందడం లేదన్న సీఈఏ
ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే : నిపుణులు
ముంబయి : భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందన్న మోడీ సర్కార్ గొప్పలకు భిన్నంగా అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ అదోపాతాళానికి పడిపోయింది. రూపీ రోజు రోజుకు క్షీణిస్తూ భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో తాజాగా డాలర్‌తో రూపాయి 90 దాటి మరింత క్షీణించింది. బుధవారం మరో 25 పైసలు కోల్పోయి రికార్డ్ స్థాయిలో 90.21కు పతనమయ్యింది. ఇంతక్రితం మంగళవారం సెషన్‌లో 43 పైసలు పతనమై 89.96 ఆల్‌టైం కనిష్టం వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగొచ్చనే అంచనాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి ఈక్విటీలను తరలించుకుపోవడం, అమెరికాతో నెలకొన్న వాణిజ్య ఒప్పంద అనిశ్చితి, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ తదితర అంశాలు రూపాయి విలువను అమాంతం పడిపోయేలా చేస్తోన్నాయి.
రూపాయి విలువ వరుసగా పడిపోతోంటే ఇటు బీజేపీ పాలకవర్గాలు కానీ.. అటు ఆర్బీఐ కానీ స్పందించకపోవడం గమనార్హం. పైగా దీనిపై ప్రభుత్వం ఎలాంటి ఆందోళన చెందడం లేదని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు పేర్కొనడం విశేషం. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల పరంపర, భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో ఇప్పటికీ ఒక స్పష్టత రాకపోవడమూ కరెన్సీ విలువ తగ్గుదలకు కారణమని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు. రూపాయి పతనం ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోయనుందని హెచ్చరిస్తోన్నారు.
ధరలకు ఆజ్యమే..
రూపాయి పతనంపై పెద్ద ఆందోళన అవసరం లేదని సీఈఏ అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యలు కరెన్సీ క్షీణత తీవ్రతను తగ్గించుకోవడానికి చేసిన వ్యాఖ్యలుగా కనబడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో తగ్గడం ద్వారా తీవ్ర పరిణామాలే ఉంటాయని అనేక అంశాలు స్పష్టం చేస్తోన్నాయి. ముఖ్యంగా దిగుమతులు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. దేశంలో ప్రజలు అధికంగా ఉపయోగించే ముడి చమురు, బంగారం, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి దిగుమతి వస్తువుల ధరలు అమాంతం పెరుగుతాయి. దీని ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. అంతిమంగా ఇతర ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ పరిణామాలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తాయి. ప్రజలు ఆదాయాలు హరించుకుపోవడంతో పొదుపు పడిపోనుంది.
విదేశీ విద్యా భారం..
విదేశాలకు వెళ్ళేవారికి ఖర్చులు అధికమవుతాయి. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఫీజులు, జీవన వ్యయం మరింత భారం కానుంది. ఇప్పటికే డాలర్‌తో రూపాయి పతనానికి తోడు అమెరికా లాంటి దేశాల్లో గత రెండు, మూడేండ్లుగా ఫీజులు భారీగా పెరిగాయి. మరోవైపు భారత కంపెనీలు లేదా ప్రభుత్వం విదేశాల్లో తీసుకున్న రుణాలపై అధికంగా వడ్డీ, అసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపులు పెరగడం ద్వారా దేశానికి ఆర్థిక భారంగా మారుతాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోనున్నాయి. దేశ కరెన్సీ బలహీనపడితే గ్లోబల్ మార్కెట్లలో దేశ ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు పెరిగి పెట్టుబడులు రాకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆందోళనేమి లేదు : సీఈఏ నాగేశ్వరన్
డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోవడంపై ప్రభుత్వమేమీ ఆందోళన చెందడం లేదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) సమావేశంలో నాగేశ్వరన్ మాట్లాడుతూ.. రూపాయి విలువ 90 రూపాయల మార్కు దాటడం వల్ల ద్రవ్యోల్బణంపై గానీ, ఎగుమతులపై గానీ ప్రభావం ఉండబోదన్నారు. వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని అన్నారు.



