ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెటా టీఎస్ వినతి
హైదరాబాద్ : పాఠశాల స్థాయి నుంచే క్రీడలను అభివద్ది చేసేందుకు ప్రతి స్కూల్, కాలేజ్‌లో వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. అయితే, కాంట్రాక్టు పద్దతిలో పాఠశాలల్లో వ్యాయాయ విద్య ఉపాధ్యాయులను నియమించాలని భావించటం సమంజసం కాదు. 1804 ఉన్నత పాఠశాలలకు ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, 2447 ప్రాథమికోన్నత పాఠశాల్లలో పీఈటీ పోస్టులు మంజూరు కాలేదు. నూతనంగా 4251 పోస్టులను మంజూరు చేసి రెగ్యులర్ డిఎస్సీలో భర్తీ చేస్తారని అభ్యర్థులు ఎదురుచూస్తుండగా.. కాంట్రాక్టు పద్దతిలో వ్యాయామ విద్య ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని సీఎం నిర్ణయించటంతో తెలంగాణలో క్రీడాకారులు తీవ్రంగా నష్టపోతారు. తెలంగాణ సమగ్ర క్రీడాభివద్ధికి ప్రత్యేక డిఎస్సీతో పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని వ్యాయాయ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (పెటా టిఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, కష్ణమూర్తి గౌడ్ డిమాండ్ చేశారు.
‘ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ఇటీవల స్పోర్ట్స్ హబ్ సమావేశంలో ప్రతి స్కూల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్ ఉండాలని గొప్ప సూచన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కెజిబివి, మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న పీఈటీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూల్స్‌లో పీఈటీలను సైతం కాంట్రాక్టు పద్దతిలో తీసుకుని సమస్యలను రెట్టింపు చేయవద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో చొరవ తీసుకుని 1804 ఉన్నత పాఠశాల్లలో ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, 2447 ప్రాథకమికోన్నత పాఠశాల్లలో పీఈటీ పోస్టులను నూతనంగా మంజూరు చేసి, తక్షణమే ప్రత్యేక డిఎస్సీతో భర్తీ చేయాలి’ అని పెటా టిఎస్ నేతలు కోరారు.