మెమోరియల్‌గా నెల్లూరులోని ఆయన నివాసం : ఆత్మార్పణ దినోత్సవం సభలో సిఎం చంద్రబాబు
అమరావతి : అమరావతిలో భావితరాలకు గుర్తుండేలా అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహంతోపాటు స్మృతి వనాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గౌరవం కోసం ఆత్మార్పణగావించారని, స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారితో, ఆ తర్వాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడారన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం ప్రభుత్వం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం 58 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి, రాష్ట్రాన్ని సాధించారన్నారు.
ఆయన ఆత్మార్పణ చేసిన దినాన్ని ‘డే ఆఫ్ శాక్రిఫైజ్’ కింద డిసెంబరు 15ను జరుపుతున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చి 16 వరకు ఆయన శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. చెన్నైలోని ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని సంరక్షించాలని తాము నిర్ణయించామన్నారు. నెల్లూరులో ఆయన నివాసం ఉన్న భవనాన్ని మెమోరియల్‌గా మారుస్తామన్నారు. రకరకాల ప్రాంతాల్లో వేర్వేరుగా కులధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారని, అలాకాకుండా ఇక మీదట రాష్ట్రమంతా అందరికీ ‘ఆర్యవైశ్య’ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అమరావతిలో ఆయన విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైజ్‌గా నిర్మిస్తున్నామని, వచ్చే మార్చి 16న ఆయన 125వ జయంతి సందర్భంగా ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం 6.8 ఎకరాల భూమిని కేటాయించినట్లు సిఎం వెల్లడించారు. తెలుగు వాళ్లం ఓ శాశ్వత చిరునామా లేకుండా కొన్ని రోజులు చెన్నై కింద, మరికొన్ని రోజులు కర్నూలులో, మరికొంత కాలం హైదరాబాద్‌లో ఉంటూ అభివృద్ధి చేసుకున్నామన్నారు. నేడు అమరావతిని నిర్మించుకుంటూ అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇటీవల ఆర్‌బిఐ ఇచ్చిన నివేదికలో కూడా ఫలాలు, చేపలు పండించే ప్రాంతంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని పేర్కొందన్నారు. 18 నెలల్లో రూ.21 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం రాజధాని పేరు కూడా చెప్పుకోలేని స్థితి ఉండేదని, మూడు రాజధానులంటూ మహా కుట్ర చేశారన్నారు. నేడు గర్వంగా మన రాజధాని అమరావతి అని చెప్పుకోగలమన్నారు. మెడికల్ కళాశాలల విషయంలో కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారన్నారు. రహదారులైనా పిపిపి మోడ్‌లో నిర్మించి ఆఖరున ప్రభుత్వానికి అప్పజెబుతారని, అదే తరహాలో మెడికల్ కళాశాలలను నిర్మిస్తున్నామన్నారు. కాలేజీలు కట్టినా ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయని అన్నారు. పిపిపి విధానం వచ్చిన తర్వాతే రహదారులు, ఎయిర్‌పోర్టులు వంటి మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటి వల్ల ఆదాయం పెరిగి ప్రజల సంపద కూడా పెరుగుతుందన్నారు. పేదవారిని ఆదుకోవడానికే పి4 విధానాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చామని, కన్యకాపరమేశ్వరి ఆత్మత్యాగం చేసిన రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, కందుల దుర్గేష్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ పాల్గొన్నారు.
భావితరాలకు గుర్తుండేలా.. పొట్టి శ్రీరాములు స్మృతి
- Advertisement -
- Advertisement -



