విరామం లేని పని గంటలు
ఒత్తిడి, అలసటతో ఉద్యోగులు సతమతం
మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్న వైనం
న్యూఢిల్లీ : భారత కార్పొరేట్ రంగం ఇప్పుడు ఓ నిశ్శబ్ద విపత్తును ఎదుర్కొంటోంది. విపరీతమైన ఒత్తిడి, ఎంత చేసినా తరగని పని కారణంగా ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతున్నారు. ఇదో వృత్తిపరమైన సిండ్రోమ్ అని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చెబుతోంది. ఉద్యోగులకు విధి నిర్వహణ వ్యసనంగా మారిపోతోంది. వారు అందులోనే కూరుకుపోయి బయటికి రాలేకపోతున్నారు. పని ప్రదేశంలో తక్షణమే వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టని పక్షంలో పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
రెడ్ జోన్‌లో ఉద్యోగులు
ఆవిష్కరణలకు, ఆర్థిక వృద్ధికి ఎంతగానో దోహదపడుతు న్న మన కార్పొరేట్ రంగంలో ఇప్పుడు అలసట, ఆందోళన, ఉత్ప్రేరకాలపై మౌనంగా ఆధారపడడం కన్పిస్తున్నా యి. కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని, వారు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని ముంబయిలోని సమర్పణ్ మెంటల్ హెల్త్ సంస్థకు చెందిన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ భక్తి జోషి ఆందోళన వ్యక్తం చేశారు. విరామం లేకుండా పని చేయడం, వృత్తిపరమైన పోటీ కారణంగా ఉద్యోగులు ‘రెడ్ జోన్’లోకి వెళ్లిపోతున్నారని ఆమె తెలిపారు.
మాదక ద్రవ్యాలకు బానిసలై…
మన దేశంలో పనిచేసే వయసున్న వారిలో సుమారు 60 శాతం మంది దీర్ఘకాలిక అలసట, అధిక పనిగంటలు, ఉద్యోగ అభద్రత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. విరామం అనేదే లేకుండా నిరంతరం పనిచేస్తుంటే తమలో వృత్తిపరమైన నైపుణ్యం తగ్గుతోందేమోనన్న అభిప్రాయం కూడా వారిలో కలుగుతోంది. ఐటీ, ఫైనాన్స్, కన్సల్టింగ్, మార్కెటింగ్ వంటి రంగాలలో ఉన్న వారు రోజుకు 14 గంటల వరకూ పని చేస్తుంటారు. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి వారు ఆల్కహాల్, నికోటిస్, నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు.
ఎగ్జిక్యూటివ్‌లు గతంలో అప్పుడప్పుడూ మాదక ద్రవ్యాలు తీసుకునే వారు. కానీ ఇప్పుడది సర్వసాధారణమై పోయింది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి నుంచి దూరం కావడానికి మద్యం, సిగరెట్లు, ఉత్ప్రేరకాలు…చివరికి ఓవర్-ది-కౌంటర్ మందులు కూడా తీసుకుంటున్నారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2019లో ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం దేశంలోని పురుషుల్లో మద్యపానం 27.3 శాతం ఉండగా మహిళల్లో 1.6 శాతంగా ఉంది. అయితే ఇది పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణాల్లో పని చేస్తున్న వృత్తి నిపుణుల్లో మరింత ఎక్కువవుతోంది.
భావోద్వేగ ఒత్తిడి
కార్పొరేట్ రంగంలో సమావేశాలు జరిగేటప్పుడు మద్యం సేవించడం షరా మామూలుగా మారింది. ఉద్యోగులు, అధికారుల మధ్య జరిగే చర్చల సందర్భంగా భావోద్వేగాలకు సంబంధించిన వ్యక్తిగత అంశాల ప్రస్తావనే ఉండదు. ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్ నివేదిక ప్రకారం దేశంలోని పెద్దల్లో సుమారు 10.6 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. వీరిలో 70 నుంచి 92 శాతం మందికి తగిన చికిత్స అందడం లేదు. కోవిడ్-19 తర్వాత నిశ్శబ్ద సంక్షోభం మరింత తీవ్రమైంది. ఇంటి నుంచే పని చేసే అవకాశం దక్కిన ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. కార్యాలయ, వ్యక్తిగత స్పేస్ మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. ఫలితంగా పనిగంటలు బాగా పెరిగాయి. దానితో పాటే భావోద్వేగ ఒత్తిడి కూడా పెరిగింది. మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.



