– తొలగించిన వారిని పున:నియమించడంపై పరిశీలించండి
– ఇతర సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారిస్తాం :ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశంలో మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టంలో భాగంగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ ఒకే వేతనం అమలు చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఫీల్డు అసిస్టెంట్లతో మంత్రి సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ…నాలుగు కేటగిరీలుగా వేతనాలిచ్చే పద్ధతి సరిగాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 7111 మంది ఫీల్డు అసిస్టెంట్లందరికీ సమాన వేతనం అమలు చేయాలని ఆదేశించారు. గతంలో వారికిచ్చిన హామీ మేరకు సర్క్యూలర్ 4779ని రద్దు చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఆ సర్క్యూలర్ ద్వారా తొలగించిన ఎఫ్‌ఏల పునర్నియామకం సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. మండలాఫీసుల్లో ఉపాధి హామీ విభాగంలో పనిచేస్తున్న 540 మంది ఎమ్‌సీసీ అటెండర్ల జీతాలను వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని సూచించారు. ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగులుగా మార్చే అంశం, వేతనాల పెంపు, తదితర న్యాయ, ఆర్థికపర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి భారీ కోతలు పెట్టడం వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయనీ, ఫీల్డ్ అసిస్టెంట్ల జీత భారం పూర్తిగా రాష్ట్రంపై పడుతున్నదని చెప్పారు. బదిలీలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. గ్రూప్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేస్తామనీ, హెల్త్ కార్డులు మంజూరీ చేస్తామని ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఎక్స్ గ్రేషియాను రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంపు, ఉపాధి కూలీల హాజరు నమోదు కోసం ఫీల్డ్ అసిస్టెంట్లకు మొబైల్ ఫోన్ల మంజూరు అంశాలను క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. వేతన సవరణ, ఆరోగ్య భద్రత, బదిలీ అవకాశాలు, బీమా కల్పన వంటి పలు కీలకాంశాలను పరిష్కరించిన మంత్రి సీతక్కకు ఫీల్డు అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు.
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఒకే వేతనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES