Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeసోపతివిరహమై వెల్లువెత్తిన పాట

విరహమై వెల్లువెత్తిన పాట

- Advertisement -

ప్రియుడికి ప్రేయసితో కలిసినపుడు అంతా ఆనందమే. ఆ ఆనందానికి అవధులు ఉండవు. విడిపోయినపుడు అంతా దుఃఖమే. ఆ దుఃఖానికి కూడా అవధులు ఉండవు. విడిపోని బంధమై ముడిపడుతుందనుకున్న ప్రేమ విడిపోయే పరిస్థితి వచ్చినపుడు ప్రేమికులిద్దరిలో చెప్పలేని బాధ కలుగుతుంది. ఆ బాధ నరకం కంటే ఘోరంగా తోస్తుంది. ఎవరికి చెప్పుకోలేక తమలో తామే చిత్రవధ అనుభవిస్తుంటారు ప్రేమికులు. ఆ బాధను ఈ పాట రూపంలో చెప్పాడు గీతరచయిత అలరాజు. 2021 లో నందన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మైల్స్‌ ఆఫ్‌ లవ్‌’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.
అలరాజు అలలవోలే సాగే అమతమయమైన పాటలు రాసిన కవి. రాస్తున్న కవి. ఈ విరహగీతాన్ని కూడా హదయాలను పట్టి ఊపేంతగా రాశాడు. వేదనాభరితమైన ఈ పాట వింటూ ఉంటే విరహంలో ఊగిసలాడే ప్రేమికుల కంట నీరు ధారగా ప్రవహిస్తుంటుంది. అంత మనసుపెట్టి రాశాడీ పాటను అలరాజు.
ప్రేయసీప్రియులు కలిసి వున్నప్పుడు హాయిగా, తీయగా గడిపారు. ఒకరికొకరు అన్నట్టుగా బతికారు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల , పెళ్ళి వల్ల వాళ్ళ మధ్యన ఎడబాటు వస్తుంది. అనుకోని కారణాల వల్ల వాళ్ళలోని ప్రేమను వాళ్ళే చంపే పరిస్థితి వస్తుంది. కలిసి వున్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ, తమలో తామే ఏడ్చుకుంటూ ఉంటారు. ఇదీ సినిమా సందర్భం.
వాళ్ళు కలిసి వున్నప్పుడు హాయిగానే ఉన్నారు. విడిపోయినపుడే తెలిసింది వాళ్ళకు ప్రేమనేది ఒకటి ఉందని. ఇన్నిరోజులు ప్రేమ అనేది ఉన్నదా..అన్న విషయం కూడా వాళ్ళకు తెలియలేదు. కారణం..కలిసి ఉన్నారు కాబట్టి. విడిపోయినపుడే, విరహంలో వేగినపుడే తెలుస్తుంది ప్రేమ విలువ. అందుకే ప్రేమ అనేది ఉందని మనసుకు ఇప్పటివరకు తెలియలేదు అనుకుంటున్నారు. ప్రేమ ఉందని, దానికి రుజువిదేనని ఇప్పుడే తెలిసింది వాళ్ళకి. లోలోపల చెలరేగుతున్న అలజడి అందుకు సాక్ష్యమని గ్రహించుకున్నారు.
వాళ్ళిద్దరి పరిచయం ఒక వింతగా జరిగింది. వాళ్ళిద్దరు అన్యోన్యంగా కలిసేంతగా ఆ పరిచయం ప్రణయమై ముడిపడింది. ఆ పరిచయం ప్రణయబంధమై ముడిపడి ఇప్పుడు విడిపోలేనంత భారంగా నిలిచింది. ఒకరినొకరు తలచుకుని రగిలిపోయేంత వేదన మిగిలింది వాళ్ళకి.
మన అడుగులు ఎటువైపు సాగినా ఆ అడుగులు మనల్ని అడుగుతూనే ఉన్నాయి. గతంలో మన ప్రేమ తాలూకు గుర్తుల్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి. అవి మనల్ని పిలుస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఎప్పటిలాగే జతగా కలిసి వుండమని అడుగుతూనే ఉన్నాయి. మనం కలిసి వున్నప్పటి సమయాన్ని తలచుకుంటున్నాను అంటూ వాళ్ళు బాధపడుతుంటారు.
వాళ్ళు కుదురుగా ఉండడం లేదు. వాళ్ళ ఎడబాటు వాళ్ళని చెప్పలేని బాధకు గురి చేస్తుంది. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా తెలియజేయబడింది. ప్రేమగా ముడిపడిన బంధం వెంటనే విడిపోతే ఆ యాతన ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అది మరణం కంటే భయంకరమైన యాతన.. అలా ముడిపడి శాశ్వతంగా నాతోనే ఉంటానని చెప్పి ఇలా విడిపోవడం భరించలేకున్నాను..అంటూ ఒకరికొకరు లోలోపలే నరకం అనుభవిస్తుంటారు. మనసులో మొదలైన ఈ బాధ..ఆగిపోయే వీలులేదు. నువు దూరం అవుతున్నానని తెలిశాక బతుకంతా ఇక బాధేనని నాకర్థమయింది. దేవుడిచ్చిన వరంలాగా ఒకరికి ఒకరం దొరికాము. ఈ దొరికిన వరం నా సొంతం కాదని, నాతో ఎప్పటికీ ఉండదని తెలిశాక మేఘం మనసున ఉరిమింది. కన్నులలో తడిసింది. అని అనుకుంటారు. మేఘం ఉరిమి కంటి నుండి నీరుగా ధారగా కురిసిపోతోందని వాళ్ళు భావిస్తున్నారు. ఈ సమయంలో కవి చేసిన భావన హదయవిదారకంగా కనిపిస్తోంది. మేఘమే కంటినుండి ధారగా..అంటే వర్షధారవోలే కురుస్తుందని అర్థం..
ఎదసడి..ఎదలోని లయ అడుగుతుంది నన్నే..ఒక్క క్షణం ఆగమని, నన్నే చూడమని అంటోంది. గతంలో జరిగిన పొరపాట్లని, తడబాట్లని ఎలా మార్చాలి. ఇపుడు మనల్ని విడదీస్తున్నది పెళ్ళే కదా. పెళ్ళి వలననే మన ఇద్దరి ప్రేమ విడిపోతోంది కదా. ఎవరిని నమ్మాలి మన దారి మారేటట్టు..ఎవరికి చెబితే మన బాధ తీరుతుంది. ఎన్నో విషయాలు మనసును దాటేశాయి. నీతో చెప్పాలని పెదవుల దాకా వచ్చాయి..కాని మొహమాటంతోటి ఆగిపోతున్నాయి. ఆ మాటలు పెదవుల దగ్గరే ఆగిపోతున్నాయి. ఎప్పటికి విడిచిపోని జతగా, తీయని ప్రేమకథగా నువు నాతో వుంటావని నీ కోసమే ఇలా ఎదురుచూస్తూ నేను నిలబడ్డాను..ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను..నన్ను అర్థం చేసుకో..అంటూ అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి ఒకరికి ఒకరు మనస్సాక్షిగా, మౌనంగా తమ బాధను చెప్పుకుంటున్నారు.
ప్రేమికుల విరహవేదనను వివరించే అత్యద్భుతమైన పాట ఇది.

  • డా||తిరునగరి శరత్‌చంద్ర,
    sharathchandra.poet@yahoo.com
    సినీ గేయరచయిత, 6309873682
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img