మన ఊళ్ళల్లో ఏ పెళ్ళిళ్ళు జరిగినా, ఏ పండుగలు, జాతరలు జరిగినా డీజే పెట్టి దుంకనిదే ఆ పెళ్ళికి, జాతరకి, పండగకి మజా రాదు. అది పండగ అనిపించుకోదు. డీజే పెడితే రోడ్డు మీద ఉన్న దుమ్ము నింగిదాకా చెలరేగిపోవాల్సిందే. అంత గోల గోల ఉంటది. ఊళ్ళో పెళ్ళైనా, సిటీలో పెళ్ళి అయినా, మాస్ జాతర అయినా, పబ్ లో పార్టీ అయినా.. దేనికైనా.. పాత కొత్తల మేలు కలయికతో డీజే కొట్టే వాడొకడున్నాడు. వాడి డీజే మ్యూజిక్ గురించి, మ్యూజిక్ తో వాడు చేసే మ్యాజిక్ గురించి ఈ పాట చెబుతోంది. 2024 లో శివ పాలడుగు దర్శకత్వంలో వచ్చిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాలో పవన్ రాసిన ఆ పాటనిపుడు చూద్దాం.
ఈ మధ్యే డీజే టిల్లు సినిమా చాలా పాపులర్ అయింది. అందులో హీరో డీజే తో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన పాట ఓ ఊపు ఊపేసింది. ఆ వరుసలోనే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమా వచ్చింది. ఈ సినిమాలో మూర్తి కూడా డీజేతో తన ప్రత్యేక ముద్రను పదిలపరుచుకుంటాడు.
మూర్తి డీజే కొట్టాడంటే ఎవ్వడైనా ఊగి ఊగి చిందేయాల్సిందే. అతడు ఓ పబ్ షోలో డీజేకి వెళతాడు. తన మ్యూజిక్ గురించి, తన గురించి గొప్పగా చెబుతూ ఈ పాటను పాడుతుంటాడు. అతని ఫ్యాన్స్ కూడా అతని చుట్టూ చేరి కేరింతలు కొడుతుంటారు.
అందరికీ సలాం చేస్తున్నా. నేను డీజే మూర్తిని వచ్చాను. నేను మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తాను. నేను డీజే మొదలెట్టానంటే పార్టీ మొత్తం గోల.. గోలే.. ఇక. రోడ్డు మీద మొత్తం జనం నిండిపోయి, మైండ్ బ్లాక్ అయిపోయి, పిచ్చెక్కిపోతారు అంటూ సౌండ్ రెడీ చేసి పార్టీ మొదలుపెడతాడు మూర్తి. మాస్ బీట్ కొట్టి దండాలు పెట్టండి. మీరెంతగా నన్ను రెచ్చగొడితే నేనంత కసిగా డీజే కొట్టగలను.. అంటూ చెలరేగిపోతాడు మూర్తి.
ఒక కారు కట్టించి స్పీకర్ పెట్టి.. లోపల దుమ్ము లేపే సౌండ్ ఇచ్చి పడేస్తా. అప్పుడు తెలుస్తది మీకు నా సత్తా ఏంటో.. అంటూ ఊగిపోతుంటాడు మూర్తి. నా డీజే గురించి, నా ఘనత గురించి మీరంతా ఫ్లెక్సీలు కట్టండి. మీ ఫోన్‌లలో వాట్సఫ్ స్టేటస్‌లలో పెట్టండి. అందరికీ షేర్ చేయండి.. అంటాడు. అలా రంగు రంగు అద్దాలు పెట్టుకుని, హీరోలా రాజసంగా దిగుతాడు మూర్తి. ఈ దునియా మొత్తం గిర్ర గిర్రా తిరిగేలా వాయించేస్తా అంటూ సౌండ్ పెంచుతాడు.
ఆంగ్రేజీ బీట్, పంజాబీ డోలే..ఇ లా ఏ ట్రెండ్ అయినా, ఏ ప్రాంతం అయినా ఎవరికి ఏ మ్యూజికల్ సిస్టమ్ నచ్చితే ఆ మ్యూజికల్ సిస్టమ్‌లో నా సత్తా చూపిస్తానంటాడు. పక్కా తెలంగాణ యాసలో అయినా, వెస్టర్న్ స్టైల్ అయినా, శుద్ధ శాస్త్రీయ సంగీతం అయినా.. ఏదైనా నేను కొట్టగలను. మిమ్మల్ని మెప్పించగలను అంటాడు. నా గొంతులో ఓ చుక్క పడ్డాదంటే చాలు ఇక రఫ్ ఆడించేస్తాను అంటున్నాడు.
సంగీతానికే మాష్టారుగా నిలిచాడు మూర్తి. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా, దావత్ జరిగినా పిలవగానే కారు కట్టించుకుని వెంటనే వెళ్ళిపోతాడు. తన డీజేతో అందరి మనసుల్ని దోచుకుంటాడు. రచ్చ రచ్చ చేసి వస్తాడు. అది మూర్తి చేసే మ్యాజిక్. ఏ గల్లీ అయినా గుల్లా గుల్లా చేసి ఆగంజేసేస్తాడు. మనసుల్లో ఉన్న బాధల్ని ఇట్టే మటుమాయం చేసే విద్య అతని మ్యూజిక్ లో ఉంది. మీ మీ ఫ్రెండ్స్ తో డీజే పార్టీకి రండి. ఒకరినొకరు గల్ల పట్టుకుని కొట్టుకుంటూ, చీర్సు కొట్టి తాగుతూ, ఊగుతూ ఎంజారు చేయండి. అంటున్నాడు మూర్తి. నాటు నాటు స్టెప్పులకైనా, మన సుబ్బడి డప్పు సప్పుడైనా నా డీజేలో వినొచ్చు. అన్నీ కలగలిసిన సంగీత సాగరం మూర్తి డీజే అని చెప్పుకుంటుంటాడు.
పూనకాలొచ్చి ఊగాలి బిడ్డా నేను డీజే కొడితే అంటూ గర్వంగా చెప్పుకుంటున్నాడు మూర్తి. మీకు నా డీజే నచ్చకపోతే ట్వీట్ పెట్టి నిర్మొహమాటంగా చెప్పవచ్చు. అని కూడా చెబుతున్నాడు మూర్తి. ఇరవై ఏళ్ళ వాళ్ళని ఊగిస్తా. అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఇరవై ఏళ్ళ కుర్రాడిలా సినిమాలు చూసి ఊగిపోతుంటారు కదా. అందుకని అరవై ఏళ్ళ వాళ్ళని కూడా నా డీజేతో మెప్పించి గంతులేయిస్తా అంటున్నాడు. నువ్వు ఎక్కడా సూడని పార్టీ స్టెప్పులు నా డీజేలో వేస్తావు. నీకు తెలియకుండానే వేస్తావు. అలా నీతో నా మ్యూజిక్ వేయిస్తుంది. అది నా డీజే మహిమ అని చెబుతున్నాడు మూర్తి. తల మొత్తం ఊగేలా, నీ తలతో పాటు శరీరం మొత్తం ఊగేలా మ్యూజిక్ స్టార్ట్ చేశా..అంటున్నాడు. నువు సింగిల్ అయినా, మింగిలు అయినా ఫర్వాలేదు. నా డీజే అందరి సొత్తు..ఇక్కడ అందరికి చోటుంది. రండి..మ్యూజిక్ ని ఎంజారు చేద్దాం. నా డీజే తో ఈ దునియా మొత్తాన్ని ఊపేద్దాం. ఏలేద్దాం అంటున్నాడు మూర్తి.
ఈ పాటను ఇన్నోవేటివ్ గా, ఈ జనరేషన్ కి బాగా కనెక్ట్ అయ్యేలా రాశాడు పవన్. తెలుగు, హింది, ఇంగ్లీష్ మూడు భాషల పదాల్ని గుమ్మరించాడు ఈ పాటలో.. ‘ఐసా పార్టీ షురూ కియా..’డీజే ఆగయా.. డీజే బాజే నాచే.., గల్లి గల్లీ..’ వంటి హిందీ, ఉర్దూ పదాలు, ‘సెల్ఫీ, షెర్, ట్వీట్, స్పీకర్, సెకండ్ కో షాట్..’ వంటి ఇంగ్లీష్ పదాలు.. ఇలా ఎన్నో కనిపిస్తాయి ఈ పాటలో..
యూత్ణ్‌కి మాంచి కిక్కిచ్చేలా, ఎంటర్‌టైన్ చేస్తుందీపాట.
పాట:
ఏ మియా మియా మియా సలామ్ మియా/ఐసా పార్టీ షురూ కియా/రోడ్డు బ్లాక్కై మైండ్ షాక్కై పిచెక్కలా/ఏ వాడా మచ్చా సౌండ్ రెడీ ఆ/డిజే మూర్తి వచ్చిండయ్యా మాస్ బీటు కొట్టిండంటే ఆడిపోలియా/హే దండాలు బెట్టు సలాంకొట్టు కారు కట్టు స్పీకర్ బెట్టు/కుల్లం కుల్లా ఇచ్చిపడేస్తా డీజే ఆగయా/హే ఫ్లెక్సీ కట్టు స్టేటసు బెట్టు/రంగు రంగు అద్దాలు బెట్టు/గిర్రా గిర్రా గిర్రామంటూ తిరగాల దునియా/ ఆంగ్రేజీ బీటే ఐనా/పంజాబీ డోలే ఐనా/మన తప్పొంగుతే ఐనా హే డీజే డీజే బాజే/బిడ్డా నీ స్టైల్ ఏదైనా పడ్డాక సుక్కెలోన/మన మాష్టారొచ్చిండంటే హే డీజే బాజే అంతా నాచే/నామ్ బోలే తో..డీజే సాబ్ దావత్ ఉంటే..పిలుస్తా/ గల్లీ గల్లీ దున్నేస్తా హల్లా గుల్లా చేసేస్తా/ సెకండ్ కో షాట్ ఐ/ దిల్ ఖుషి అయ్యే పాటరు పోవద్దురా మాటే ఇది డీజేగాని పార్టీ/ గల్లస్సుపట్టు చీర్సు కొట్టు దోస్తుగాని సొక్కాపట్టు/ నాటు నాటు స్టెప్పులు కొట్టు డీజే ఆగయా../ సెల్ఫీ కొట్టు షేరు కొట్టు నచ్చకుంటే ట్విట్ బెట్టు/ గిర్రా గిర్రా గిర్రామంటూ తిరగాలా దునియా/ దొరసాని పాటే ఐనా మన సుబ్బడి డప్పే ఐనా/ఒక ఊపు ఊగాలంటే హ డీజే డీజే బాజే/బిడ్డా నీ ఊరు ఏదైనా పడ్డాక సుక్కేలోన/ ఫుల్ పూనకాలే పైనా హే డీజే బాజే అంతా నాచే/ టిక్కు టాక్కు సప్పులోద్దు/ డీజే మూర్తి బీటే ముద్దు ఇరవై లా సిత్రాలన్నీ అరవై లా సూడలేవా/వంకలన్ని పక్కనెట్టి నచ్చిందే చేసుకుపోలేవా/ దే వా నువ్వు యెడా సూడని పార్టీస్టెప్పేయవా ఏరు వా/ తల సుట్టూ ఊగేలా/ తంబి వా ఆయే వా/నువ్ సింగిలు ఐనా మింగిలు ఐనా/ నో పర్వా ఇది అందరి సోతే రా..
- డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682