ఆ పాట పుట్టి ఇప్పటికీ పాతికేళ్ళు గడిచినా నిన్ననో, మొన్ననో రిలీజ్ అయినంత క్రేజ్ ఉంది. ఎన్నో జనరేషన్స్ కి కనెక్ట్ అయింది. ఇంకా..అవుతూనే ఉంది. ఆ పాట తెలంగాణ యాసలో రాసినది అయినా.. తెలుగు వారినందరినీ, తెలుగు మాతభాష కానివారిని కూడా ఉల్లాసంతో ఊగించింది. ఆ పాటలో అంత ఊపు ఉంది. ఆ పాట విన్నవారిలో ఊపు ఉంటుంది. ఆ పాటతో ఇండిస్టీని ఓ ఊపు ఊపేసిన గీత రచయిత గుండేటి రమేశ్. 2000 లో రవిచావలి దర్శకత్వంలో వచ్చిన ‘కాలేజ్’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.
గుండేటి రమేశ్ ఈ పాటతో ఓ కొత్త అధ్యాయాన్ని సష్టించాడు. సినిమాల్లో వచ్చిన తెలంగాణ జానపదగీతాల్లో ఈ పాటకు ఎనలేని గుర్తింపు లభించింది. ఈ పాటతో తెలంగాణ జానపదానికి ఓ కొత్త ఒరవడి సష్టించాడు గుండేటి రమేశ్. నిజానికి ఆయన సినిమాల్లో రాసిన పాటలు రాశిలో తక్కువే. కాని వాసిలో గొప్పవి. కుర్రకారుకి హుషారెక్కించే మాస్త్ మజానిచ్చే పాటలకు కేరాఫ్ అడ్రస్ అతను. ప్రతీ చోటా ఈ పాటే. పెళ్ళిళ్ళు జరిగినా, ఇంట్లో దావత్ అయినా, వనభోజాలకెళ్ళినా, న్యూ ఇయర్ సెలబ్రెషన్ జరిగినా, ఓ పూజా కార్యక్రమం జరిగినా… గ్రామదేవతల జాతరైనా, డీజే పెట్టి ఈ పాట పెట్టాల్సిందే. చిందేయాల్సిందే. దుమ్ము లేపాల్సిందే. ఇలా..ఎక్కడైనా ఈ పాటే. అంతలా అలరించింది. అలరిస్తోంది. అలరిస్తూనే ఉంటుంది. ఈ హుషారైన పాటకు సంగీతం శశిప్రీతమ్ అందించగా, శ్రీకాంత్ పాడాడు. హీరో శివాజీ, గీతరచయిత గుండేటి రమేశ్ కోరస్ అందించారు.
సినిమాకథ పరంగా చూస్తే.. హీరో తొలిచూపులోనే హీరోయిన్ చూసి ఇష్టపడతాడు. ఆమె వెంటే తిరుగుతాడు. ఆ సంగతి గమనించిన ఆమె అతన్ని ఆటపట్టించాలని తన పేరు చెప్పకుండా ఏడిపిస్తుంది. తన పేరులో ఒకటి, రెండు అక్షరాలను తప్పించి చెబుతుంది. తన పేరులోని అర్థం పుట్టుమచ్చని సూచిస్తుందని క్లూ ఇస్తుంది. ఎలాగైనా ప్రయత్నించి తన పేరు కనుక్కోమని హీరోకి సవాలు చేస్తుంది. హీరో తన స్నేహితులతో కలిసి రోజూ అదే పని మీద తిరుగుతుంటాడు. ఆ అమ్మాయి పేరు కనుక్కోవడం కోసం నానా తిప్పలు పడుతుంటాడు. తన స్నేహితులతో కలిసి డిటేక్టివ్ ని పెట్టుకుని వీథులన్నీ తిరుగుతుంటాడు. ఓ రోజు ఆ అమ్మాయి కూడా హీరో పై తనకు ప్రేమ ఉందని చిన్న ఉత్తరం రాసి అతనికి చేరవేస్తుంది. అది చూశాక హీరో మరింత ప్రేమ పెంచుకుంటాడు. ఈ సమస్య నుంచి ఎలాగైనా గట్టెక్కాలని బోనాల సందర్భంలో మైసమ్మకు మొక్కుకుంటాడు..ఇదీ సందర్భం.
ఆ ఉత్తరం రాసిన అమ్మాయి పేరు కనుక్కోవడం కోసం హీరో స్నేహితులతో కలిసి తిరుగుతూ అలసిపోయి, మైసమ్మకే చెబుతుంటారిలా..ఆ అమ్మాయి పేరు తెలిసేలా చేయమని, తమ అన్వేషణకి ఒక ఫుల్ స్టాప్ పెట్టమని అడుగుతుంటారు.
అమ్మా. మైసమ్మా. మాయదారి మైసమ్మా అంటూ మొక్కుతూ పాడుతుంటాడు. తను ఇష్టపడ్డ అమ్మాయి పేరు తెలిసేలా చేయమని, అలా చేస్తే మైసారం పోదామని అంటాడు. నన్ను గాబరా పెట్టకు. జర..పరేషాను జేయకు..తల్లి..అంటూ వేడుకుంటాడు.
స్కాములన్ని కామ్ చేసి హాయిగా బతుకుతున్నాం. ఎన్నో సమస్యలను పరిష్కరించాం. కాని ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం. తన తోటి స్నేహితుల బ్యాచ్ ని కూడా వెంటేసుకుని తిరుగుతున్నానని, అయినప్పటికీ పోరికి సంబంధించిన వివరాలు ఏం కనుక్కోలేకపోయామని అంటున్నాడు. లడ్డులాంటి నిండైన ముఖాలు కూడా తిరిగి తిరిగి జిడ్డులాగ అయిపోయాయి. సరే..అయినా ఆ అమ్మాయి పేరు దొరికిందా? అంటే..ఇంకా దొరకలేదు. పేరు లేని ఆ పోరి నాకు ఉత్తరం రాసి నన్ను ఇంకా పరేషాన్ చేసింది.
ఆ పోరి వల్ల నేను కాలేజీకి వెళ్ళలేకపోతున్నా. ఎటూ తెగని ఈ సమస్య వల్ల నేను ఏం చదవలేకపోతున్నా. కంప్యూటర్ క్లాసులన్నీ మిస్ అవుతున్నాయి. నేనేమో కాలేజీకి వెళ్ళలేని పరిస్థితి. ఆ పోరి పేరు తెలుసుకునేదాకా నాకు ప్రశాంతత లేదు. జర..నువ్వైనా మాకు ఉపాయం చెప్పు తల్లీ..అంటూ వేడుకుంటాడు.
ఆదివారం వచ్చిందంటే సందడిగా తిరిగేటి మేము ఇప్పుడు ఆ అమ్మాయి కోసం గాబరా గాబరాగా తిరుగుతున్నాం. పబ్బుల్లో బీరు తాగేటోల్లం. అదీ లేదు. చదువు మీద ధ్యాస లేదు. మ్యాట్నీకి వెళ్ళాలనే ఆశ లేదు. జేబుల్లో డబ్బులున్నా జల్సా చేయాలన్న మోజూ లేదు. కారణం ఆ పోరి చేసిన పనే.
తిండి తిప్పల్లేక అస్తమానం తిరుగుతూనే ఉన్నాం. తల్లీ నీకు తీరొక్క మొక్కులు మొక్కుకుంటాం. ఆ పుట్టుమచ్చ అనే అర్థమున్న పేరు రహస్యమేంటో చెప్పు తల్లి. పేరు చెప్పకుండా ఉత్తరం రాసిన ఆ అమ్మాయి అసలు పేరు ఏంటో పట్టుకునే జాడ కొంచెం చెప్పమ్మా..ఆ అమ్మాయి మా చేతికి చిక్కేలా చూడమ్మా..అంటూ పాడుతుంటారు.
ఈ పాట మొత్తం తెలంగాణ యాసలో సాగింది. ‘మైసారం’, ‘గాబరపెట్టి’, ‘గయబు గాకే’, ‘జర..పరేషాన్ జేయకే’, ‘పసాయించి’…వంటి పదాలన్నీ తెలంగాణ సొబగును అద్దుకుని గుబాళిస్తున్నాయి. తెలుగు, తెలంగాణ యాస, హింది, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లోని పదాలు ఈ పాటలో కనిపిస్తాయి. ఈ పాట వల్లే హీరో శివాజీకి ఎంతో పేరు వచ్చింది. ఇదే పాటను మళ్ళీ 2010 లో హీరో శివాజీ యే నటించిన ‘తాజ్ మహల్’ సినిమాలో స్వల్ప మార్పులతో వాడుకున్నారు. తరతరాలకైనా తరిగిపోని హుషారినిచ్చాడీపాటతో గుండేటి రమేశ్.
పాట:
మాయాదారీ మైసమ్మో మైసమ్మా/ మనం మైసారం పోదామే మైసమ్మా/ ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మో మైసమ్మా/ గాబర బెట్టి మమ్ము గాబర బెట్టి/ గయబు గాకే మైసమ్మా.. జర పరేషాను జేయకే మైసమ్మా/ స్కాములన్ని కామ్ చేసి/ సరదాగా బతుకుతున్న బచ్చగాళ్ళ ఇష్యూ తోని/ సచ్చి సగం అవుతున్న లడ్డు లాంటి ముఖాలేమో/ జిడ్డులాగ మారుతున్న/ చక్కనైన సుక్క ఏమో/ ఎక్కడుందో చిక్కదాయె/ మైసమ్మా… ఓ ఓ ఓఓ ఓ మైసమ్మా పేరులేని పోరి ఉత్తరమేసి మైసమ్మా… మైసమ్మా/ ప్యార్ కా దివానా చేసిపోయిందే మైసమ్మా… మైసమ్మా/ కాలేజీ క్యాంపస్ ల కాలు నిలవదే మైసమ్మా… మైసమ్మా/ ఆ కంప్యూటర్ క్లాసులు మిస్/ అవుతున్నయే మైసమ్మా… మైసమ్మా/ సండే వచ్చిందంటే… సందడి సగమైపాయే/ పబ్బుల్లో బీరు లేక… పసాయించి పోనాయే/ చదువుపైన దష్టి లేదు… మాట్నీల మాట లేదు/ జేబుల్లో మనీ ఉన్న… జల్సాల మోజు లేదు/ మైసమ్మా… మైసమ్మా తిండి తిప్పలు లేక తిరుగుతున్నమే మైసమ్మా… మైసమ్మా నీకు తీరొక్క మొక్కులు మొక్కుతున్నమే మైసమ్మా… మైసమ్మా/ పుట్టుమచ్చ గుట్టు చిట్టాను విప్పవే మైసమ్మా… మైసమ్మా/ నేను పట్టుకునే జాడ జర్రంత చెప్పవే మైసమ్మా… మైసమ్మా.
డా|| తిరునగరి శరత్ చంద్ర
[email protected]



