Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక చర్చ జరపాలి

బీహార్‌లో ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక చర్చ జరపాలి

- Advertisement -

ప్రతిపక్షాల డిమాండ్‌…ఆందోళన ఉభయ సభలు
సోమవారానికి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీహార్‌లో ఓటర్‌ జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై ప్రత్యేక చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. అయితే చర్చకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అనడంతో గత పది రోజులుగా పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లుతున్నాయి. శుక్రవారం కూడా పార్లమెంట్‌ ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభమైన నిమిషాల్లోనే సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐఆర్‌పై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. తిరిగి ప్రారంభమైన సభలో వివిధ అంశాలపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఎస్‌ఐఆర్‌పై చర్చకు డిమాండ్‌ చేస్తూ ఆందోళన కొనసాగించారు. వెంటనే సభను సోమవారానికి వాయిదా వేశారు. బీహార్‌, ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సవరణపై చర్చ కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ప్రతిపక్ష పార్టీలు సంయుక్త లేఖ రాశాయి. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సభను ప్రారంభించిన డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ నారాయణ్‌ సింగ్‌ జీరో అవర్‌కు ముందు సభ్యులు సమర్పించిన నోటీసులను చదివి వినిపించారు. రూల్‌ 267 కింద బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్‌ జాబితా సవరణ, ఒడిశాలో మహిళలు, బాలికలపై నేరాలు, ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ వలస కార్మికులపై వివక్ష, ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఇద్దరు నన్స్‌ను అన్యాయంగా అరెస్టు, అమెరికా విధించిన 25 శాతం సుంకాలు, జరిమానా ప్రభావం, ఐటీ రంగంలో భారీ తొలగింపులు వంటి అంశాలపై చర్చలు జరపాలని డిమాండ్‌ చేస్తూ సభ్యులు 30 నోటీసులు సమర్పించారు. వాటిని తిరస్కరిస్తున్నట్టు డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెంటనే సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్యానల్‌ చైర్మెన్‌ ఘనశ్యామ్‌ తివారీ ప్రకటించారు.
పార్లమెంట్‌ ఆవరణలో
ప్రతిపక్షాల ఆందోళన
పార్లమెంట్‌ ఉభయ సభల ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున ఇండియా బ్లాక్‌ ఎంపీలు నిరసనకు దిగారు. పార్లమెంట్‌ మకర ద్వారానికి ఎదురుగా ఆందోళన చేపట్టారు. బీహార్‌ ఓటర్ల జాబితాల స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సర్‌-ప్రజాస్వామ్యంపై దాడి’ అనే భారీ బ్యానర్‌, ఎస్‌ఐఆర్‌ని ఆపాలి, ఓటు లూటీ ఆపాలనే ప్లకార్డులను ప్రదర్శించారు. ‘ఓటు-బందీ, ‘ఓట్‌ కీ చోరీ-ఓట్‌ కీ లూట్‌ ‘ఓటు-బందీ, ‘ఓట్‌ కీ చోరీ-ఓట్‌ కీ లూట్‌’ అని నినాదాల హౌరెత్తించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ నేత రామ్‌ గోపాల్‌ యాదవ్‌, సీపీఐ(ఎం) ఎంపీలు అమ్రారామ్‌, శివదాసన్‌, జాన్‌ బ్రిట్టాస్‌, టీఎంసీ ఎంపీలు డెరిక్‌ ఓ బ్రెయిన్‌, సాగరికా ఘోష్‌, డీఎంకే ఎంపీలు కనిమొళి, ఎ. రాజాతో పాటు ఇండియా బ్లాక్‌ ఎంపీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -