Monday, January 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసచివాలయంలోనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా

సచివాలయంలోనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా

- Advertisement -

మంత్రులకు తెలియకుండానే జీవోలు : మాజీ మంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో థియేటర్ల కంటే సచివాలయంలోనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ”టికెట్‌ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం ఇందులో నా ప్రమేయం లేదని అంటారు. నా దగ్గరికి ఫైల్‌ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు.

శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. క్యాబినెట్‌ మంత్రికి తెలియకుండా ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నడుపుతున్నది సర్కారా? లేక సర్కస్‌ కంపెనీనా?” అని హరీశ్‌రావు ప్రశ్నించారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టి కాయలు వేసినా ప్రభుత్వ తీరు మారలేదని విమర్శించారు. నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్‌ రేట్ల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవని చెప్పిన సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సినిమా రంగాన్ని పరిశ్రమగా కాకుండా, రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుతున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -