Saturday, August 2, 2025
E-PAPER
Homeమానవిప‌దేండ్ల ప్ర‌యాణం 'మానవి'

ప‌దేండ్ల ప్ర‌యాణం ‘మానవి’

- Advertisement -

అవనిలో సగం.. ఆకాశంలో సగం.. సమాజంలో సగం.. జనాభాలో సగం.. ఆర్థిక వృద్ధిలో సగం… ఇలా మహిళా లోకం అన్నింటా సగంగా ఉంటుంది. ఈ పురుషాధిక్య సమాజంలో ఎదురొచ్చే ప్రతి అడ్డంకినీ ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తోంది. ఇటు కుటుంబాన్ని అటు వృత్తిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. స్ఫూర్తిదాయక విజయాలను సొంతం చేసుకుంటుంది. అలాంటి మహిళల జీవితాలను సమాజానికి పరిచయం చేసేందుకే పదేండ్ల కిందట నవతెలంగాణ ‘మానవి’పేజీని ప్రారంభించింది. ఈ దశాబ్ది కాలంలో అలాంటి ప్రయత్నమే చేసింది. పదేండ్ల ప్రస్థానం పూర్తి చేసుకొని రాబోయే కాలంలో అందరి సహకారంతో మరింతగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పాఠకులు కొందరు తమ అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు.

మరింత ముందుకు…
నవతెలంగాణ ప్రారంభమైన మొదటి రోజు నుండి నేను రెగ్యులర్‌ పాఠకురాలిని. పదేండ్ల నుండి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను సామాన్య ప్రజల దృష్టి కోణంలో అధ్యయనం చేసి పాఠకులకు అందిస్తున్న నవతెలంగాణ టీంకి, యాజమాన్యానికి అభినందనలు. పాఠకుల అభిమానాన్ని చూరగొంటూ విజయవంతంగా పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు! నేను ప్రతిరోజూ ముందుగా చదివేది ఎడిటోరియల్‌ పేజీ. కరెంట్‌ టాపిక్స్‌ మీద ప్రముఖ పాత్రికేయులు, మేధావులు, ఆర్ధిక నిపుణులు అందించే వ్యాసాలు సమగ్రమైన అవగాహన కలిగించే విధంగా ఉంటున్నాయి. అదే విధంగా మానవిలో వచ్చే ఆర్టికల్స్‌ కూడా విభిన్న రంగాలలో రాణిస్తున్న మహిళల సక్సెస్‌ స్టోరీలతో పాటు ప్రతి శనివారం ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ స్టోరీస్‌ని కూడా ఎంతో ఆలోచింపచేసేవిగా ఉంటున్నాయి. అయితే మహిళలకి మరింతగా విజ్ఞానదాయకంగా ఉండే విధంగా, ఆలోచింపచేసే కథనాలను కూడా రాబోయే రోజుల్లో అందించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, రాజకీయాల్లో ఎందరో మహిళలు గొప్ప పాత్ర పోషించారు. అలాంటి వారి జీవిత కథలు, ఇంటర్వ్యూలు మరింత ఎక్కువగా మానవి పేజీలో రావాలని నా అభిప్రాయం. పాఠకుల సూచనలను, అభిప్రాయాలను తెలియజేసేందుకు వీలుగా పాఠకుల కోసం ఒక కాలమ్‌ కూడా చోటు కల్పించాలి. మరిన్ని కొత్త ఫీచర్స్‌, కథనాలతో నవతెలంగాణ మరింత ముందుకు దూసుకుపోవాలని, అత్యధిక పాఠకులను సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
– పద్మశ్రీ, సీఐటీయూ.

చైతన్య దీపిక ‘మానవి’
నవతెలంగాణ పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా శుభాభినందనలు. ఒక పత్రిక నడపడం అంత సామాన్యమైన విషయం కాదు, అది కూడా ఎప్పటికప్పుడు తాజాగా అన్ని విలువలను పాటిస్తూ అద్భుతమైన విషయాలను సేకరించి మన వద్దకు చేర్చే దిశలో నవతెలంగాణ ఎప్పుడూ ముందుంటుంది. అందులో మానవి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఒక రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచినటువంటి మహిళలను గురించి మానవి ఎప్పటికప్పుడు వారి సంపూర్ణ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. అందులో నా గురించి కూడా ఉందండోరు.. ఇలా చాలామంది ఎవరికి వారు తమని తాము పూర్తిగా చూసుకోగలిగేలా రూపొందించినటువంటి శీర్షిక మానవి. దీనితో పాటు అనేక విశేషాలను పిల్లలకు అందరికీ ఉపయోగపడే అంశాలతో అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి పేజీ నిర్వాహకుల పట్టుదలకు, దీక్షకు మనసారా శుభాకాంక్షలు. ఈ మానవి నిర్వహణలో నిండి ఉన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు. మానవిలోని ఏ ఒక్కరి గురించి చదివినా తప్పనిసరిగా అది వారిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని ఒక నిత్య చైతన్యాన్ని అందిస్తుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మానవి మనందరి హృదయ బాంధవి, మీరందరూ ఎప్పుడూ దీన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మానవి పదేండ్లు కాదు నిండు నూరేళ్ళు చైతన్య దీపికగా నిలవాలని కోరుకుంటున్నాను.
– డా. సమ్మెట విజయ, ప్రముఖ రచయిత్రి

మహిళా అభివృద్ధికి బాటలు…

నవ తెలంగాణ పత్రికలో ‘మానవి’ పేజీ ద్వారా ఎంతో మంది సామాన్య మహిళల స్ఫూర్తి గాధలు బయటకు వచ్చాయి. ప్రతిసారీ ఈ పేజీ నుంచి అందరికీ ఏదో ఒకటి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతోంది. పత్రికలు ముఖ్యంగా దినపత్రికలు రాజకీయాల వార్తలతో, క్రైం వార్తలు తోటి నింపేసి ఏదో ఒక చిన్న ఆర్టికల్‌ మహిళల కోసం కేటాయిస్తున్న ఈ రోజుల్లో ‘నవ తెలంగాణ’ మానవి పేజీతో మహిళా అభివృద్ధికి నిజంగానే బాటలు వేస్తోంది. మహిళల మానసిక ఆరోగ్యం, విషయపరిజ్ఞానం, నైపుణ్యాలు పెంచే మరిన్ని ఆర్టికల్స్‌ మానవి పేజీలో ఉంటే బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఈ పదేండ్ల మీ కృషికి అభినందిస్తూ ఇలాగే పదికాలాలపాటు మా మానవి పేజీతో మా మహిళలందరినీ ముందుకు నడుపుతారని ఆశిస్తూ, నవతెలంగాణ పత్రిక యజమాన్యానికి, స్టాఫ్‌కి, కాంట్రిబ్యూటర్లకి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
– డాక్టర్‌ మమతా రఘువీర్‌ ఆచంట,

డైరెక్టర్‌, తరుణి స్వచ్ఛంద సంస్థ.
మహిళల మనోవికాసంలో చైతన్య కేతనం

నాకు తెలిసి మహిళలకి ఒక పేజీ కేటాయించటం ఎక్కువ అనుకునే సమాజాన్నే చూసాను. అయినా వాళ్ళకేముంటుంది, వంటలు, ఫ్యాషన్లు, చీరలు.. ఇవేగా అనేవారు ఇంకా ఉండటం వింటున్న కాలం ఇది. ప్రతి రోజూ మహిళల వికాసం కోసం ఒక అర్ధ పేజీ కేటాయించటం గొప్ప కాకపోవచ్చు కానీ దాన్ని అర్ధవంతంగా తీర్చి దిద్దటం నిజంగా అద్భుతం. ఎక్కడెక్కడి అవకాశాలో.. ఇంకెక్కడి మహిళా విజయాలో ఉన్నది ఉన్నట్టుగా అందిస్తుండటం రోజూ చూస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఐద్వా అదాలత్‌ ద్వారా న్యాయ సలహాలు అందించటం బాగుంది. ఎప్పుడో ఒకసారి పారిశ్రామిక రంగంలో మహిళా విజయాల్ని వేద్దాం అనగానే ముందుకొచ్చి ఎంతో మంది మహిళా పారిశ్రామిక వేత్తల ప్రయాణాన్ని ప్రచురించారు. స్ఫూర్తి కలిగించారు. ముఖ్యంగా ఆకాశంలో సగం ఉన్న ఆడవాళ్ళకి అవకాశాల్లో సమ భాగస్వామ్యం దక్కదెందుకు అన్న మా దుగ్దని అర్ధం చేసుకున్నట్టుగా చక్కని వ్యాసాలు, పరిచయ కార్యక్రమాలు ఇస్తుంటారు. అంతేనా సాహిత్యం పట్ల అనురక్తితో మేము రాసే కథనాల్ని వేస్తుంటారు. అక్షరయాన్‌ తెలుగు విమెన్‌ రైటర్స్‌ ఫౌండేషన్‌ తరుపున నవ తెలంగాణాకి పదవ వార్షికోత్సవ అభినందనలు. మహిళల పట్ల మీ సహానుభూతిని ఇలాగే కొనసాగించమని కోరుకుంటున్నాం.
– ఐనంపూడి శ్రీలక్ష్మి. ప్రముఖ రచయిత్రి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -