– బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
– మోడీ రూ.2 లక్షలు బిచ్చం వేస్తున్నారా?
– కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో విచారణ చేయండి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-భువనగిరి
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు ప్రభుత్వమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదానికి కారణం యాజమాన్యాల బాధ్యతారాహిత్యమేనని తెలిపారు. మృతుల్లో ఎక్కువగా ఒడిశా, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ కార్మికులు ఉన్నారని చెప్పారు. పొట్టకూటి కోసం వలసొచ్చిన కార్మికులు పని ప్రదేశాల్లో ప్రాణం కోల్పోతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలకు మద్దతు తెలిపేలా చట్టాలు తేవడం బాధాకరమన్నారు. సిగాచి ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందించడం సంతోషకరమని, కానీ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ప్రకటించడమంటే భిక్షం వేస్తున్నారా? అని ప్రశ్నించారు.
దేశంలో మహిళలపై దాడులు, సామూహిక లైంగికదాడులు జరుగుతుంటే నోరు విప్పని ప్రధాని మోడీ.. తెలంగాణలో సిగాచిపై నోరు విప్పడం రాజకీయ నాటకాల కోసమేనని విమర్శించారు. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979.. కార్మికుల సంక్షేమం, పని ప్రదేశాల్లో వారి రక్షణ కోసం ఉద్దేశించినదని వివరించారు. అలాంటి చట్టం అమలు చేస్తే కార్మికులకు భద్రత, హక్కులు లభిస్తాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించడం, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించడం అభినందనీయమన్నారు. కానీ ఆ ఎక్స్‌గ్రేషియా యాజమాన్యాలు చెల్లిస్తాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి.. కార్మికులతోపాటు జనరల్ మేనేజర్ స్థాయి ఉద్యోగి మృతిచెందినా నేటికీ కంపెనీ ఎండీ ఘటనా స్థలానికి రాలేదన్నారు. యాజమాన్యం తగిన రీతిలో స్పందించలేదన్నారు. తీవ్రంగా గాయపడి పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి రూ.10లక్షల సహాయం సమంజసం కాదని, కనీసం రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు, కంపెనీల యాజమాన్యాలు కుమ్మక్కు కావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. మూసీ పూర్తిగా విషపూరితమైందని, ఆ నీరు వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడదని తెలిపారు. సుమారు రూ.360 కోట్లతో బస్వాపురం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో మూసీ నీరు లేకుండానే వ్యవసాయం చేయొచ్చన్నారు. గోదావరి, కృష్ణా జలాలను మూసీలోకి తరలించాలని కోరారు. మూసీ ప్రక్షాళన తర్వాత, పరివాహక ప్రాంతాల వారికి నష్టం చేకూర్చకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే అభ్యంతరం లేదన్నారు. కానీ, ఆ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ యాజమాన్యాలకు, కార్పొరేట్ శక్తుల పొట్టలు నింపడానికి ప్రయత్నం చేస్తే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. బనకచర్ల నీటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి వాటాలు పంచుకోవాలన్నారు. నేటికీ తెలంగాణ ప్రభుత్వం నికరజలాలను వాడుకోలేకపోతోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా ఏకపక్షంగా పోతే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ తదితరులు ఉన్నారు.
‘సిగాచి’ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES