కలం బరువును మాత్రమే మోయగల శరీరం సాహిత్య లోకాలన్నింటినీ తడిమి చూడగల క్రాంత దర్శిత్వం… అబ్బురపరచే పరిశోధనా గ్రంథాలు అవతరిస్తాయి. ఆయనే శతాధిక గ్రంధ రచయిత డా. కపిలవాయి లింగమూర్తి. సాహిత్యంలోని క్లిష్టమైన ప్రక్రియలైన చిత్రపది, బంధాలు, శబ్దపది, అలంకారాలు, యతులతో చమత్కారాలు వంటివి వీరిరచనలలో చాలా కనిపిస్తాయి. భాషాసముద్రపు లోతుల్లోకి దిగి తెలుగుపలుకుబడిపై ప్రత్యేకాధికారాన్ని సాధించారు. ఉమ్మడిపాలమూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించి మరుగునపడిన శాసనాలు, చరిత్ర, జానపదులనోళ్ళలో నానే అపూర్వమైన, విలువైన విషయాలను గ్రంథస్థం చేశారు.
లింగమూర్తి 1928 మార్చి 31 వ తేదీన నాగర్‌కర్నూలు జిల్లా బలుమూరు మండలం జినుకుంట గ్రామంలో ఒక పండిత వంశమున మాణిక్యాంబ వెంకటాచలంలకు జన్మించినారు. అమరాబాదులో మేనమామగారైన చేపూరు పెద్దలక్ష్మయ్య దగ్గర పెరిగి విద్యాబుద్ధులు నేర్చి సంస్కృతాంధ్ర నిఘంటువులు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలు, జ్యోతిష్య, శ్రౌతాది భాగాలు నేర్చారు. వారు మొదలు కొంతకాలం వృత్తిపనిచేసి తర్వాత ఉద్యోగజీవితంలోకి మారి అపూర్వమైన సాహిత్య సృజన చేశారు. నిత్యసాహితీ కృషీవలుడైన కపిలవాయి లింగమూర్తి 157 గ్రంథాలు వ్రాసారు. వీనిలో వివిధ ప్రక్రియలలో వెలువరించినవి 94. పరిష్కృత, సంపాదక, సంకలనాల రచనలు 63. ప్రక్రియలలో శతకాలు, కావ్యాలు, ఉదాహరణలు, సంకీర్తనలు, హరికథలు, వచనగేయ పద్యకృతులు 41. వచనరచనలలో ఆధ్యాత్మికరచనలు, కథలు, నవలలు, నాటికలు, స్థలచరిత్రలు, జీవితచరిత్రలు, నిఘంటువులు, అనువాదరచనలు మొత్తం 53.
లింగమూర్తి వివిధ విషయాలపై రాసిన వందలాది వ్యాసాలు పత్రికలలో ప్రచురింపబడ్డాయి. అవి అన్ని ముద్రితాలు, అముద్రితాలు కలిపి 430. వీరు 320కి పైగా ముందుమాటలు, పీఠికలు, అభిప్రాయాలు రాసారు. ప్రచురించిన గ్రంథాలలో ఆర్యశతకము (చిత్రపదిపదాల గారడి), దుర్గాభర్గ శతకము (అలంకారయతి లక్షణాలు), ఉమామహేశ్వరం హరికథ, సుబ్రహ్మణ్యోదా హరణము (పాలెంసుబ్బయ్య జీవితచరిత్ర), ప్రబోధ పటాహము (సామాజిక గేయాలు), శ్రీమత్ప్రతాపగిరిఖండము (అమరబాదు స్థలచరిత్ర) కుటుంబగీత (కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను తెలిపే కావ్యం), భాగవతకథాతత్వము (పది భాగవతకథలకు వ్యవహారికమైన వివరణ), గీతాచతుష్పథం (భగవద్గీత, ఉత్తరగీత, ఉద్దవగీత, భ్రమరగీతల సారాంశము),
జీవుడు దేవుడు (పురాణాలలోని సంఘటలనను నేటి సమాజానికి అన్వయిస్తూ వ్రాసిన విశ్లేషాత్మకరచన), పాలమూరుజిల్లా దేవాలయాలు (జిల్లాలోని 300 ప్రాచీన, ఆధునికదేవాలయాల చరిత్ర), గురుగోవిందమాంబ చరిత్ర, ఉమ్మడిపాలమూరు కవిపండితవంశాలు యోగులు, ఉప్పునూతల కథ, ఆంధ్ర పూర్ణాచార్యులు (చారిత్రక నవల), పద్యకథాపరిమళం, కపిలవాయి కథానికలు, కావ్యగణపతి అష్టోత్తరము (కావ్యాలలోని 108 గణపతి స్తుతులకు వ్యాఖ్యానం), స్వర్ణశకలాలు (90 కావ్యాల్లోని స్వర్ణాభరణాలను గురించిన వివరణ), రుద్రాధ్యాయము (సామాజిక చారిత్రక వ్యాఖ్యానం) మాంగల్యశాస్త్రము(ప్రాచీన ఆభరణాల విశేషాలు వివరాలు), హనుమచ్చహస్రము (హనుమంతుడి వేయినామాలకు వ్యాఖ్యానము) వీరు ఏడుదశాబ్దాల సాహితీకృషికి గుర్తింపుగా పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాద్ 13వ స్నాతకోత్సవంలో గౌరవ డి.లిట్ పురస్కారాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలి డాక్టరేటు అందుకున్న వ్యక్తి కపిలవాయి లింగమూర్తి.
ఆయన వ్రాసిన శతాధికగ్రంథాలలో ఒక్కొక్క గ్రంథంపై ఒక్కో పిహెచ్‌డి చేయొచ్చు. తెలంగాణ పదకోశాల్లో ‘పామర సంస్కృతం’ విశిష్టమైంది. దశాబ్దాలపాటు పల్లెప్రజలతో మమేకమై ఈ పదాలను, జాతీయాలను, సామెతలను సేకరించారు. ఈ పదకోశనిర్మాణానికి డా. కపిలవాయి లింగమూర్తిని గడియారం రామకష్ణశర్మ, వావిలాల గోపాలకృష్ణయ్యలు ప్రోత్సహించారు. ఇక్కడ పామరులు అనగా జానపదులు. ఎలా ఉంటే తెలంగాణ పల్లె ప్రజలు శిష్టవ్యావహారిక పదాలని తమకు అనుగుణంగా మార్చుకొని మాట్లాడతారు. ‘పామర సంస్కృతం అనగా పామరుడు తాను సంస్కరించుకున్న భాష అనే అర్థంలో ఈ పేరుంచాను” అని లింగమూర్తి పేర్కొన్నారు. పామర సంస్కృతంలో పదాలకు అర్థాలతో పాటు పద్యపాదాలు, పాటల పల్లవులు, నానార్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు, సామెతలు, న్యాయాలు, పదవివరణ, రూపసాధన, పదవ్యుత్పత్తి, అన్యదేశ్యాలు అనుబంధంలో ఇచ్చినవాటిని స్థాలీపులాకన్యాయంగా పరిశీలించినారు.
ఇక రెండవది సాలగ్రామం. ఇది వారి కుటుంబచరిత్ర. మా భగోటాకు సంక్షిప్తీకరణ. ఈ ఆత్మకథలో అటు స్వర్ణశిల్పంతోపాటు మరిన్ని విద్యలలో రాణించిన ఒక స్త్రీమూర్తి కనబడుతుంది. ఆమె మేడిపూరు గోవిందమ్మ. చిన్నతనంలో భర్త చనిపోవడంతో తండ్రి, అన్నలవద్ద స్వర్ణశిల్పంతో పాటు అన్నివిద్యలు నేర్చుకున్న ప్రతిభావంతురాలు ఆమె. ఆమె వీరి తాతగారైన సింగవట్నానికి స్వర్ణశిల్పంలో శిక్షణ ఇచ్చింది. తోలుబొమ్మలాట ఆడేవారిలో ఉన్న చిత్రకారులతో పౌరాణికచిత్రాలు గీయించి సింగవట్నానికి వాటిద్వారా చెక్కడం పనికి కావలిసిన చిత్రలేఖనం నేర్పించింది. ఆ కాలంలో ఇటువంటి స్త్రీలు అరుదు. సాలగ్రామం చదివినప్పుడు ఆనాడు విశ్వకర్మలు ఉగాది, దసరా పండుగలను ఎలా జరుపుకునేవారో తెలుస్తుంది. ఆ కాలంలో లింగమూర్తిగారింట్లో ఉగాది, దసరా పండుగలు నవరాత్రులుగా సాగేవట. ఉగాదికి తమ పనిముట్లను పూజించేవారట.
ఉగాదినాడు పనిముట్లనన్నింటిని కడిగి, తుడిచి, చమురు (నూనె) పూసి వాటికి గంధంతో తిర్యక్పుండ్రాలు, చంద్రరేఖలు తీర్చి కుంకుమతో అలంకరించేవారట. ఉగాది దినాలలో విశ్వకర్మపురాణం పగటిపూట, భజన రాత్రిపూట ఉండేదట. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన ఒక మారుమూల పల్లెటూరు పిల్లవాడు తన క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, కృషి, నిజాయితీలతో ఏ విధంగా రాష్ట్రం మెచ్చుకునే కవిపండితుడయ్యాడో ఈ ఆత్మకథ ‘సాలగ్రామం’ మనకు తెలుపుతుంది. చిత్రకారునిగా, జ్యోతిశ్శాస్త్రవేత్తగా, యోగసాధకునిగా, పుస్తకాల పురుగుగా, శిల్పిగా, నాటకాలకు వస్తువులు తయారు చేసిన సృజనశీలిగా, కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, చరిత్రకారుడిగా, పరిష్కర్తగా, సంపాదకునిగా విభిన్న పార్శ్వాలు గల కపిలవాయి లింగమూర్తిగారి జీవితాన్ని ఆవిష్కరించే గ్రంథం ఇది. ఆయన కృషిచేసిన స్థానిక చరిత్రలను, దేవాలయాల చరిత్రను ఇంకా వెలికితీసి కొనసాగించడమే వారికి నిజమైన నివాళి.
(డా. కపిలవాయి లింగమూర్తి జయంతి సందర్భంగా)
- డా. కె.కృష్ణమూర్తి, 85001 67845



