– జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో సంతాప సభ
– యూట్యూబ్ చానెళ్ల తీరు బాధాకరం
– కొన్ని మీడియా సంస్థల తీరును ఖండించిన జర్నలిస్టు సంఘాలు
నవతెలంగాణ -హైదరాబాద్
జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యురాలు స్వేచ్ఛ వొటార్కర్ సంతాపసభ మంగళవారం హైదరాబాద్ సొసైటీ కార్యాలయంలో జరిగింది. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వేచ్ఛ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ స్వేచ్ఛ మరణానంతరం సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చాలా బాధ కలిగిస్తున్నాయని అన్నారు. మీడియా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. వ్యక్తిగత జీవితంలో చొరబడిన సోషల్ మీడియా స్వేచ్ఛను మరోసారి చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ స్వేచ్ఛ ఎంతో ధైర్యవంతురాలనీ, ఇలా చేస్తుందని ఊహించలేదని అన్నారు. స్వేచ్ఛ మరణించిన తరువాత కొన్ని మీడియాలో వస్తున్న కథనాలు అందరినీ బాధిస్తున్నాయని గుర్తు చేశారు. టీన్యూస్ సీఈఓ, సొసైటీ మాజీ కార్యదర్శి శైలేష్‌రెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛకు ఎలాంటి టాస్క్ ఇచ్చినా ఊహించిన దాని కంటే బాగా పని చేసేదని చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా, ఇలా అన్ని రంగాలపై అవగాహన ఉన్న న్యూస్ ప్రెజెంటర్లల్లో స్వేచ్ఛ ముందుండేదని అన్నారు. జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు మాట్లాడుతూ స్వేచ్ఛ లేని లోటు ఎవరూ తీర్చలేరని అన్నారు. గడచిన నెల 12వ తేదీన గోపనపల్లిలో జరిగిన ఎంసీ సమావేశంలో స్వేచ్ఛ ఆ రోజంతా సొసైటీ సభ్యులతోనే ఉన్నారని అన్నారు. నాన్ అలాటీస్‌కు ఎలాగైనా న్యాయం చేయాలనే తపన స్వేచ్ఛలో కనిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి రవీంద్రబాబు, కోశాధికారి మహేశ్వర్‌గౌడ్, ఎంసీ సభ్యులు కమలాకర చార్య, ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, సంయుక్త కార్యదర్శి భాగ్యలక్ష్మి , మహిళా జర్నలిస్టులు కూడా మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ రావు స్వేచ్ఛ కుమార్తె అరణ్య చదువు కోసం లక్ష రూపాయల విరాళం అందిస్తున్నట్టు తెలిపారు.
ఫెడరేషన్ నివాళి
స్వేచ్ఛకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ స్వేచ్ఛ మరణానికి కారణమని భావిస్తున్న పూర్ణచందర్ రావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత అంశాలను ముందుకు తెస్తూ స్వేచ్ఛను అప్రతిష్ట పాల్జేసే చర్యలను అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.