– హంతకుడికి మరణశిక్ష విధించిన న్యాయస్థానం
నవతెలంగాణ- బాలానగర్
హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ హద్దుల్లో 2011లో సంచలనం సృష్టించిన భరత్‌నగర్ హత్య కేసులో కూకట్‌పల్లి న్యాయస్థానం సోమవారం కీలక తీర్పును వెలువరించింది. మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టు చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. దాదాపు 14 ఏండ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, ఈ కేసులో నిందితుడైన కరణ్ సింగ్ అలియాస్ కమ్మ సింగ్‌ను దోషిగా నిర్ధారించిన 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి మండా వెంకటేశ్వరరావు సోమవారం తుది తీర్పు వెల్లడించారు. కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు మనసును కలచివేసే విధంగా ఉన్నాయి. కరణ్ సింగ్‌కు అతని సవతి తల్లి కుమార్తె మాయ కౌర్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇదే చివరకు హత్యకు దారితీసినట్టు పోలీసులు నిర్ధారించారు. సనత్‌నగర్‌కు చెందిన అప్పటి పీసీ కప్పరి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఇన్‌స్పెక్టర్ జి.బస్వా రెడ్డి కేసు నమోదు చేశారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ సాయి శ్రీనివాస్‌రావు సమగ్రంగా దర్యాప్తు చేసి, పక్కా ఆధారాలతో నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేయడంతో కేసు కోర్టులో నిలబడింది. ఈ తీర్పుపై సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి స్పందిస్తూ.. కేసును ప్రతిష్ణాత్మకంగా తీసుకుని అహర్నిశలూ శ్రమించిన పోలీసు అధికారులను అభినందించారు. ఆలస్యంగానైనా తప్పకుండా నేరస్థులకు శిక్ష పడుతుందనే విషయాన్ని ఈ తీర్పు మరోసారి రుజువు చేసిందని అన్నారు.
హత్య కేసులో 14 ఏండ్ల తర్వాత తీర్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



