Monday, November 17, 2025
E-PAPER
Homeదర్వాజమనిషి కోసం పరితపించిన పల్లెగొంతు

మనిషి కోసం పరితపించిన పల్లెగొంతు

- Advertisement -

నివాళి

తెలంగాణ ఒక అపురూప వాగ్గేయ భూమి. ఆ భూమిలో ఎన్నో మహావృక్షాలు శాఖోపశాఖలుగా విస్తరించి తమ ఉనికిని విశిష్టంగా చాటుకున్నాయి. అట్లాంటి ఒక మహావృక్షం హఠాత్తుగా నేల కూలింది. ఆ వృక్షం పేరు అందెశ్రీ. గళమెత్తితే ఒక జనగర్జన. పదం పలికితే ఒక విస్పోటనం. ఇంచుమించుగా నాలుగున్నర దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక జీవనం, సామాజిక, రాజకీయ చైతన్యం ఆయన గేయాలలో ఉవ్వెత్తున ఎగిసింది. దుర్భర దారిద్య్రం, దుస్సహ అణచివేత కడగొట్టు బిడ్డలను తొడగొట్టు బిడ్డలుగా మార్చడానికి వామపక్ష ఉద్యమాలు ఎంతగానో ఉపకరించాయి. ప్రజల పక్షాన నిలబడి అనేక దురన్యాయాలపై దుష్కృతాలపై ఈ వాగ్గేయకారులు గొంతెత్తారు.

దాశరథి గాయపడిన గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అని వేదనను పలికించి విచారిస్తే ఈ వాగ్గేయకారులు రాసి, పాడిన ప్రతి వాగ్గేయమూ ఒక మహాకావ్యమై జనాన్ని చైతన్య పరిచింది. 1970లలో గద్దర్‌ అనే యుద్ధనౌక మొదలు పెట్టిన మహావాగ్గేయ ప్రస్థానం అడుగడుగునా వాగ్గేయకారులను సృష్టించుకుంటూ ముందుకు సాగింది. తెలంగాణ రైతాంగ పోరాటం ఒక తరహా ప్రజాకళాకారులను, కళారూపాలను సజీవం చేసి తెలంగాణ సంస్కృతీ వైశిష్ట్యాన్ని తిరుగుబాటు తత్వాన్ని వెల్లటింపజేస్తే, 1980ల తరువాత మరింత ఉదృతంగా సామ్రాజ్యవాద వైఖరిని నిరిసిస్తూ, పెట్టుబడిదారీ విధానాలను ప్రతిఘటిస్తూ వచ్చిన వాగ్గేయ సాహిత్యం వెనుక విప్లవోద్యమం దృఢంగా నిలబడి వుంది.

1990ల నాటికి క్రమంగా వచ్చిన పరిణామాలు ఈ వాగ్గేయకారులను మరింత సునిశితం చేయటమే కాకుండా, సంవేదనా సంభరితులను చేశాయి. గద్దర్‌ తన జైత్రయాత్ర కొనసాగిస్తున్న కాలంలోనే ఒకవైపు అందెశ్రీ, మరోవైపు గోరటి వెంకన్నలు తమ వాగ్గేయాలలో ముందుకొచ్చారు. జన బాహుళ్యాన్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అందెశ్రీ పల్లెతల్లిని, స్వయంసమృద్ధ గ్రామీణ వ్యవస్థనను కీర్తిస్తే, గోరటివెంకన్న పల్లెల విధ్వంస బీభత్సాన్నిన కళ్లకు కట్టినట్టు చూపారు. అందెశ్రీ పల్లీయ జీవితంలోని సమృద్ధిని, ప్రకృతిని, వ్యవసాయ నాగరికతలో చేతి వృత్తుల లేదా సేవక కులాల కృషిని స్మరించాడు. చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి ఇట్లా అనేక కులాల శ్రమ పల్లెలను దీపింపజేశాయి అనే భావనను ముందుకు తెచ్చాడు అందెశ్రీ. వున్న వూరు కన్నతల్లి ఒక్క రూపన్న రీతిగా పల్లెను పాలవెల్లిగా, జాబిల్లిగా ఒకానొక ప్రాకృతిక సౌందర్యంతో భాసిల్లిన తీరును పారవశ్యంతో పాడాడు. పల్లెను ప్రేమించాడు.

పల్లెను తల్లి ఒడిగా, జీవన విధాన విలువల బాటగా, పల్లీయ సాంస్కృతిక వైభవాన్ని తన గేయాలతో రూపించాడు. ఒక్క పల్లె అనే కాదు స్థానిక అనుదిన జీవన సౌందర్యాన్ని అనుభూతం చేశాడు. గోరటి వెంకన్న ఈ స్థానికతను అడుగడుగునా ప్రేమిస్తూనే పరవశిస్తూనే వనరుల విధ్వంసాన్ని, ప్రకృతిని వినాశనం చేస్తున్న వైఖరులను బట్టబయలు చేస్తూ పెట్టుబడిదారి విధానాన్ని ఖండించాడు. అనర్దాయకమైన వినియోగదారి సంస్కృతి ఎత్తిచూపాడు. పేదల పాట్లు, పేదరికం తెచ్చే సకల కష్టనష్టాలకు మూలకారణం ఆధునికతలోను పెట్టుబడిదారుల లాభాపేక్షలోనూ వున్నాయని వేలు చూపించాడు. ఒకరిది వైభవ ప్రకటన అయితే, మరొకరిది విధ్వంస ప్రదర్శన. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఈ ఇద్దరినీ గుండెలకు హత్తుకుంది. కళ్లకు అద్దుకుంది. గద్దర్‌ తరువాత ఒక ఆరాధనీయ స్థాయికి వీరికి చేర్చుకుని ముచ్చట పడింది. అయితే ఈ ఇద్దరు కూడా వర్తమాన రాజకీయ వైఖరులను ప్రజాభిప్రయాలను మలచడంలో తమ వాగ్గేయాల ద్వారా ప్రభావశీల వ్యక్తులుగా మారారనేది వాస్తవం.

మానవత్వం కోల్పోయిన సామాజిక సందర్భంలో ‘మనిషి’కోసం అందెశ్రీ అన్వేషించాడు. పరితపించాడు. తన గేయాలలో ఆ విషయాన్నే కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించి ఒప్పించాడు కూడా. మనిషి మాయమైపోయాడనే ఎరుకను కలిగించాడు. అస్తిత్వ ఉద్యమాల ప్రభావం ఇద్దరి మీదా ఉన్నప్పటికీ గోరటివెంకన్నపై వీటి ప్రభావం కాస్త ఎక్కువే. ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం ఒక ప్రజాస్వామిక రాజకాంక్షగా వ్యక్తం కావటంలోనే కాదు, ఆ ఆకాంక్షకు ప్రజామద్దతును ప్రోది చేయడంలో ఇద్దరి పాత్రా ఉన్నది. అప్పటికే వామపక్ష రాజకీయ ఉద్యమ వారసత్వం తెలంగాణకు కానుక చేసిన అసంఖ్యాక వాగ్గేయకారులూ ఉన్నారు. వారందరికీ బహుముఖాలుగా ప్రేరణనిచ్చారు. గద్దర్‌ పాత్ర తిరుగులేదనేది నిర్వివాదాంశం.

ఇక కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి ముందే ఒక గీతం రాసిన అందెశ్రీ, అప్పటికే తెలంగాణ యావన్మందీ తన ఆత్మగీతంగా, జాతీయ గీతంగా అంగీకరించారు. ఇతర పరిణామాలు వివిధ వాద, వివాదాల సంగతి ఎట్లా వున్నప్పటికీ ‘జయజయహే తెలంగాణ’ ఈనాడు ప్రతిధ్వనిస్తున్నది. ఒక అజరామరమైన కీర్తి, ప్రతిష్టలను గౌరవాన్ని అందెశ్రీకి అందించింది. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, నాగరికత పట్ల ఒక జాతీయ కవికి ఉండాల్సినంత ఉద్వేగ, సంవేదనలు అందెశ్రీలో పుష్కలం. రాష్ట్రగీతం ఒకటి చాలు కదా! కాళోజీ కరుణాశ్రువు దాశరథిలోని ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రకటించిన ఉద్ధతభావం, ఉదృతి అందెశ్రీలో చిక్కగా వొదిగిపోయాయి. ఏ సభావేదికపై తారసపడినా ఆ కర్ణాంత నవ్వుతో, నిర్మలత్వమూ, నిబ్బరత్వంతో ఆదరపూర్వకంగా దగ్గరకు తీసుకునే అందెశ్రీ లేరంటే నమ్మకం చిక్కదు. ఏ పదాలు కొలుస్తాయి అందెశ్రీని? ఏ మాటలు తూకమేస్తాయి, ఆ వాగ్గేయ ప్రవాహ సదృశ మహోధృతిని? వాగ్గేయకారుడు లేకపోవచ్చు, ఆయన వాక్కు వుంటుంది. తెలంగాణమున్నంత కాలం ఆయన గీతం జయజయధ్వానాలు చేస్తూనే వుంటుంది.

  • ఆర్‌. సీతారాం, 9866563519
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -