Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఆశయాలను అక్షరాలుగా మలిచిన యోధుడు

ఆశయాలను అక్షరాలుగా మలిచిన యోధుడు

- Advertisement -

– ప్రత్యామ్నాయ జర్నలిజానికి పునాది : మోటూరు హనుమంతరావు వర్థంతి సభలో తెలకపల్లి రవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆశయాలను అక్షరాలుగా మలిచిన యోధుడు మోటూరు హనుమంతరావు అని ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. మోటూరు హనుమంతరావు 24వ వర్థంతిని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోటూరు విగ్రహానికి రవి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌ నరేందర్‌ రెడ్డి స్వాగతం పలకగా, సంపాదకులు రాంపల్లి రమేశ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ అక్షరాల యోధుడుగా ఉంటూనే ఉద్యమాలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి మోటూరు అని గుర్తుచేశారు. ప్రజాశక్తి (నవతెలంగాణ) నిలదొక్కుకోవడానికీ, పురోగమనానికి మోటూరు ఒక వ్యక్తిగా, శక్తిగా నిలబడ్డారని తెలిపారు. నైజాం ప్రజాశక్తిని నిషేధించిన కాలం నుంచి సంపాదకునిగా వివిధ రకాలుగా సేవలందించి పత్రికను నిలబెట్టారని తెలిపారు. పాత్రికేయునిగా, కమ్యూనిస్టు యోధునిగా ఆయన నెలకొల్పిన విలువలు వెలలేనివని కొనియాడారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, సంపాదకునిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా, చట్టసభల్లో ప్రజా ప్రతినిధిగా ఆయనది విశేష అనుభవమనీ, అన్నింటికి మించి ఆయన కడవరకూ ప్రజల మనిషిగా నిలబడ్డారని తెలిపారు. అందరిలో కుటుంబ భావన తెచ్చి, యువతరాన్ని ప్రోత్సహించే వారని గుర్తు చేసుకున్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి పరిస్థితిని మార్చేది కమ్యూనిస్టులేననేందుకు తార్కాణంగా నిలిచారని తెలిపారు.
మీడియా రంగం గతంలో కన్నా ప్రస్తుతం మరింత క్లిష్టమైనదిగా మారిందని తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు. ప్రజలను తికమక చేసే కాలంలో ఉన్నామని గుర్తుచేశారు. ఒక వాస్తవ వార్తను చదివేలోపే దాన్ని వక్రీకరించేలా పదుల సంఖ్యలో వార్తలు పుట్టుకొస్తున్నాయని హెచ్చరించారు. ఇండియా, పాకిస్తాన్‌ యుద్ధానికి సంబంధించి ట్రంప్‌ మధ్యవర్తిత్వం అనే అంశంపై వస్తున్న వార్తలను, ఇరాన్‌ సుప్రీంకు సంబంధించి ట్రంప్‌ మాట్లాడినట్టుగా వస్తున్న వార్తలను రవి ఈ సందర్భంగా ఉదహరించారు. ప్రత్యామ్నాయ జర్నలిజానికి పునాది వేసిన మోటూరు వారసత్వాన్ని, ఆదర్శాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. నేటి జర్నలిజానికి సెర్చ్‌ (శోధన) చేస్తే సరిపోదనీ, రీసెర్చ్‌ (పరిశోధన) అవసరమని సూచించారు.
నవతెలంగాణ సంపాదకులు రాంపల్లి రమేశ్‌ మాట్లాడుతూ పత్రికా కార్యాలయాన్ని ఉద్యమ క్షేత్రంగా మార్చిన కమ్యూనిస్టు యోధుడు, ప్రముఖ పాత్రికేయులు మోటూరు హనుమంతరావు అని కొనియాడారు. ఆయన ఏ విలువలు, మార్గం చూపించారో ఆ మార్గంలో అందరం ముందుకెళ్దామని ఆకాంక్షించారు. మోటూరు ఆశయాలకు పునరంకితమవుదామని సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్లు భరత్‌, వెంకటేశ్‌, రఘు, వాసు, బోర్డు సభ్యులు బసవపున్నయ్య, కె.ఎన్‌.హరి, మోహనకృష్ణ, సలీమా, అజరు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad