నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిర్లక్ష్యం తాండవం చేస్తుంది. మధ్యప్రదేశ్ లో అడ్డగోలు వంతెనల నిర్మాణాలు చేపట్టి లక్షల కోట్ల ప్రజాధనం వృథా అవుతుంది. ఆ రాష్ట్రంలో 90 డిగ్రీల బ్రిడ్జి, జెడ్ ఆకారంలో, పాము మెలికల వంతెనలు నిర్మించి ప్రజల ప్రాణాలతో బీజేపీ ప్రభుత్వాలు చెలగాటం అడుతున్నాయి. ఇటీవల భారీ వంతెన కూలి పలువురు మృతి చెందిన దుర్ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గుజరాత్ మోడల్ డొల్లతనం బయటపడింది. అంతకుముందు బీహార్‌లోని పట్నా-గయా ప్రధాన మార్గంలో ఉన్న జహానాబాద్‌లో మధ్యలో ఉన్న చెట్లను అలానే ఉంచి రోడ్డు వేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈసారి చెట్లు కాదు..ఏకంగా విద్యుత్ స్తంభాలను మధ్యలో వదిలేసి రోడ్డు వేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని పావోంటా సాహిబ్ ప్రాంతంలో.. కొత్తగా నిర్మించిన రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలను వదిలి వేయడంపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
హర్యానాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ రోడ్డుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియోలో రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను వాహనదారులు తప్పించుకుంటూ వెళ్తున్న దృశ్యాలను చూపిస్తూ.. డ్రైవింగ్ టెస్టు కోసం దేశంలోని ప్రఖ్యాత ఇంజినీర్లు ఇటువంటి రోడ్లను నిర్మిస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
హిమాచల్‌కు పర్యాటకాన్ని పెంచడానికి ఇటువంటివి సహాయపడతాయని పేర్కొన్నారు. అయితే.. దాదాపు 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్డును ఇటీవల పునరుద్ధరించిన అధికారులు విద్యుత్ స్తంభాలను మధ్యలోనే వదిలేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించినప్పటికీ మళ్లీ రోడ్డును పునర్నిర్మించడానికి తగిన నిధులు లేవని చెప్పినట్లు స్థానిక నాయకులు వెల్లడించారు.
