సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ – మిర్యాలగూడ
హమాలీ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో రైస్ మిల్ హమాలీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైస్ మిల్ హమాలీలకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రైస్ మిల్ కార్మికులకు అందడం లేదని వాపోయారు. నిత్యం కుటుంబ పోషణ కోసం రైస్ మిల్లులలో వెట్టి చాకిరీ చేస్తున్న హవాలీ వర్కర్లకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
రైస్ మిల్లులలో కనీస సౌకర్యాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పని భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ పూర్తిగా వర్తింపచేయాలన్నారు. కనీస వేతనాలు అందే విధంగా చూడాలని కోరారు. హమాలీ కార్మికులు ఐక్యంగా ఉండి సంఘం బలోపేతం కోసం పాటుపడాలన్నారు. హమాలీ వర్కర్ల కు సిఐటియు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి, ఆ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు లింగమయ్య, గుణగంటి రామచంద్రూ, పాపి రెడ్డి సుబ్బారావు, గాలయ్య, వెంకటేశ్వర్లు, అంజి, వినోదమ్మ, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.



