వ్యవసాయం అంటే నేడు అందరూ భారంగా భావిస్తున్నారు. వచ్చిన నష్టాలు పూడ్చుకోలేక ఎంతో మంది వ్యవసాయ రంగం నుండి తప్పుకుంటున్నారు. ఇక మహిళనైతే అసలు రైతుగానే గుర్తించారు. అలాంటిది ఒక మహిళ ఎంతో ధైర్యంగా వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతుంది. అందునా అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సేంద్రియ వ్యవసాయం చేస్తుంది. వ్యవసాయం చేయడం మాత్రమే కాకుండా, ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను, టెక్నాలజీని అవగాహన చేసుకుంటూ అనేక రకాల ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని ప్రజలకు చేరుస్తున్నారు. ఆమే మహిళా రైతు విజయం. వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, శంకరాపురం అనే గ్రామంలో విజయ పుట్టి పెరిగారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తల్లి నాగేంద్రం, నాన్న సుబ్బారావు. ఇద్దరూ వ్యవసాయం చేస్తారు. విజయకు చెల్లి రాజేశ్వరి కూడా ఉంది.వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన విజయకు చిన్నతనం నుండి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేస్తూ ఉండేది. చదువుకోవాలనే కోరిక ఉన్నా చదువుకోలేకపోయారు. 14 ఏండ్ల వయసులో పరిస్థితులకు తలవొంచి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు.
వ్యవసాయమే వృత్తిగా
విజయ చెల్లి, భర్త బెంగుళూరులో జాబ్స్ చేస్తున్నారు. చదువుకున్న వారంతా వ్యవసాయం విడిచిపెట్టి ఎక్కడెక్కడో దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలా అందరూ వ్యవసాయాన్ని పక్కనపెడితే తిండి ఎలా దొరుకుతుందనే ఆలోచనతో ఐదో తరగతి మాత్రమే చదువుకున్న విజయ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న పనే కాబట్టి ధైర్యంగా వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. పెండ్లి తర్వాత గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం గర్నెపూడి గ్రామంలో అడుగుపెట్టారు. భర్త కూడా వ్యవసాయం చేసేవారు. ఆమెకు తెలిసిన పని, వచ్చిన పని పొలంలో పనిచేయడం. కాబట్టి దాన్నే తన వృత్తిగా ఎంచుకున్నారు.
సేంద్రియ వ్యవసాయంతో…
పల్నాడు ప్రాంతంలో పండించే పంటలల్లో ప్రధానమైనవి పత్తి, మిర్చి, వరి. విజయ ఎక్కువగా మిర్చి పండిస్తారు. 2019లో విజయ మాములు వ్యవసాయం నుండి సేంద్రియ వ్యవసాయానికి మారారు. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే లక్షమే ఆమెను సేంద్రియ పంటల వైపుకు మళ్ళించింది. తన లక్ష్య సాధనలో భాగంగా సహజ పద్ధతుల్లో పండించిన పంటలతో కొన్ని రకాల ఫుడ్ ప్రోడక్ట్ కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. కొనుగోలు దారులకు వాటిని కొరియర్లలో పంపుతారు. ఇలా చాలా ప్రాంతాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పంపిస్తున్నారు.
నా పిల్లల అండతో…
‘ప్రభుత్వాలకు రైతుల గోడు పట్టదు. అందునా మహిళా రైతుల గురించి అసలే పట్టించుకోరు. అసలు మహిళలను రైతులుగానే గుర్తించారు. అయినా నేను మాత్రం ఎవరో ఏదో సాయం చేస్తారని ఎదురు చూడను. అలాగే మా కుటుంబం నుండి కూడా నాకు ఎలాంటి సహకారం లేదు. నా భర్తతో విభేదాలు వచ్చి విడిపోయి పిల్లల్ని తీసుకుని వచ్చేసాను. ఇప్పుడు నా పిల్లలు పెద్ద వాళ్లు అయ్యారు. అన్ని విషయాల్లో పిల్లలు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. చదువుకుంటూనే వ్యవసాయంలో నాకు సాయం చేస్తున్నారు. నా పిల్లలే నన్ను అర్థం చేసుకుని అన్నింట్లో చేదోడుగా ఉంటున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, నూతన టెక్నాలజీని అవగాహన చేసుకుంటూ, ప్రజలు ఆరోగ్యంగా వుండేందుకు మంచి పంటలను పండించడమే నా లక్ష్యం’ అని విజయ సంతోషంగా చెబుతున్నారు.
పాలపర్తి సంధ్యారాణి



