- Advertisement -
- బీహార్ ఎస్‌ఐఆర్‌లో 12వ పత్రంగా పరిగణించాలి
- ఎన్నికల కమిషన్‌కు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ : బీహార్ సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)లో ఆధార్‌ను కూడా కచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్(ఈసీ)ను ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే ఆధార్ అనేది పౌరసత్వానికి మాత్రం ధ్రువీకరణ కాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమ వలసదారుల సమస్య దృష్ట్యా.. అవసరమైన వేళ ఎన్నికల కమిషన్ సదరు ఆధార్ సరైనదేనా అనేది తనిఖీ చేయవచ్చని వెల్లడించింది.
రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), ఏఐఎంఐఎం ఇతర పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోరు మాల్య బాగ్చీల ధర్మాసనం విచారణ జరిపింది. సదరు పార్టీలు తమ వాదనలు వినిపించాయి. దీనికి సంబంధించి న్యాయస్థానం ఆధార్‌ను ఐడీ ప్రూఫ్‌గా గుర్తించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఓటరు జాబితాలో చేర్చడానికి లేదా తొలగించడానికి ఆధార్‌ను కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించిన ధ్రువీకరణ పత్రాల జాబితాలో 12వ పత్రంగా పరిగణించాలని ధర్మాసనం చెప్పింది. ఇది 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా తీసుకొన్న నిర్ణయమని వివరించింది. ఇప్పటికే ఈ జాబితాలో పాస్‌పోర్టు, బర్త్ సర్టిఫికెట్ వంటి 11 పత్రాలను ఐడీ ప్రూఫ్‌లుగా ఈసీ స్వీకరిస్తోన్న విషయం విదితమే. తమ ఆదేశాలు ప్రజలకు తెలిసేలా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని ఈసీ తరఫును హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదికి ధర్మాసనం సూచించింది. అంతకు ముందు రాకేశ్ ద్వివేది తన వాదనలు వినిపిస్తూ ఈసీఐ.. ఆధార్‌ను ప్రూఫ్‌గా స్వీకరించడానికి అంగీకరించినా.. పిటిషనర్లు దానిని 12వ గుర్తింపు పత్రంగా చేర్చాలని కోరడం దేనికని ప్రశ్నించారు. పౌరసత్వ ధ్రువీకరణ విషయంలో పాస్‌పోర్టుకు ఉన్న విలువ ఆధార్‌కు లేదని చెప్పారు. అలాంటప్పుడు దానిని ఆ జాబితాలో ఎలా చేరుస్తామని చెప్పారు.
కాగా బీహార్‌లో చేపట్టిన వివాదాస్పద ఎస్‌ఐఆర్ రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం విదితమే. ఈసీ సమాచారం ప్రకారం.. అభిప్రాయాలు, సూచనల కోసం ఇచ్చిన గడువు సెప్టెంబర్ 1 నాటికి ముగిసింది. ఈనెల 30 నాటికి తుది ఓటరు జాబితా విడుదల కానున్నది. ఆగస్టు 22 నుంచి 30 మధ్య ఓటరు జాబితాలో చేరికలకు సంబంధించి 22,723 క్లెయిమ్‌లను, తొలగింపుల విషయంలో 1.34 లక్షలకు పైగా అభ్యంతరాలను స్వీకరించింది.
- Advertisement -