Saturday, August 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅబాస్‌ను ఉపసంహరించుకోవాలి

అబాస్‌ను ఉపసంహరించుకోవాలి

- Advertisement -

– నేడు నల్ల బ్యాడ్జీలతో నిరసన
– తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వైద్యారోగ్యశాఖలో ఉద్యోగులందరికీ అమలు చేయాలనుకుంటున్న ఆధార్‌ బేస్‌డ్‌ అటెండెన్స్‌ సిస్టం (అబాస్‌)ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ – సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. శుక్రవారం (ఆగస్టు 1న) ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని యూనియన్‌ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియుద్దీన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్‌ మాట్లాడుతూ వైద్యారోగ్య రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు సమయ సందర్భాలు లేకుండా ప్రతి రోజు 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు. తమ వ్యక్తిగత జీవితాల్లో ముఖ్యమైన సందర్భాల్లో కూడా కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాలను అమలు చేస్తూ ఆరోగ్య తెలంగాణ సాధన కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ఇలాంటి పని చేస్తున్న తమ విషయంలో ఉద్యోగులను, అధికారులను ఎవరిని సంప్రదించకుండా అబాస్‌ విధానాన్ని తీసుకురావడం సమంజసంగా లేదని తీవ్రంగా ఖండించారు. ఎవరైనా ఉద్యోగులు పని చేయకపోతే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని గుర్తుచేశారు. అంతేగానీ ”ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నారన్న” చందంగా ఇలాంటి సంస్కరణలతో భవిష్యత్తులో ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందే పరిస్థితి ఉండదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ఉప కేంద్రాలు 20-30 కిలోమీటర్ల పరిధిలో ఉండటం వలన గ్రామాల్లో మొబైల్‌ నెట్వర్క్‌ సమస్య ఉందని తెలిపారు. సబ్‌ కేంద్రాల్లో పని చేసే మొత్తం మహిళా ఉద్యోగులకు సరైన సమయంలో హాజరు వేయడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం వల్ల ఉద్యోగులు చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు. తమ ఫోన్లలో ఉన్న సమాచారం మొత్తం బయటికి వెళ్లి,డబ్బులు పోగొట్టుకొని తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్‌ సిబ్బంది అందరు జాబ్‌చార్ట్‌తో నిమిత్తం లేకుండా ,సమయంతో నిమిత్తం లేకుండా, ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ ఏజెన్సీ, మారుమూల గ్రామాల్లో, గూడాల్లో, తండాల్లో పని చేయాల్సి వస్తుందనీ, వీరికి సమయ పాలన ప్రకారం హాజరు వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నేడు జరిగే నిరసన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులు యూనియన్లు, అసోసియేషన్లకు అతీతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర కోశాధికారి ఎ.కవిత, ఆఫీస్‌ బేరర్లు కే.బలరాం, వేణుగోపాల్‌, భూలక్ష్మి, విజయ వర్ధన్‌ రాజు, సుధాకర్‌, భాస్కర్‌, నవీన్‌ కుమార్‌, శ్రీనివాస్‌, యాదయ్య, కిరణ్మయి, ఏడుకొండలు, యాదగిరి, హరి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -