– ఆ రిపోర్టుపై స్టే ఇవ్వండి
– ఇందులో రాజకీయ కుట్ర దాగుంది : హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మాజీ మంత్రి టి. హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లకు నెంబర్ కేటాయింపు వ్యవహారం రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి, జస్టిస్ ఘోష్ కమిషన్‌లను చేర్చారు. ‘ఇరిగేషన్ శాఖ గతేడాది మార్చి 14న జారీ చేసిన జీవో 6ను రద్దు చేయాలి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణంలో ఉన్న లోపాలు, నిర్లక్ష్యం, అవకతవకలు తదితర అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారించిన తీరు న్యాయబద్ధంగా లేదు. సుప్రీం కోర్టు తీర్పులకు భిన్నంగా వ్యవహరించింది. కోర్టు మాదిరిగా నివేదిక ఇచ్చింది.
నిజ నిర్ధారణ చేయాల్సిన కమిషన్ ఏకపక్షంగా ఎవరు తప్పు చేశారో తేల్చేసింది. ఇదే నిజమని భావించడానికి వీల్లేదు. చట్ట నిబందనల ప్రకారం కమిషన్ విచారణ చేయలేదు. సాక్షులుగా విచారణకు పిలిచింది. ఇతర సాక్షులను క్రాస్ ఎగ్జామ్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. రాజకీయ ఉద్దేశంతో కమిషన్ నియామకం జరిగింది. ప్రభుత్వం ముందే కాళేశ్వరం ప్రాజెక్టలో అక్రమాలు జరిగాయనే నిర్ణయానికి వచ్చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కీర్తిని కించపర్చాలన్న ఉద్ధేశంతోనే కమిషన్ ఏర్పాటు చేసింది. 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుగా ప్రణాళిక రూపకల్పన జరిగినప్పటికీ మహారాష్ట్రతో తలెత్తిన అంతర్‌రాష్ట్ర సమస్యల కారణంగా 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగాక సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ సంస్థ ద్వారా జరిపించిన సర్వే రిపోర్టు ఆధారంగా ప్లాన్ తెప్పించుకుని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణాలతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మాణం జరిగింది.
తెలంగాణకు తాగు, సాగు నీరు ఇచ్చాం. ధాన్యం పంటలు వృద్ధి సాధించాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చాయి. మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ బీటలు వారడంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ ఏడాది జులై 31న నివేదిక ఇచ్చింది. నివేదికలో మాజీ సీఎం కేసీఆరే స్వయంగా ప్రాజెక్ట్ ప్రదేశాలను ఎంచుకున్నారని, క్యాబినెట్ ఆమోదం లేకుండా పరిపాలనా ఆమోదాలు ఇచ్చారని కమిషన్ ఏకపక్షంగా తేల్చింది. కాంట్రాక్టర్లకు అనుకూలంగా, అదనపు పనులు మౌఖిక ఆదేశాల ద్వారా అప్పగించారని కమిషన్ చెప్పడానికి ముందు తమకు ఇతర సాక్షులను క్రాస్‌ఎగ్జామ్ చేసేందుకు వీలుగా నోటీసులు ఇవ్వలేదు. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్-1952 ప్రకారం కమిషన్‌కి వాస్తవాలు కనుగొనే అధికారం మాత్రమే ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు తప్పు చేశారో తేల్చడానికి వీల్లేదు. ఎవరు తప్పు చేశారో తేల్చడానికి అధికారం లేదు. శిక్ష విధించే అధికారమూ లేదు.
ఆ చట్టంలోని సెక్షన్ 8-బి, 8-సి ప్రకారం, ఒక వ్యక్తి ప్రవర్తనపై దర్యాప్తు చేపట్టినా లేదా ఆ వ్యక్తి ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ముందుగా కమిషన్ నోటీసు ఇవ్వాలి. ఇతర సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు కల్పించాలి. ఇవేమీ లేకుండా కమిషన్ ఏకపక్షంగా, చట్ట వ్యతిరేకంగా నివేదికలో మాపై ఏకపక్షంగా పలు ఆరోపణలు చేసింది. సాక్షిగా విచారణకు పిలిచి అభియోగాలతో కూడిన నివేదిక ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. కమిషన్ నిజ నిర్ధారణ మాత్రమే చేయాలని సుప్రీం కోర్టు పలు తీర్పు చెప్పింది. ఎంక్వయిరీస్ ఆఫ్ కమిషన్ యాక్ట్‌లోని 8-బి అనే సెక్షన్‌ను విధిగా అమలు చేయాలని కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తీర్పులను పరిగణనలోకి తీసుకుని… జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గత ఏడాది మార్చి 14న జారీ చేసిన జీవో 6ను రద్దు చేయాలి. ఈ జీవో మేరకు ఏర్పాటైన కమిషన్ ఈ ఏడాది జులై 31వ తేదీన ఇచ్చిన రిపోర్టును రద్దు చేయాలి. మాపై వ్యాఖ్యలు, మీడియా ద్వారా జరగుతున్న ప్రచారం న్యాయప్రక్రియకు వ్యతిరేకం. కేసీఆర్ సీఎంగా ఉండగా పాలన చట్టపరంగా, సాంకేతిక, ఆర్థిక నిబంధనలను పొందాకే నిర్మాణం జరిగిన విషయాలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. రాజకీయంగా ముందే నిర్ణయించిన విధంగా చర్యలు ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యింది. తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా (రైస్ బౌల్) మార్పుకు దోహదపడింది. కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. కమిషన్ ఫలానా వాళ్లు తప్పు చేశారని నిర్ధారించే అధికారాలు లేవనే ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘించింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించింది. మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్, వర్షాల కారణంగా కుంగిపోయింది. అదేమీ నిర్మాణ లోపం కాదు. ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని, ప్రాజెక్టు ఖర్చులు పెరిగాయని, అధికారిక ప్రక్రియను అమలు చేయలేదనే ఆరోపణలు కమిషన్ ఎలా చెబుతుంది? అని పేర్కొన్నారు.
కాళేశ్వరం కమిషన్‌ను రద్దు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES