నవంబర్ 23న ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ఒక కథనం వచ్చింది. ‘పాశ్చాత్య నాగరికత’ను సంరక్షిం చుకోవడానికి యూరోపియన్ దేశాలన్నీ తమ తమ దేశాల్లోకి బయటనుంచి వచ్చే వలసలను పరిమితం చేయాలని అమెరికా పిలుపునిచ్చిందన్నదే ఆ కథనం సారాంశం. ఈ ‘పాశ్చాత్య నాగరికత’ అనేది చాలా విలువైనదని అనుకోవడం గాని, దానిని ఎలాగైనా కాపాడాలని అనుకోవడం గాని మూడవ ప్రపంచ దేశాలలోని చాలామందికి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాలు గత కొన్ని శతాబ్దాలుగా తక్కిన ప్రపంచంలోని దేశాల ప్రజలమీద సాగించిన దురాగతాలు, లైంగికదాడులు తలుచుకుంటేనే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సామ్రాజ్యవాద దేశాల ‘నాగరికత’ అటువంటి వికృతమైనది. అసలు వారి ప్రవర్తన వికృత రూపాన్ని కప్పిపుచ్చడానికి ‘నాగరికత’ అన్న పదంతో దానికి ముసుగు వేయడమే సహించరానిది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అనుసరించిన విధానాల వలన తలెత్తిన కరువుల ఫలితంగా భారతదేశంలో కోట్లాదిమంది ప్రాణాలను కోల్పోయారు.
నిస్సహాయులైన భారత రైతాంగం నుండి ఆదాయాన్ని పిండుకోడానికి దురాశాపూరితంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వ్యవహరించిన పర్యవసానమే ఈ కరువులు. కాంగో ప్రజలమీద బెల్జియం రాజు లియోపాల్డ్ మాటలతో చెప్పడానికి అలవికాని క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. నమీబియాలో జర్మనీ నిర్వహించిన నిర్బంధ శిబిరాల్లో ఏకంగా కొన్ని తెగలకు తెగలే కనుమరుగైనాయి. పాశ్చాత్య నాగరికత గురించి ఏమనుకుంటున్నారని గాంధీజీని ఒక విలేకరి అడిగితే చాలా వ్యంగ్యంగా అటువంటి ‘నాగరికత’ వారికి ఉండి వుంటే బాగుండేది అని ఆయన జవాబిచ్చారట. అయితే ఈ క్రూరత్వాన్ని అంతటినీ పక్కనబెట్టి కాస్సేపు పశ్చిమ దేశాలు భౌతిక సంపద విషయంలో సాధించిన పురోగతి పైనే దృష్టి సారిద్దాం. పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాలు మూడవ ప్రపంచ దేశాలను దోపిడీ చేసే విధానాలను అనుసరించడం ద్వారానే తమ పాదార్థిక అభివృద్ధిని సాధించగలిగాయి. దాని వలన ఏర్పడిన ఫలితాల ప్రభావం నుండి తప్పించుకుని ఎలాగైనా బయట పడాలని ఇప్పటికీ ఆ మూడవ ప్రపంచ దేశాల ప్రజానీకం నానా తిప్పలూ పడుతున్నారు.
పశ్చిమ దేశాలు తమ స్వతంత్రమైన ప్రత్యేక శక్తి సామర్ధ్యాల ద్వారా సాధించిన అభివృద్ధి అంటూ వేరే ఏదీ లేదు. మూడవ ప్రపంచ దేశాలను సర్వనాశనం చేయడం ద్వారా మాత్రమే పాశ్చాత్య దేశాల అభివృద్ధి అనేది సాధ్యపడింది. ఇప్పుడు ఆ మూడవ ప్రపంచ దేశాల నుండే ప్రజలు వలసదారుల రూపంలో ఎక్కడికైనా పోయి తలదాచుకోడానికి నానా అగచాట్లూ పడుతున్నారు. మూడవ ప్రపంచ దేశాలు తమ తమ దేశాల్లో అభివృద్ధి మార్గాన ముందుకు సాగి తద్వారా ఈ వలసలను నియంత్రించడానికి చేస్తున్న ప్రయ త్నాలను సైతం దెబ్బ తీయడానికి సామ్రాజ్యవాద దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం అవసరమైతే సైనికపరంగా కూడా జోక్యం చేసుకోడానికి తయారౌతున్నాయి. నేను చేస్తున్న ఈ వాదనను అతిశయోక్తులుగా పరిగణించి కొందరు కొట్టివేయవచ్చు. అటు వంటివారు చేస్తున్న వాదనలు ఇలా ఉన్నాయి: ‘పాశ్చాత్య దేశాల్లో గణనీయమైన సాంకేతిక మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి. వాటి ద్వారా చాలా అద్భుతంగా శ్రామిక ఉత్పాదకత పెరిగింది. తద్వారా పశ్చిమ దేశాల్లో నిజవేతనాలు, నిజ ఆదాయాలు బాగా పెరిగాయి.
సామ్రాజ్యవాద దేశాల్లో ఉన్నది, మూడవ ప్రపంచ దేశాల్లో కనిపించనిది ఈ కొత్త కొత్త పరిశోధనలే. ఆ సాంకేతిక పురోగతి అన్నదే పశ్చిమ దేశా లను మూడవ ప్రపంచ దేశాల కంటే భిన్నంగా నిలబెట్టింది. వాటి ఆర్థిక గమన దిశలో పూర్తి తేడా అన్నది దానివల్లే తలెత్తింది. దానివల్లే ఆ మూడవ ప్రపంచ దేశాల నుండి వలసదారులు వేరే వేరే ప్రాంతాలకు వలసలు పోతున్నారు.’
అయితే ఇక్కడ నూతన పరిశోధనల విషయంలో రెండు అంశాలను చెప్పాలి. ఏదైనా ఒక కొత్త సరుకుకు సంబంధించిన పరిశోధననను ఉత్పత్తి రంగంలో ఉపయోగిం చాలంటే అటువంటి సరుకుకు సంబంధించిన మార్కెట్ విస్తరించే పరిస్థితి ఉండాలి. అందువల్లే ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నప్పుడు కొత్త పరిశోధనలను ఉత్పత్తి రంగంలో ప్రవేశపెట్టరు. రెండవది: కొత్త ఆవిష్కరణలు వాటంతట అవే నిజవేతనాలను పెంచడానికి దోహదం చేయలేవు. అప్పటికి లేబర్ మార్కెట్‌లో కార్మికులు తగినంత సంఖ్యలో లభ్యం కాని పరిస్థితులు ఉన్నప్పుడే కొత్త ఆవిష్కరణలు నిజవేతనాల పెంపుకు తోడ్పడగలవు.
మూడవ ప్రపంచ దేశాల మార్కెట్లను సామ్రాజ్యవాదులు చేజిక్కించుకున్న కారణంగా చరిత్రలో దీర్ఘకాలం పాటు పాశ్చాత్య దేశాల ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తుందన్న అంచనాలు కొనసాగాయి. బ్రిటన్‌లో మొదలైన పారిశ్రామిక విప్లవం పారిశ్రామిక పెట్టుబడిదారీ యుగానికి నాంది పలికింది. అక్కడ యంత్రాల ద్వారా తయారైన సరుకులకు మార్కెట్‌ను కల్పించడం మూడవ ప్రపంచ దేశాల చేతి వృత్తుల మార్కెట్‌ను దెబ్బ తీయడం ద్వారా మాత్రమే సాధ్యపడింది. పశ్చిమ దేశాలలో వచ్చిన కొత్త ఆవిష్కరణలకు రెండో పార్శ్వంలో మూడవ ప్రపంచ దేశాల స్థానిక మార్కెట్ల వినాశనం కనిపిస్తుంది. దానితోబాటు పెద్ద ఎత్తున అక్కడ రిజర్వు శ్రామికులు (ఉపాధి కోల్పోయినవారు) తయారయ్యారు. సాంకేతిక పురోగతి కారణంగా నూతన ఆవిష్కరణలు ప్రవేశపెట్టిన దేశాల్లో సైతం రిజర్వు శ్రామికులు తయారయ్యారు. అయితే, పశ్చిమ యూరప్ నుండి పెద్ద సంఖ్యలో శ్రామికులు కెనడా, అమె రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితర సమశీతోష్ణ మండల దేశాలకు వలసలు పోయారు.
ఇలా వలసలు పోయినవారు ఆ కొత్త ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక తెగల ప్రజలను పెద్ద ఎత్తున ఊచకోత కోశారు. వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. వారి భూములను ఆక్రమించుకుని అక్కడ సాగు చేయడం ప్రారంభించారు. ఈ భారీ వలసల కారణంగా, ఏ దేశాల్లోనైతే కొత్త ఆవిష్కరణలు ఉత్పత్తిలో ప్రవేశపెట్టారో అక్కడ లేబర్ మార్కెట్‌లో కొంతవరకు కొరత కనిపించింది. అందువలన ఒక మేరకు నిజవేతనాల్లో పెరుగుదల వచ్చింది. కొత్త ఆవిష్కరణలు ఆ ప్రత్యేకపరిస్థితుల్లో ఉత్పాదకత పెరగడాని కి, అదే సమయంలో నిజవేతనాలు పెరగడానికి దారి తీశాయి. కాని మూడవ ప్రపంచ దేశాల్లో పెరిగిన రిజర్వు శ్రామికులు యూరప్ కార్మికుల మాదిరిగా ఆ సమశీతోష్ణ మండల దేశాలకు వలసలు పోవడం సాధ్యపడలేదు. వాళ్లు ప్రధానంగా ఉష్ణ మండల ప్రదేశాలకు మాత్రమే పరిమితం అయ్యారు. అక్కడ వేతనాల స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. పైగా వలసలపై చాలా ఆంక్షలు కూడా ఉంటాయి.
నేటికీ అదే పరిస్థితి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పశ్చిమ యూరప్ దేశాల నుండి ఆ దేశాలకు పెట్టుబడిదారులు గనుక తరలివెళ్లి అక్కడి తక్కువ వేతనాల స్థాయిని ఉపయోగించుకుని తమ వద్దనున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ప్రపంచ మార్కెట్‌కు సరుకులను అందించివుంటే అప్పుడు పశ్చిమ దేశాలకు, మూడవ ప్రపంచ దేశాలకు మధ్య వేతనాల్లోని వ్యత్యాసాలు అంతరించి వుండేవి. కాని సమశీతోష్ణ మండల దేశాల నుండి పెట్టుబడి ఉష్ణమండల దేశాలకు ఆ విధంగా తరలిరాలేదు. కేవలం పరిశ్రమలకు కావలసిన ముడిసరుకుల ఉత్పత్తి రంగాలకు మాత్రమే వచ్చింది. ఇక ఉష్ణ మండల దేశాలలో సరుకుల ఉత్పత్తి రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్థానిక పెట్టుబడిదారులు సరుకులను ఉత్పత్తి చేసినా, సమశీతోష్ణ మండల దేశాల్లో అమలులో ఉన్న అధిక దిగుమతి సుంకాల వలన ఆ సరుకులను ఎగుమతి చేయడం సాధ్యం కాలేదు. అందుచేత పాశ్చాత్య దేశాలలో నూతన ఆవిష్కరణలు కేవలం సంపన్న పెట్టుబడిదారీ దేశాలను మాత్రమే సంపన్నవంతం చేశాయి. అది కూడా తక్కిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను విడదీసి వేరుగా ఉంచడం ద్వారా మాత్రమే జరిగింది.
ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేరు వేరుగా ముక్కలు చేసి ఉంచిన పరిస్థితుల్లోనే పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యాప్తి జరిగింది. సమశీతోష్ణ మండల దేశాలకు యూరప్ నుంచి వలసలు పోయిన శ్రామిక వర్గంతోబాటు యూరప్ నుండి పెట్టుబడి కూడా ఆ దేశాలకు వెళ్లింది. అయితే ఆ పెట్టుబడి అంతా ఉష్ణమండల ప్రదేశాల్లోని వలస దేశాల నుండి కొల్లగొట్టినదే. ఆ వలస దేశాలు ఎగుమతి చేసిన ముడి సరుకుల ద్వారా పోగుబడిన విదేశీ మారకద్రవ్యాన్ని వాటికి చెల్లించకుండా స్వాధీనం చేసుకుని ఆ మిగులునే ఈ సమశీతోష్ణ మండల దేశాలకు (కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వగైరా) పెట్టుబడిగా తరలించారు. 19వ శతాబ్దంలో సుదీర్ఘ కాలం పాటు ఇలా పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణ బ్రిటన్ నుండి ముందు యూరప్ ఖండంలోని తక్కిన దేశాలకు, అక్కడి నుండి సమశీతోష్ణ మండల దేశాలైన కెనడా, అమెరికా వగైరా దేశాలకు కొనసాగింది. ఈ కాలం అంతా బ్రిటన్ తన మార్కెట్లను ఎటువంటి ఆంక్షలూ లేకుండా తెరచి వుంచింది. ఆయా ప్రదేశాల నుండి సరుకులు బ్రిటన్‌లోకి యథేచ్ఛగా రావడానికి, ఆ ప్రదేశాలకు బ్రిటన్ నుండి పెట్టుబ డులు యథేచ్ఛగా పోవడానికి ఇది తోడ్పడింది.
ఆ క్రమంలో బ్రిటన్ నుండి జరిగిన సరుకుల ఎగుమతుల కన్నా దిగుమతులు అధికంగా ఉండి వాణిజ్యంలో లోటు భారీగా ఉండేది. అదేవి ధంగా బ్రిటన్‌లోకి వచ్చిన పెట్టుబడుల కన్నా బ్రిటన్ నుండి తరలి వెళ్లిన పెట్టుబడే అధికంగా ఉండి పెట్టుబడి ఖాతాలోనూ భారీగా లోటు ఉండేది. 1910 నాటికి ఈ లోటు మొత్తం 12 కోట్ల పౌండ్ల వరకూ చేరింది. అందులో దాదాపు సగం లోటును పూడ్చడానికి బ్రిటన్ భారతదేశానికి చెల్లించవలసిన సొమ్ము (ముడిసరుకులను కొనుగోలు చేసినందువల్ల చెల్లించవలసినది) చెల్లించకుండా ఎగ్గొట్టింది. అంతేకాక, ఇండియాలో బ్రిటన్ నుండి వచ్చిపడ్డ పారిశ్రామిక ఉత్పత్తుల కారణంగా ఇక్కడ చేతివృత్తులు నాశనమయ్యాయి. బ్రిటన్‌కు ఇండియా ఎగుమతి చేసిన ముడి ససరుకుల విలువ కన్నా ఇక్కడ చేతివృత్తులు నాశనం అయినందువలన ఇండియా నష్టపోయినది చాలా ఎక్కువ. తక్కిన యూరప్ దేశాలతోను, అమెరికాతోను ఆ నాడు బ్రిటన్‌కు ఉండిన వాణిజ్య, పెట్టుబడి ఖాతాల లోటు 9 కోట్ల 50 లక్షల పౌండ్లు. అందులోదాదాపు మూడింట రెండువంతుల మేరకు లోటును భర్తీ చేయడానికి బ్రిటన్ ఇండియాను బలిపశువును చేసింది.
ఆ విధంగా పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి యావత్తూ ప్రపంచాన్ని ముక్క ముక్కలుగా చేయడం ద్వారా జరిగింది. ఈ క్రమంలో పాశ్చాత్య దేశాలు ప్రవేశపెట్టిన నూతన ఆవిష్కరణలు సైతం ఈ ముక్కచెక్కలైన చట్రం పరిధిలోనే జరిగాయి. అందుచేత పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు సుసం పన్నంగా మారడానికి, మూడవ ప్రపంచ దేశాలు అభివృద్ధికి నోచుకోకుండా కునారిల్లిపోడానికి కారణం అక్కడ ప్రవేశపెట్టిన నూతన ఆవిష్కరణలు కావు. ఇలా ప్రపంచాన్ని ముక్కచెక్కలు చేసి కొల్లగొట్టడమే కారణం. జోసెఫ్ స్కంపీటర్ వంటి సిద్ధాంతవేత్తలు సైతం నూతన ఆవిష్కరణల ప్రవేశం వలన (పెట్టుబడి దారులతోబాటు) కార్మికవర్గం యావన్మందీ ప్రయోజనం పొందుతారనే చెప్పారు తప్ప కొన్ని ప్రాంతాల కార్మికులు మాత్రం ప్రయోజనం పొంది తక్కిన ప్రాంతాల కార్మికులకు ఆ ప్రయోజనాలు దక్కవని ఎక్కడా చెప్పలేదు. అందుచేత ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడి వుండ డానికి, కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందడానికి మూల కారణం నూతన ఆవిష్కరణలు కావు. పనిగట్టుకుని ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచి వాటిని కొల్లగొట్టడమే అసలు కారణం.
ఇప్పుడు వలస పాలనకు కాలం చెల్లింది. అంతేగాక సంపన్న పెట్టుబడిదారీ దేశాల నుండి పెట్టుబడులు మూడవ ప్రపంచ దేశాల మార్కెట్లలోకి తరలిరావడానికి సుముఖంగానే ఉన్నాయి. ఇక్కడ ముడిసరుకులు చౌకగా లభించడంతోబాటు కార్మికులు కూడా చౌకగా దొరుకుతారు. అదీ ఈ సుముఖతకు కారణం. మరి అటువంటప్పుడు మూడవ ప్రపంచ దేశాల పేదరికం తొలగి పోయివుండాలి కదా? ఎందుకు ఆ విధంగా జరగడం లేదు? జోసెఫ్ స్కంపీటర్ వంటి వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు తప్పు అని, నూతన ఆవిష్కరణలు ప్రవేశపెట్టి నంత మాత్రాన కార్మికుల నిజవేతనాలు పెరగవు అని స్పష్టంగానే కనిపిస్తోంది. మూడవ ప్రపంచ దేశాల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రవేశపెట్టినందువలన-అది పాశ్చాత్యదేశాల పెట్టుబడి కానీ యండి, లేదా దేశీయ పెట్టుబడి కానీయండి-రిజర్వు శ్రామిక సైన్యం సైజు (నిరుద్యోగుల సంఖ్య) గాని, పేదరికం గాని తగ్గవు.
నిజానికి ఇప్పుడు ప్రవేశపెట్టే నూతన సాంకేతిక ఆవిష్కరణలు కార్మికుల, ఉద్యోగుల సంఖ్యను తగ్గించేవిగానే ఉన్నాయి. ఇక్కడి రిజర్వు కార్మిక సైన్యం వలసలు పోవడానికి ఏ సమశీతోష్ణ మండల ప్రదేశాలూ ఇప్పుడు లేవు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారేట్టుగానే ఉన్నాయి. ఇందుకు మొదటి కారణం ట్రంప్ విధించిన సుంకాల పెంపు. దీనివలన అమెరికా నుండి నిరుద్యోగం మూడవ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. రెండో కారణం కృత్రిమ మేథ లేదా ఎ.ఐ. దీన్ని పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రవేశ పెట్టడం వలన కూడా పరిస్థితులు మరింత దిగజారుతాయి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



