Friday, November 28, 2025
E-PAPER
Homeజిల్లాలుఏసీబీ వలలో పెద్దవంగర తహశీల్దార్

ఏసీబీ వలలో పెద్దవంగర తహశీల్దార్

- Advertisement -

• మ్యుటేషన్ కు రూ.15 వేలు డిమాండ్ 
• డ్రైవర్ కు ఇస్తుండగా పట్టుబడిన వైనం 
నవతెలంగాణ -పెద్దవంగర
పెద్దవంగర తహశీల్దార్ వీరగంటి మహేందర్ ఏసీబీ వలలో చిక్కారు. ఓ రైతు నుండి తహశీల్దార్ డ్రైవర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పడమటి తండాకు చెందిన భూక్య స్వామి గత ఆరు నెలల క్రితం మృతి చెందాడు. ఆయనకు గంట్లకుంట గ్రామ శివారులోని సర్వే నెంబర్ 212/2, 226/5, 227/5 లో మొత్తం 3.09 ఎకరాల భూమి ఉంది. సదరు భూమిని ఆయన కుమారుడు భూక్య బాలు పేరు మీదకు వారసత్వంగా మార్చడానికి తహశీల్దార్ రూ. 20 వేలు డిమాండ్ చేశాడు.

దీంతో అంత మొత్తం చెల్లించలేక బాలు తన సమీప బంధువైన ధరావత్ మురళీ నాయక్ తో కలిసి ఇటీవల ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తహశీల్దార్ ఆదేశాలతో ఆయన డ్రైవర్ గౌతమ్ శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రూ.15 వేలు తీసుకున్నాడని డీఎస్పీ వివరించారు. కెమికల్ టెస్ట్ ఆధారంగా తహశీల్దార్, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి నగదును స్వాధీనం చేసుకుని, ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. దాడుల్లో ఏసీబీ సీఐ లు ఎల్. రాజు, ఎస్. రాజు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. 

• లంచం అడిగితే.. ఫిర్యాదు చేయండి..
ప్రజలకు సర్వీస్ చేసేందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఇవ్వకూడదు. ఎవరైనా లంచం అడిగినా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టినా మాకు సమాచారం ఇవ్వండి. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు, 9440446106 వాట్సాప్ నెంబర్ కు, ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

• ఆరు నెలలుగా తిరుగుతున్నాం..
భూమి మ్యుటేషన్ కోసం ఆరు నెలలుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. రూ.20 వేలు ఇస్తేనే మ్యుటేషన్ చేస్తామని తహశీల్దార్ ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాం. పైసలు ఇస్తేనే తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -