Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

- Advertisement -

– రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయం
– ఏప్రిల్‌ తొలివారంలో తిరిగి భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌

సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కమిటీ సమావేశమైంది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌, ఎస్‌ఎంఏసీ చైర్మెన్‌ కె. శ్రీనివాస్‌ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌, ఎస్‌ఎంఏసీ కో-చైర్‌పర్సన్‌ సీహెచ్‌ ప్రియాంకతోపాటు సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అక్రిడిటేషన్‌ కోసం జర్నలిస్టులు సమర్పించిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కొంతమంది అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మెన్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేస్తామన్నారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ కార్డు మంజూరులో ఎలాంటి లోపం ఉండదని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశాన్ని తిరిగి ఏప్రిల్‌ మొదటివారంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులు ఆన్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు పంపే ‘జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ (డీఎంఏసీ)’ ప్రతిపాదనలను కూడా పరిశీలించి ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో అక్రిడిటేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ కిషోర్‌ బాబు, అదనపు డైరెక్టర్‌ డీఎస్‌ జగన్‌తోపాటు ఇతర కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -