సమాచార శాఖ స్పెషల్ కమిషనర్, సీపీఆర్‌వోకు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల మధ్య విభజన సరికాదని అభిప్రాయపడింది. రిపోర్లర్లు, డెస్క్ జర్నలిస్టులు అనే వివక్ష చూపొద్దని సూచించింది. ప్రస్తుతం ఉన్న అక్రిడిటేషన్ కార్డులను తగ్గించకుండా యధావిధిగా కొనసాగించాలని కోరింది, శనివారం హైదరాబాద్‌లోని సమాచార భవన్‌లో స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, సచివాలయంలో ముఖ్యమంత్రి సీపీఆర్‌వో డాక్టర్ గుర్రం మల్సూర్‌ను వేర్వేరుగా ఫెడరేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జీవో 252, తాజా పరిణామాలు, పరిష్కారాలపై చర్చించారు. పాత, కొత్త జీవోలకు సంబంధించి విషయాలను సుదీర్ఘంగా మాట్లాడారు.
తాజా జీవోతో తలెత్తిన పరిణామాలు, జర్నలిస్టుల ఆందోళనకు సంబంధించి పలు అంశాలను స్పెషల్ కమిషనర్, సీపీఆర్‌వో దృష్టికి ఫెడరేషన్ నాయకులు తీసుకెళ్లారు. ఈసందర్భంగా స్పెషల్ కమిషనర్ ప్రియాంక స్పందిస్తూ అక్రిడిటేషన్ల విషయంలో వర్కింగ్ జర్నలిస్టులకు నష్టం జరగదనీ, డెస్క్ జర్నలిస్టులకూ ప్రభుత్వం అందించే అన్నీ వసతులు వర్తిస్తాయని హామీ ఇచ్చారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడి వర్కింగ్ జర్నలిస్టులకు నష్టం జరగకుండా చొరవ తీసుకుంటానని సీపీఆరోవో మల్పూరు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో టీడబ్ల్యూజేఎఫ్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ పి.రాంచందర్, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు బి. జగదీష్, గండ్ర నవీన్, హెచ్‌యూజే అధ్యక్షులు బి.అరుణ్‌కుమార్, రాష్ట్ర నాయకులు కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



