Wednesday, December 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'అగర్వాల్‌' పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి

‘అగర్వాల్‌’ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ప్రమాదాలపై పట్టించుకోని కార్మిక శాఖ
యాజమాన్యంపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి
కార్మికుని కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి : సీపీఐ(ఎం) నేతల డిమాండ్‌..
పరిశ్రమలో పరిశీలన


నవతెలంగాణ-మనోహరాబాద్‌
ఎమ్మెస్‌ అగర్వాల్‌ ఫౌండరీస్‌ స్టీల్‌ పరిశ్రమలో రక్షణ చర్యలు పాటించకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరిగి కార్మికులు మృతి చెందుతున్నారని, యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మెదక్‌ జిల్లా మనోరాబాద్‌ మండలం రంగయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎమ్మెస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌లో సోమవారం జరిగిన ప్రమాద ఘటనపై మంగళవారం సీపీఐ(ఎం) నేతలు పరిశ్రమను సందర్శించారు. కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య మాట్లాడుతూ.. తక్షణమే ప్రమాద ఘటనపై ప్రభుత్వం, అధికారులు స్పందించి యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కార్మికుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

పరిశ్రమలో ప్రమాదంలో కార్మికుడు మృతి చెందినా యాజమాన్యం సరిగా స్పందించలేదన్నారు. ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు వాడాల్సి ఉన్నా ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నించారు. బాయిలర్‌ దగ్గర అత్యవసర అలారం పెట్టలేదని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయాలని నిబంధనలు ఉన్న యాజమాన్యం అమలు చేయలేదని అన్నారు. ఎమ్మెస్‌ అగర్వాల్‌ యాజమాన్యం కార్మికుల భద్రత కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తోందని ప్రమాద స్థలాన్ని బట్టి అర్థం అవుతుందని అన్నారు. పని ప్రదేశంలో కార్మికులకు హెల్మెట్‌, గ్లోవ్స్‌, మాస్క్‌ వంటివి అందించి అవి సరిగా పనిచేస్తున్నాయా లేదా అని నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.నిబంధనలు పాటించకుండా కార్మికుల జీవితాలతో పరిశ్రమ యాజమాన్యం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అగర్వాల్‌ పరిశ్రమలో రెండు నెలల కిందట కూడా ఓ కార్మికుడు చనిపోయారని తెలిపారు. వలస కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ప్రమాదంలో గాయపడిన కార్మికుల వైద్యానికి అయ్యే ఖర్చులను పరిశ్రమ యాజమాన్యమే భరించాలని డిమాండ్‌ చేశారు. మృతిచెందిన కార్మికుని కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కార్మిక శాఖ, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, అగ్నిమాపక శాఖలు కార్మికుల కోసం కాకుండా పరిశ్రమ యజమానుల వైపు ఉంటున్నా యని ఆరోపించారు. ఎమ్మెస్‌ అగర్వాల్‌ పరిశ్రమతో పాటు జిల్లాలోని మిగతా పరిశ్రమల్లో నిత్యం జరుగుతున్న ప్రమాదాలపై జిల్లా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం, ఏ.మహేందర్‌ రెడ్డి, తూప్రాన్‌ ఏరియా కమిటీ నాయకులు ఆసిఫ్‌, రాజు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -