మీసేవ నిర్వాహకులకు అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశం
నవతెలంగాణ – వనపర్తి
మీసేవ కేంద్రాల నిర్వహకులు నిబంధనలు అతిక్రమించి ప్రజలు, రైతులు, విద్యార్థుల నుండి అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ హెచ్చరించారు. శనివారం ఈడియం వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 72 మీసేవ కేంద్రాల నిర్వహకులు నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. అలా కాదని నిబంధనలు అతిక్రమించి ప్రజలు, రైతులు, విద్యార్థుల నుండి అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు వసూళ్లకు పాల్పడి మీ సేవ కేంద్రాలను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.
మీసేవ కేంద్రాల నిర్వహకులు తమ కేంద్రాలకు వచ్చే రైతులతో సహృదయంతో మెలిగి వారికి మంచి సేవలు అందించాలన్నారు. ప్రతి మీ సేవ కేంద్రంలో రేట్ చార్టు( ధరల పట్టిక ) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. త్వరలోనే ఈడీఎం ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేసి మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. ఎక్కడైనా నిబంధనలను విరుద్ధంగా వసూళ్లు చేస్తున్నట్లు తేలితే మీ సేవ రద్దు చేయడమే కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నిర్వాహకులు సమయపాలన పాటిస్తూ గ్రామస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. అదేవిధంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎం, మీసేవ కేంద్రాలు నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.



