Friday, December 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏడీ అదనపు ఆస్తులు గుర్తింపు

ఏడీ అదనపు ఆస్తులు గుర్తింపు

- Advertisement -

ఆరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారుల సోదాలు
రంగారెడ్డి జిల్లా ఏడీ ఆఫీసులోనూ ఫైల్స్‌ తనిఖీలు
రూ.5 లక్షల నగదుతోపాటు వందల కోట్ల విలువ చేసే ల్యాండ్‌ డాక్యుమెంట్స్‌ గుర్తింపు


నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ల్యాండ్స్‌ అండ్‌ సర్వే రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ) కె.శ్రీనివాస్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూములను ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గురువారం ఏసీబీ అధికారులు ఆరు బృందాలుగా వీడిపోయి ఏకకాలంలో ఆయన ఇల్లు, ఆఫీసు, బంధువులు, బినామీల ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వంద కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు కె. శ్రీనివాస్‌ ఐదేండ్లుగా ఏడీగా పనిచేస్తున్నారు.

గతంలో మేడ్చల్‌ జిల్లాకు సంబంధించిన ఓ భూ వివాదంలో ఇతనిపై ఏసీబీ కేసు నమోదై సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం మళ్లీ ఏడీగా విధుల్లో చేరారు. ఈ క్రమంలో మళ్లీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఓ వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం ఆరుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రంగారెడ్డి జిల్లా రాయదుర్గం మై హౌం భుజాలో విలాసవంతమైన ప్లాట్‌, కర్నాటకలో 11 ఎకరాల భూమి, అనంతపూర్‌లో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. అదే విధంగా నారాయణ పేటలో రైస్‌మిల్‌, మూడు ప్లాట్లు, మహబూబ్‌నగర్‌లో నాలుగు ప్లాట్లు, అతని ఇంట్లో 1.6 కేజీల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు, కియా, ఇన్నోవా కారు, రూ.5 లక్షల నగదు ఉన్నట్టు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -