మహిళలపై మద్యం, డ్రగ్స్ ప్రభావం ఆందోళనకరం : ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి
నల్లగొండలో ‘మాదక ద్రవ్యాలు-మహిళలు, సమాజంపై ప్రభావం’ అంశంపై సెమినార్
నవతెలంగాణ-నల్లగొండ
మాదకద్రవ్యాలు, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సమాజాన్ని క్రమంగా దెబ్బతీస్తున్నాయని, మహిళలు, యువతపై వీటి ప్రభావం ఆందోళనకరంగా ఉందని ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో ‘మాదక ద్రవ్యాలు-మహిళలు, సమాజంపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్తు పదార్థాల నియంత్రణలో విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి గల్లీలో బెల్ట్‌షాపులు పెరిగి మద్యం ఏరులై పారిపోతోందని అన్నారు. మంచినీళ్లు దొరకడం కష్టమవుతున్నా, మద్యం మాత్రం ఎక్కడైనా సులభంగా లభిస్తోందన్నారు.
కల్తీ మద్యం కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు, నిఘాసంస్థలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి పెద్దఎత్తున మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా అవుతున్నా, పాలకులు దాన్ని అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించే యువకులు, పురుషులు.. మహిళలపై అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు లైంగికదాడులు, హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుక్తవయస్సులోనే వితంతువులుగా మారిన మహిళలు తమ పిల్లలను పోషించుకోలేక, అనేకమంది తప్పుడు మార్గాలకు వెళ్తున్న దుస్థితి ఉందన్నారు.
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అశ్లీలత వ్యాప్తి చెందుతూ యువతను దారి తప్పిస్తోందన్నారు. వీటిని అరికట్టేందుకు సమాజం బలమైన ఉద్యమాలతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఐద్వా జాతీయ స్థాయిలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నదన్నారు. ఇక గ్రామీణ స్థాయి వరకు ఈ ఉద్యమాలను విస్తరించి మహిళలను చైతన్యవంతులను చేసి, ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, జిల్లా అధ్యక్షులు పోలేబోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల పద్మ, పాదూరి గోవర్థన, సుల్తానా, మేకల వరుణమ్మ, ఉమా, వెంకటమ్మ, మిర్యాల శ్రీవాణి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
సమాజాన్ని దెబ్బతీస్తున్న మత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



