నవతెలంగాణ హైదరాబాద్ : రైతుల భవిష్యత్తు కోసం, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం.. సాగుకు సౌరశక్తే మార్గం అంటూ కేంద్ర గనుల, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి కుశుమ్ యోజన ఫోకస్‌ను గుర్తు చేస్తూ తెలంగాణ రైతులకు భారీ ఊరట కలిగించే ప్రకటనను ఎక్స్ వేదికగా చేశారు. “తెలంగాణకు అదనంగా 450 మెగావాట్ల డీసెంట్రలైజ్డ్ గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్లుకు ఆమోదం లభించిందని, అలాగే 20,000 సౌర వ్యవసాయ పంపులను కూడా మంజూరు చేశారు” అని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణకు అపారంగా ఉన్న సౌరశక్తి సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ కిషన్ రెడ్డి తెలంగాణ సర్కార్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. “2026తో స్కీమ్ ముగుస్తుంది. అయితే ఇప్పటివరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో అమలు శూన్యంగా ఉంది. దీనిని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నది పూర్తి సత్యం” అని కిషన్ రెడ్డి విమర్శించారు.