– భారత్ మార్కెట్‌ను బ్రిటన్‌కు అప్పగించిన ప్రధాని మోడీ
– 90 శాతం సుంకాలు తగ్గింపు
– యూకే- ఇండియా మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
– ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో సంతకాలు
– ప్రమాదంలో ఆటోమొబైల్ రంగం
– వ్యవసాయం, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలపై ప్రభావం
– పూర్తి ఒప్పంద వివరాల వెల్లడికి నో…
భారతదేశాన్ని మళ్లీ బ్రిటీషర్ల చేతికి అప్పగించేలా ప్రధాని నరేంద్ర మోడీ విధాన నిర్ణయాలు తీసుకున్నారు. మా దేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండంటూ బ్రిటన్‌కు రెడ్‌కార్పెట్‌తో ఆహ్వానం పలికారు. ఆ మేరకు భారత ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ల సమక్షంలో భారత్-బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. భారతదేశంలోకి బ్రిటన్ ఉత్పత్తుల ప్రవేశంపై 90 శాతం సుంకాలను తగ్గిస్తూ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం భారత్ కంటే బ్రిటన్‌కే ఎక్కువ మేలు చేస్తుందని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ టెండర్లపై బ్రిటన్ ఆధిపత్యం పెంచుకుంటుంది. భారత మేదో హక్కులు హరించుకుపోతాయి. బ్రిటన్ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు వల్ల భారతదేశంలోకి ఆ దేశ ఉత్పత్తులు వరదల్లా వచ్చి పడతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా భారతదేశంలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఈ ఒప్పందంపై గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (జీఆర్‌టీఐ) తన నివేదికలో పలు ఆందోళనలను లేవనెత్తింది. ఇరు దేశాలు ఒప్పందం పూర్తి వివరాలను వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నవ తెలంగాణ – బిజినెస్ డెస్క్
భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో గురువారం ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఇరు దేశాల మధ్య ఏటా 34 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3 లక్షల కోట్లు) వాణిజ్యం జరుగుతుందని అంచనా. మూడేండ్లకు పైగా చర్చల తర్వాత గత మేలో దీనిపై స్పష్టత రాగా.. తాజాగా ఒప్పందం కుదిరింది. ”భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో విజన్-2035 లక్ష్యంగా సాగుతున్నాం. ఇరు దేశాల భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కనుంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో కలిసి సాగుతాం. ఆరు బ్రిటన్ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవారి పట్ల కఠినంగా ఉంటాం. క్రికెట్ తరహాలో భారత్-బ్రిటన్ దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. బ్రిటన్ ప్రధాని ఆతిథ్యానికి ధన్యవాదాలు. స్టార్మర్ భారత్‌కు రావాలని ఆహ్వానిస్తున్నా.” అని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఒప్పందం భారత రైతులు, ఎంఎస్‌ఎంఇ రంగం, ఫుట్‌వేర్, ఆభరణాలు, సీఫుడ్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుందని మోడి పేర్కొన్నారు. ఆర్థిక నేరస్థుల ఒప్పందంపై రెండు దేశాలు సహకారాన్ని మెరుగు పరుస్తాయని తెలిపారు.”ఈ ఒప్పందం అత్యాధునిక తయారీ, స్కాట్లాండ్‌లోని విస్కీ డిస్టిలర్లు, లండన్, మాంచెస్టర్, లీడ్స్‌లోని సేవా రంగంలో బ్రిటిష్ కార్మికులకు మేలు చేస్తుంది” అని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అన్నారు. బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్‌కు ఇది అతిపెద్ద వాణిజ్య ఒప్పందమని బ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ తెలిపారు.
పొంచి ఉన్న ప్రమాదాలు..
భారత్- యూకే స్వేచ్చా వాణిజ్య ఒప్పందంతో ఇండియాకు చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో బ్రిటన్‌లో భారీగా ఉద్యోగాల సృష్టి చోటు చేసుకోనుంది. మరోవైపు భారత్‌లోని ఆటోమొబైల్ రంగంలోని లక్షలాది ఉద్యోగాలు ప్రమాదం పడనున్నాయి. కార్ల దిగుమతిపై ప్రస్తుతం ఉన్న సుంకాలు 100 శాతం నుండి 10 శాతానికి తగ్గించడం ద్వారా బ్రిటన్ కార్లు ఇక్కడ చౌకగా లభించనున్నాయి. దీంతో దేశీయంగా ఈ రంగం దెబ్బతిననుంది. ఫలితంగా ఉద్యోగాలు తగ్గిపోనున్నాయి. అదే విధంగా వ్యవసాయం, చిన్న, మధ్య తరగతి సంస్థలపై ప్రభావం ఉండవచ్చని ఆందోళనలు నెలకొన్నాయి.
ప్రభుత్వ టెండర్లలోకి ప్రవేశం
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా భారత ప్రభుత్వ టెండర్లలో బ్రిటన్ కంపెనీలు ఆధిపత్యం పెంచుకోనున్నాయి. దీని ద్వారా భారత్‌లోని 38 బిలియన్ల (సుమారు రూ.40 లక్షల కోట్లు) విలువైన ప్రభుత్వ టెండర్లలో పాల్గొనే అవకాశం ఆ దేశ కంపెనీలకు లభిస్తుంది. భారత సంస్థలతో జాయింట్ వెంచర్‌లు లేదా టెక్నాలజీ బదిలీ ఒప్పందాల ద్వారా ఈ టెండర్లలో పాల్గొనవచ్చు. రైల్వే, రోడ్లు, రవాణా మౌలిక సదుపాయాలు తదితర రవాణ రంగంపై, మెడికల్ పరికరాలు, ఆసుపత్రి సేవలు, సోలార్, విండ్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలైనటువంటి స్మార్ట్ సిటీలు, జలవనరుల నిర్వహణ రంగాల్లో పెట్టుబడులకు ఎర్ర తివాచీ పర్చింది. ఇవి బ్రిటన్ కంపెనీలకు కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తాయి. ఒప్పందం ద్వారా యుకె కంపెనీలపై ఉన్న బ్యూరోక్రాటిక్ ఆంక్షలు, లైసెన్సింగ్ అవసరాలు లాంటి నాన్ టారిఫ్ అడ్డంకులు తగ్గించబడతాయి. దీంతో టెండర్ ప్రక్రియలో పాల్గొనడం సులభతరం కానుంది. ఈ అవకాశాలు యుకె కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులను పెంచడానికి, స్థానిక భాగస్వామ్యాలను ఏర్పరచడానికి మద్దతును అందించనున్నాయి.
ఇది యూకే జీడీపీకి అదనంగా 4.8 బిలియన్ల పౌండ్లు (దాదాపు రూ.56వేల కోట్లు) మద్దతును అందించనుందని ఆ దేశం అంచనా. 2040 నాటికి ఇది 15.7 బిలియన్ పౌండ్ల (దాదాపు 1.84 లక్షల కోట్ల)కు పెరగొచ్చని అంచనా. అంతిమంగా 21వ శతాబ్దంలో మళ్లీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు భారత్ విస్తృత అవకాశాలు కల్పించనుంది. చౌక ఎగుమతుల ద్వారా ఇక్కడి తయారీ రంగాన్ని దెబ్బతీయనుంది. ఆ ప్రభావం ఉపాధి కల్పనపై తీవ్రంగా పడబోతోంది. దీంతో మళ్లీ అంగ్లేయుల పెట్టుబడులపై ఆర్థిక పోరాటం చేయాల్సిన పరిస్థితి రావొచ్చేమోనని సంకేతాలు స్పష్టమ వుతున్నాయి.
భారత్‌కు లాభ నష్టాలు
– టెక్స్‌టైల్స్, లెదర్, జెమ్స్, జ్యువెలరీ, సీఫుడ్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు పెరుగుతాయి.
– వీటి ఎగుమతులు 1.2 బిలియన్ పౌండ్స్‌కు పెరగొచ్చు.
– ఐటీ, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ సేవలకు యుకె మార్కెట్‌లో అవకాశాలు.
– భారత్‌కు వీసా ప్రయోజనాలు పరిమితం కానున్నాయి.
– కార్లపై దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఈ పరిశ్రమ కుదుపునకు లోను కానుంది.
– లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చు.
– వ్యవసాయం, చిన్న, మధ్య తరహా సంస్థలపై ప్రభావం.
– ప్రభుత్వ టెండర్లలోకి యుకె కంపెనీల ప్రవేశంతో స్థానిక కంపెనీలు నిర్వీర్యం.
బ్రిటన్‌కు లాభాలు..
– ఇంగ్లాండ్ కంపెనీలకు విస్తృతావకాశాలు..
– యుకె ఉత్పత్తులపై సుంకాలు 90 శాతం తగ్గింపు
– స్కాచ్ విస్కీ, జిన్‌పై సుంకాలు 150 శాతం నుంచి 75 శాతానికి కోత.
తదుపరి 40 శాతానికే అవకాశం.
– ఇది ఆ దేశంలో1,200 ఉద్యోగాలను సృష్టించనుంది.
-కార్లపై టారిఫ్‌లు 100 శాతం నుండి 10 శాతానికి తగ్గింపు.
– ఎలక్ట్రిక్, లగ్జరీ వాహన ఎగుమతులు పెరుగుతాయి.
– ప్రభుత్వ టెండర్లలోకి ప్రవేశించడానికి అనుమతి.
– ఎగుమతుల అధిక రాబడితో యుకె జిడిపికి భారీ మద్దతు.
మళ్లీ బ్రిటీష్ రాజ్యం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES