Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంబ్రిటన్‌తో ఒప్పందం.. ప్రజారోగ్యానికి దెబ్బ

బ్రిటన్‌తో ఒప్పందం.. ప్రజారోగ్యానికి దెబ్బ

- Advertisement -

అధిక కొవ్వు, చక్కెర ఉత్పత్తులపై సుంకాలు రద్దు
న్యూఢిల్లీ :
బ్రిటన్‌తో ప్రధాని నరేంద్ర మోడి కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతీయుల ప్రజారోగ్యాన్ని దెబ్బతీయనుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఒప్పందం బ్రిటన్‌ నుండి బిస్కెట్లు, చాక్లెట్లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ వంటి అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు (హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్‌) ఉత్పత్తులను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. దీనివల్ల ఈ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరలు, మార్కెటింగ్‌, ప్రకటనల ప్రచారాలతో ఈ ఉత్పత్తుల వినియోగం అమాంతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెక్సికో గుణపాఠం..
మెక్సికో, అమెరికా, కెనడా మధ్య 1992లో నార్త్‌ అమెరికన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. అనంతరం మెక్సికో బలమైన ప్రజారోగ్య రక్షణ చర్యలను అమలు చేయడంలో విఫలమైంది. దీంతో చౌకగా సాఫ్ట్‌ డ్రింక్స్‌, స్నాక్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ దిగుమతులు భారీగా పెరిగాయి. హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఉత్పత్తుల వినియోగం పెరిగింది. ఫలితంగా మెక్సికోలో ఉబకాయం, మధుమేహం వంటి ఆహార, సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగాయి. దీన్ని అధిగమించడానికి 2014లో మెక్సికో ‘సోడా టాక్స్‌’, ప్యాకెట్లపై హెచ్చరిక లేబుల్స్‌ వంటి కఠిన నియంత్రణలను ప్రవేశపెట్టింది. తద్వారా ఈ సమస్యను కొంత నియంత్రించగలిగింది. బ్రిటన్‌లో హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఉత్పత్తులపై కఠిన నియంత్రణలు అమల్లో ఉన్నాయి. అక్కడి అహార ఉత్పత్తుల ప్యాకింగ్‌లపై కొవ్వు, చక్కెర, ఉప్పు స్థాయిలను రంగుల ద్వారా సూచిస్తుంది. ఇవి వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడానికి, అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతాయి.
భారత నియంత్రణ సంస్థలు విఫలం
మెక్సికో, యూకే తరహాలో ఇలాంటి నియంత్రణలు భారత్‌లో లేకపోవడం లేదా ఉన్నవి సమర్థవంతంగా అమలు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇక్కడ జంక్‌ ఫుడ్‌ ప్రకటనలపై ఎలాంటి బైండింగ్‌ ఆంక్షలు లేవు. పిల్లలను లక్ష్యంగా చేసుకునే చాకిలేట్ల వంటి ప్రకటనలపై నియంత్రణలు సమర్థవంతంగా అమలు కావడం లేదు. భారత్‌లో తప్పుదారి పట్టించే ప్రకటనలను గుర్తించడంలో లేదా శిక్షలు విధించడంలో నియంత్రణ సంస్థలు విఫలమవుతున్నాయి. బ్రిటన్‌ ఉత్పత్తుల దిగుమతి, వినియోగం పెరగడం వల్ల ప్రజారోగ్యానికి సవాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. యూకేలో ఉన్నట్లుగా బలమైన నియంత్రణలు, ప్యాకెట్లపై హెచ్చరిక సమాచారం, ప్రకటనలపై ఆంక్షలు, పన్నుల వంటి చర్యలు భారత్‌లోనూ అమలు చేయకపోతే, మెక్సికోలో చూసినట్లుగా ఆరోగ్య సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad