మండల వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్
నవతెలంగాణ – బోనకల్
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా సాగులో లేటెస్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు డ్రోన్లను 40 శాతం సబ్సిడీ తో రైతులకు అందజేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ విలేకరులకు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల వ్యవసాయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు శ్రమ తగ్గించి, దిగుబడి పెంచడమే ఈ పథకం వెనుక ఉన్న ముఖ్య లక్ష్యం అన్నారు. ఒక్కో డ్రోన్ కొనుగోలుపై 40 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ పథకంలో మొదటి విడతలో భాగంగా మధిర డివిజన్ లో రెండు డ్రోన్లను సబ్సిడీ తో ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
నేరుగా రైతులకే కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు, మహిళా సంఘాలకు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్ల తో పొలాల్లో పురుగుమందులు, సూక్ష్మ పోషకాలను పిచికారీ చేయడానికి కేవలం నిమిషాల్లోనే ఆ పని పూర్తి చేయవచ్చు అని తెలిపారు. దీనివల్ల సమయం దాదాపు 80 శాతం వరకు ఆదా అవుతుందన్నారు. అంతేకాకుండా మందులు పంట అంతటా సమానంగా పడటం వల్ల పురుగుల ఉధృతి తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు.కూలీల కోసం వెతకాల్సిన అవసరం లేకుండా ఖర్చు కూడా భారీగా తగ్గుతుందన్నారు.
ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతులు తమ మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చెయ్యవచ్చునని తెలిపారు. అక్కడ సబ్సిడీ శాతం, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బోనకల్ మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద కల్తీవేటర్లు, టైవాన్ స్ప్రేయర్స్, డిస్క్ హ్యారోస్,రోటవేటర్లు, గడ్డి చుట్టే యంత్రం, కేజ్ వీల్స్ సబ్సిడీ పై అందించనున్నట్లు తెలిపారు. కావాల్సిన రైతులు మండల వ్యవసాయ అధికారిని లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని ఆయన కోరారు.



