– హుస్నాబాద్ కు యూరియా తెప్పించడంలో మంత్రి విఫలం
– బంగారం లాంటి పంటలు పండించే రైతులకు ఎరువుల కొరత
– రైతుల పక్షాన బిఆర్ఎస్ ముందుండి పోరాడుతాం
– హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు ఆయన జిల్లాకు యూరియాను మళ్ళించారని, మన హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ కు యూరియా తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం హుస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో చెప్పులు లైన్ లో పెట్టి, రోడ్లపై ఎరువుల కోసం ఆందోళనలు చేసే ఇలాంటి పరిస్థితి ఎన్నాడు రాలేదన్నారు.బంగారం లాంటి పంటలు పండించే రైతులకు ఎరువుల కొరత ఆందోళనలో పడేసిందన్నారు. హుస్నాబాద్ మంత్రి ఏం చేస్తున్నారని, సిద్దిపేట జిల్లా తో పాటు హుస్నాబాద్ కూడా యూరియా కొరత లేకుండా తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు.
యూరియా సరైన సమయాన రైతులకు అందించకపోతే దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారన్నారు. సమయం దాటి యూరియా ఇస్తే దిగుబడి రాక రెండు రకాల రైతులు నష్టం పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం గురించి హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలుసాని అనుకుంటున్న, ఉద్యమకారుడని , వ్యవసాయదారుడుని అని చెప్పుకుంటున్న మంత్రి మాటల్లో కాదు చెప్పడం కాదు చేతల్లో చూపించాలన్నారు. హుస్నాబాద్ రైతులు చాలా కష్టపడే రైతులని బంగారం లాంటి పంటలు పండిస్తారన్నారు. గౌరవనీ ప్రాజెక్టు నీళ్ల అందిస్తే బంగారు లాంటి పంటలు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారన్నారు.
ఎంతో కష్టపడి పంటలపైనే ఆధారపడి జీవించే రైతులకు యూరియా అందకపోవడం వల్ల అన్యాయం జరుగుతుందన్నారు. రైతులను ఎప్పుడు మోసం చేయొద్దని, ప్రజా ప్రభుత్వ పాలనలో రైతుల కష్టాలు తీరడం లేదన్నారు. హుస్నాబాద్ లో రైతులు ఆందోళన చేస్తూ నన్ను రమ్మని పిలిస్తే మనకు హుస్నాబాద్ లో మంత్రి ఉన్నాడని రైతులకు సరిపడ యూరియా తీసుకువస్తాడని తెలిపినట్లు చెప్పారు. ఒకవేళ రైతులకు సరిపడా యూరియా అందించకపోతే రైతుల పక్షాన పోరాటం తప్పదన్నారు.
ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి రైతులకు కావలసిన యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి, మండల కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఐలేని అనిత రెడ్డి, మాజీ ఎంపీపీ లకావత్ మానస నాయకులు తదితరులు పాల్గొన్నారు.