Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిఏఐ..సమస్యనా?పరిష్కారమా?

ఏఐ..సమస్యనా?పరిష్కారమా?

- Advertisement -

‘చాట్‌ జీపీటీలో అడిగే ప్రతి ప్రశ్నకు ఒక చుక్క నీరు ఖర్చవుతుంది’.. ఇటీవల ఒక సమావేశంలో ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌ మాన్‌ చెప్పిన మాటలివి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు చాట్‌ జీపీటీకి 2.5 బిలియన్లు.. అంటే 250 కోట్ల క్వరీస్‌ వస్తాయి. ఈ లెక్కన తీసు కున్నా.. ప్రతి రోజు లక్షల లీటర్ల నీరు ఒక్క చాట్‌ జీపీటీ వంటి ఏఐకు అవసరం. అయితే ఇది సామ్‌ ఆల్ట్‌ మాన్‌ చెప్పిన అతి తక్కువ లెక్క మాత్రమే. దీనికి పది రెట్లు ఎక్కువ నీరు ఖర్చవుతుందని ఒక అంచనా. ఈ ప్రకారం చూసుకున్నా.. ఏఐ వల్ల మనుషుల ఉద్యోగం, ఉపాధి మీద ప్రభావం పడడమే కాదు.. భూమిపై పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతున్నది. గ్లోబల్‌ వార్మింగ్‌ కు ఇది కారణమవుతున్నది. అయితే ఏఐ వల్ల నష్టాలను పక్కనపెడితే.. శాస్త్ర, సాంకేతిక, వైద్య, విద్య, వాతావరణ మార్పుల అంచనా, ఖగోళ పరిశోధన రంగాలు ఏఐ వల్ల దూసుకుపోతున్నాయి. క్యాన్సర్‌ వంటి రోగాలు పూర్తిస్థాయిలో నయమయ్యేలా సమీప భవిష్యత్తులో వ్యాక్సిన్‌, మందులు ఏఐ వల్ల సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. విద్యారంగంలోనూ సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అనేకసమస్యలకు, రోగాలకు పరిష్కారమార్గాలు చూపుతున్న ఏఐ.. తన వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యకు కూడా పరిష్కారం వెతికే ప్రయత్నం చేయాలి. ఆయా కంపెనీలు ముందుగా అటువైపు దృష్టిసారించాలి.
ఏఐ వెనక ఊహించని విధ్వంసం జరుగుతున్నదని అనేక మంది పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాట్‌ జీపీటీ (ఓపెన్‌ ఏఐ), గ్రోక్‌ (ఎక్స్‌), జెమినీ (గూగుల్‌), డీప్‌ సీక్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), మెటా, ఎన్‌విడియా, ఇంటెల్‌, సిస్కో, ఎక్స్‌ వంటి కంపెనీలు ఏఐని అభివఅద్ధి చేస్తూ వినియోగంలోకి తీసుకువస్తున్నాయి. ఇంకా అనేక కంపెనీలు ఈ రంగంలో తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్ని స్తున్నాయి. అయితే ఏఐ కోసం ఇలాంటి కంపెనీలకు డేటా సెంటర్లు అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. ఏఐ విస్తృత వినియోగం వల్ల ఈ డేటా సెంటర్లలో ఉండే సర్వర్లు, సూపర్‌ కంప్యూటర్లు నిరంతరం వేడెక్కుతాయి. వీటిని చల్లబర్చ డానికి ప్రతి రోజు కోట్లలీటర్ల నీరు అవసరమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు ప్రస్తుతం 560 బిలియన్‌ లీటర్ల నీటిని వినియో గిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఇది 1200 బిలియన్‌ లీటర్లకు పెరగవచ్చు. ఒక సాధారణ డేటా సెంటర్‌ రోజుకు 5 మిలియన్‌ గ్యాలన్ల నీటిని వాడుతుంది. ఇది 10వేల నుండి 50వేల మంది నివసించే ఒక పట్టణ ప్రజల నీటి వినియోగానికి సమానం. 2027 నాటికి ఏఐ కోసం 6.6 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా కంపెనీలు 2022లోనే 580 బిలియన్‌ గ్యాలన్ల నీటిని వాడాయి. ఈ నేపథ్యంలో ఏఐ కంపెనీలు వినియోగించే డేటా సెంటర్లు ఉన్న అమెరికా, ఐరోపా, సింగపూర్‌, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో నీటి కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తున్నది. ఏఐకి నీటి కేటాయింపులు చేస్తుండడంతో స్థానిక ప్రజల తాగునీరు, వ్యవసాయ అవసరాలకు కేటాయింపులు తగ్గుతున్నా యనే విమర్శలు వస్తున్నాయి.
ఓపెన్‌ ఏఐ లాంటి సంస్థలు లాంగ్‌ ఏఐ మోడల్స్‌ శిక్షణ కోసం వేలకొద్దీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో విపరీత మైన విద్యుత్‌ ఖర్చవుతుంది. 2023లో యూఎస్‌ లోని డేటా సెంటర్లు ఆ దేశ వినియోగంలో ఉన్న విద్యుత్‌ లో 4.4శాతం కరెంట్‌ ను వాడాయి. 2028 నాటికి ఇది పన్నెండు శాతానికి పెరిగే అవకాశముంది. అయితే ఆ విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాల వల్ల వందల టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఏఐ కోసం వినియోగించే చిప్‌ ల వల్ల కూడా పర్యావరణానికి హాని ఏర్పడుతున్నది. చిప్‌ల తయారీ కోసం వేల గ్యాలన్ల శుద్ధి చేసిన నీరు అవసరం. అంతేకాకుండా సిలికాన్‌, బంగారం, ప్లాటినం వంటి ఖనిజాలను భూమి నుంచి వెలికి తీయడానికి భారీగా మైనింగ్‌ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అడవులను నిర్మూ లిస్తున్నారు. భూమి సైతం కోతకు గురవుతున్నది. అంతేకాకుండా పాడైపోయాక ఆ చిప్‌లను పారేస్తుండడం వల్ల పర్యావరణానికి మరింత నష్టం జరుగుతున్నది.
అనేక రంగాల్లోని క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుకుతున్న ఏఐ.. ముందుగా తన వల్ల జరిగే పర్యావరణ హననానికి పరిష్కారాన్ని వెతకాలి. సౌర, పవన శక్తి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ ను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. తక్కువ శక్తిని వినియోగించే ఏఐ అల్గారిథమ్స్‌ను రూపొందించు కోవాలి. తమ కంపెనీల వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని ముందుగా ఈ కంపెనీలు ప్రజలకు వివరించాలి. ప్రజలు కూడా ఏఐ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ప్రశ్నలకు, ఏఐలో హలో, హారు, ధన్యవాదాలు వంటి పదాలకు దూరంగా ఉండాలి. ఏఐ వల్ల అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ప్రపంచం ముందు పర్యావరణానికి సంబంధించి మరో పెద్ద సమస్య ఏర్పడే ప్రమాదముంది.
– ఫిరోజ్‌ ఖాన్‌, 9640466464

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad