కాల్పుల విరమణ నిబంధనల అనంతరం ఇజ్రాయిల్ అడ్డంకులు
జెరూసలేం :ఇజ్రాయిల్ దుందుడుకు చర్యలు మానటం లేదు. రెండోవిడత శాంతి చర్యలు జరుపుతామంటూనే నెతాన్యాహు బరితెగింపుపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు అమెరికా మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ అనంతరం గాజాలో అందించే సాయంలో ఆహార సరఫరా మరింతగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఏం జరుగుతోంది…?
ఇజ్రాయిల్, హమాస్ మధ్య అక్టోబర్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం..ఇజ్రాయిల్ ప్రతిరోజూ గాజాలో 600 ట్రక్కుల సహాయాన్ని అనుమతించడానికి అంగీకరించింది. కానీ సహాయ ప్రవాహం పున్ణప్రారంభమైన అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు సగటున రోజుకు 459 ట్రక్కులు మాత్రమే గాజాలోకి ప్రవేశించాయి. సహాయ ప్రవేశాన్ని సమన్వయం చేసే బాధ్యత కలిగిన ఇజ్రాయిల్ సైనిక సంస్థ సీఓజీఏటీ గణాంకాలపై అసోసియేట్ ప్రెస్ (ఏపీ) విశ్లేషించింది. కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి (ఈ ఆదివారం) వరకు సుమారు 18,000 ట్రక్కుల ఆహార సహాయం గాజాలోకి ప్రవేశించిందని సీఓజీఏటీ తెలిపింది. కాల్పుల విరమణ తర్వాత భూభాగంలోకి ప్రవేశిం చిన మొత్తం సహాయంలో ఆ సంఖ్య 70 శాతంగా ఉన్నదని వెల్లడించింది.
ఈ లెక్కన మొత్తం 25,700 ట్రక్కులకు పైగా సహాయం గాజాలోకి ప్రవేశించింది. ఆదివారం నాటికి కాల్పుల విరమణ నిబం ధనల ప్రకారం ప్రవేశించాల్సిన 33,600 ట్రక్కుల కంటే ఇది చాలా తక్కువ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాల్పుల విరమణ అనంతరం డిసెంబర్ 7 మధ్య గాజా క్రాసింగ్‌ల వద్ద 6,545 ట్రక్కులను మాత్రమే అప్‌లోడ్ చేశారు. అంటే రోజుకు 113 ట్రక్కులు మాత్ర మేనని యూఎన్ ధ్రువీకరిస్తోంది. మానవతావాద సంఘాల సమాచారం ప్రకారం.. పాలస్తీనియన్లకు సహాయం అందిచకపోవడం గాజాలోని 2 మిలియన్ల మంది నివాసితులపై తీవ్ర ప్రభావం చూపింది, వీరిలో ఎక్కువ మంది యుద్ధం కారణంగా బలవంతంగా స్థానభ్రంశం చెందారు. దీనికి తోడు ఇజ్రాయిల్ సహాయంపై ఆంక్షలు మరింత దుర్భరంగా మారటానికి కారణమవుతుందని స్థానికులు అంటున్నారు.
వర్షాలు తీవ్రమైన చలి
ఇక్కడ శీతాకాల వర్షాలు కురుస్తున్న కొద్దీ..తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డేరాలలో నివసిస్తున్న కుటుంబాల బాధలు వర్ణనాతీతం. ఓవైపు వరదలు, మరోవైపు తీవ్రమైన చలిని తట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ”నిరంతర అడ్డంకుల దృష్ట్యా, మానవతావాద సమాజం స్పందించే సామర్థ్యం కంటే అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి” అని ఒక నివేదికలో రాసింది. ”ఈ అడ్డంకుల్లో అభద్రత, కస్టమ్స్ క్లియరెన్స్ సవాళ్లు, క్రాసింగ్‌ల వద్ద జాప్యాలు, సరుకుల తిరస్కరణలు , గాజాలో మానవతా సామగ్రి రవాణాకు అందుబాటులో ఉన్న పరిమిత మార్గాలు ఉన్నాయి.”
ఇజ్రాయిల్‌పై హమాస్ మరింత అంతర్జాతీయ ఒత్తిడి కోసం పిలుపునిచ్చింది. కీలక సరిహద్దు క్రాసింగ్‌లను తెరవడానికి, భూభాగంపై ప్రాణాంతక దాడులను నిలిపివేయాలని కోరుతున్నది. అలాగే స్ట్రిప్‌లోకి మరింత సహాయాన్ని అనుమతించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నది. అయితే మధ్యవర్తులు చేస్తున్న శాంతి ప్రయత్నాలు, కాల్పుల విరమణ రెండోదశకు మరింత సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆకలితో అలమటిస్తున్న తల్లులు
యుద్ధ సమయంలో గాజాలోని కొన్ని ప్రాంతాలను తాకిన కరువు నుంచి పాలస్తీనా భూభాగం కోలుకోవడానికి కష్టపడుతుండగా ఆహారం కొరతగా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా గాజాలో ఆకలితో ఉన్న తల్లులు పోషకాహార లోపంతో బాధపడుతున్న శిశువులకు జన్మనిస్తున్నారు. వీరిలో కొందరు ఆస్పత్రిలో మరణించారని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది.



