నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా చిట్యాల, అప్పాయిపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో శనివారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు సాయిలీల మాట్లాడుతూ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చారు. చిట్యాల కాలనీలో చెత్త చెట్లు ఎత్తుగా పెరిగి, వాటర్ పైపులు పగిలిపోవడం వలన ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అత్యవసర వైద్యసదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అప్పాయిపల్లిలో చెట్ల పొదలు పెరగడం వలన ఇండ్లలోకి పాములు, తేలు వస్తున్నాయని, మున్సిపాలిటీ వారు రెగ్యులర్‌గా చెత్త తొలగించే ట్రాక్టర్ పంపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అప్పాయిపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కంచె ఏర్పాటు చేసి ప్రహారీ గోడ నిర్మించాలనీ, అత్యవసర సమయంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు చికిత్స కోసం అవస్థలు పడుతున్నారని తెలిపారు. నీళ్ల ట్యాంక్ సమస్యల వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూములు ఏర్పాటు చేసిన ఇండ్ల దగ్గర విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థాపించాలన్నారు. డయాబెటిస్ రోగులకు మందులు (టాబ్లెట్స్) అందించాలన్నారు. రేషన్ షాప్ ఏర్పాటు చేయాలన్నారు. బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే, పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కోశాధికారి కవిత, ఉపాధ్యక్షురాలు శాంతమ్మ, సభ్యురాలు లలిత, చిట్యాల అప్పయ్యపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.