Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐద్వా జిల్లా కార్యదర్శి లంక జమున గుండెపోటుతో మృతి

ఐద్వా జిల్లా కార్యదర్శి లంక జమున గుండెపోటుతో మృతి

- Advertisement -

నాయకుల సంతాపం

నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్‌
సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు, ఐద్వా ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శి లంక జమున(55) శనివారం గుండెపోటుతో మృతిచెందారు. ఉదయం గుండెలో నొప్పిరావడంతో ఆమె కొడుకు కార్తీక్‌ వెంటనే రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే జమున మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌, సీనియర్‌ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లంక రాఘవులు, పూసం సచిన్‌, అన్నమొళ్ల కిరణ్‌, ఐద్వా నాయకులు శకుంతల, మంజుల జమున ఇంటికి చేరుకుని సంతాపం ప్రకటించారు. మృతదేహంపై పార్టీ, ఐద్వా జెండాలు ఉంచి నివాళులర్పించారు. ఆమె కొడుకును ఓదార్చారు.

జమున అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10గంటలకు రణదివేనగర్‌లో నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. లంక జమున 25 ఏండ్లు సీపీఐ(ఎం), ప్రజా సంఘాల్లో పనిచేశారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రజా సమస్యలపై పార్టీ, ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాల్లో ప్రజలను సమీకరించడంలో చురుకైన పాత్ర పోషించారు. 2000లో సీపీఐ(ఎం) రణదీవెనగర్‌ కాలనీ శాఖ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి శాఖ కార్యదర్శిగా కొనసాగారు. 2016 నుంచి 2018 వరకు ఆదిలాబాద్‌ పార్టీ పట్టణ కార్యదర్శిగా పని చేశారు. కుమురంభీం ఇండ్లస్థలాలు, భగత్‌సింగ్‌నగర్‌, రణదీవెనగర్‌ కాలనీల ఏర్పాటు పోరాటంలో సమరశీలంగా పోరాడారు. పోలీసు కేసులను సైతం ఎదుర్కొన్నారు.

ఉద్యమానికి తీరని లోటు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌
సీపీఐ(ఎం) ఆదిలాబాద్‌ సీనియర్‌ నాయకులు, ఐద్వా జిల్లా కార్యదర్శి లంక జమున మరణం పార్టీకి, మహిళా ఉద్యమానికి, ప్రజా పోరాటాలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె మృతికి సంతాపం, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లంక జమున ఆదిలాబాద్‌ పట్టణ ప్రాంతంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భూపోరాటాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ, పేదల పక్షాన సమస్యలపై పోరాడారని కొనియాడారు. ఐద్వా జిల్లా కార్యదర్శిగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. మద్యంతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న సందర్భంలో మద్య నిషేధం విధించేలా పోరాటం చేయడంతో పాటు, అనేక కాలనీల్లో బెల్టు షాపులు మూసివేసేలా కృషిచేశారని గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -