సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరనారి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) నివాళులు
నవతెలంగాణ-మహబూబాబాద్/ హైదరాబాద్ బ్యూరో/ మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/చంపాపేట్/ధూల్‌పేట్
చిట్యాల ఐలమ్మ 40వర్ధంతి సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆమె చిత్రపటానికి సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించారు. అనంతరం సభలు నిర్వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని పెరుమాండ్ల జగన్నాధం భవన్‌లో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు.. ఎర్రజెండా చేతపట్టి నిజాం, దేశముఖ్‌లను గడగడలాడించిన వీరవనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన వీరనారి చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ పోరాటాలు కొనసాగించాలన్నారు. నిజాం నిరంకుశ.. నియంతృత్వ పాలనపై తిరుగుబాటు చేసిన యోధురాలు అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ వైఖరిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, నాయకులు సమ్మెట రాజమౌళి, గునిగంటి మోహన్, రావుల రాజు, చిపిరి యాకయ్య, కుమ్మరికుంట్ల నాగన్న, బానోత్ వెంకన్న, చాంగంటి భాగ్యమ్మ, తోట శ్రీనివాస్, ఎండీ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన అనంతరం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ.. భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన నాటి తెలంగాణ పోరాటంలో ఐలమ్మ ముందున్నారని అన్నారు. ఆనాడు నైజాం నవాబ్‌కు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఈ నెల 17న సంగారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, కృష్ణ, నాయకులు అశోక్, బాగారెడ్డి, శివ, దత్తు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. మహిళలు గడప దాటని ఆ కాలంలోనే భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. తాను కౌలుకు తీసుకున్న పొలంలోని పంటను దొర దోచుకోవడాన్ని నిరసిస్తూ ఆ నాటి సంఘం దళ నాయకులైన భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి నాయకుల సహకారంతో ఐలమ్మ పోరాడారని, దొరను ఎదిరించి పంటను ఇంటికి చేర్చుకున్నారని గుర్తుచేశారు. ఆమె స్ఫూర్తితో సమస్యలపై పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట సహాయ కార్యదర్శి ఆశాలత, కమిటీ సభ్యులు ఎం.స్వర్ణలత, నాయకులు సత్యమ్మ, మస్తాన్ బి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతోష్‌నగర్ నిర్వహించిన సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ.. తన కుల వృత్తికే పరిమితం కాకుండా వ్యవసాయం చేస్తానని ఆనాటి భూస్వాములను ఎదిరించి, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, దీశాలి చిట్యాల ఐలమ్మ అని తెలిపారు. ఆమె ధైర్యాన్ని వమ్ము చేయడానికి కొంతమంది ఎంత ప్రయత్నించినా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల అండతో చివరిదాకా నిలబడిన నాయకురాలని, ఆమె జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా స్వీకరించాలని సూచించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.విఠల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం.లక్ష్మమ్మ, పి.శశికళ, పి.నాగేశ్వర్, ఎం.బాలు ఎం.మీనా, టి.సత్తయ్య, ఎస్.కిషన్, ఎం.కృష్ణ, స్వరూప, కవిత పాల్గొన్నారు.
సీఐటీయూలో చేరిన అంగన్‌వాడీలు
అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. బుధవారం మహబూబాబాద్‌లో వివిధ సంఘాల నుంచి 500 మంది అంగన్వాడీలు సీఐటీయూలో చేరారు. వారికి కండువాలు కప్పి సీఐటీయూలోకి ఆహ్వానించారు.