Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅఖండ-2 టిక్కెట్ల ధర పెంపు నిలిపివేత

అఖండ-2 టిక్కెట్ల ధర పెంపు నిలిపివేత

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా టిక్కెట్‌ రేట్ల పెంపుదలకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. మెమో అమలును నిలిపేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జీవో ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టిక్కెట్‌ రేట్ల వ్యవహారం విచారణ పెండింగ్‌లో ఉండగా, మెమో జారీ చేయటం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అభిప్రాయపడింది. సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో ఇదే తరహా మెమోను హైకోర్టు నిలిపేసిన తర్వాత కూడా ప్రభుత్వం కొత్త సినిమా వచ్చినప్పడల్లా మెమో ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ అభివృద్ధి సంస్థ, 14 రీల్స్‌ ప్లస్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణ శుక్రవారం కొనసాగిస్తామని జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ గురువారం ప్రకటించారు. అఖండ 2 సినిమా టికెట్ల ధర పెంపును సవాల్‌ చేస్తూ. హైదరాబాద్‌ చందానగర్‌కు చెందిన కిలారు సుమన్‌తోపాటు మరో ఇద్దరు అత్యవసర లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అఖండ-2 టికెట్‌ ధరలు ఈ నెల 12 నుంచి 14 వరకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 అదనంగా పెంపునకు అనుమతిచ్చిందన్నారు. గురువారం జరిగే ప్రీమియర్‌ షో టికెట్‌ ధరను రూ. 600గా నిర్ణయించిందన్నారు. ఈ మేరకు హొం శాఖ ఈ నెల 10న మెమో జారీ చేసిందన్నారు. గతంలో ఆదేశించిన మేరకు జీవో 120 ప్రకారం టికెట్‌ ధరలకు కట్టుబడి ఉండేలా ప్రభుత్వాన్ని తిరిగి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, పిటిషనర్లు టికెట్లు కొనలేదనీ, వారిపై జీవో ప్రభావం లేదన్నారు. టిక్కెట్‌రేట్ల పెంపు మెమోకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. అనంతరం హైకోర్టు మెమోను సస్పెండ్‌ చేస్తూ వెలువరించిన ఉత్తర్వుల కాపీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఈమెయిల్‌ చేయాలని ఆదేశించింది.

రూ. 5 వేలు జరిమానా
ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల పరిధిలో జీవో 111ను అమలుపై దాఖలైన పిల్‌లో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జీవో అమలు తీరును వివరించాలన్న గత ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వానికి రూ.5 వేలు జరిమానా విధించింది. వారం రోజుల్లోగా ఈ మొత్తాన్ని స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథార్టీకి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జంట జలాశయాలు పరిధిలోని ఎకో జోన్‌లో అక్రమ నిర్మాణాలను ఆపేలా అధికారులకు ఉత్తర్వులివ్వాలంటూ రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన మందడి మాధవరెడ్డి వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించింది. విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది.

క్యాబినెట్‌ హోదా కల్పన పిల్‌పై అభ్యంతరాల తిరస్కరణ
రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలకు క్యాబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిల్‌కు నెంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చింది. పిల్‌పై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఇదే అంశంపై 2017లో నాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్‌రెడ్డి వేసిన పిల్‌తో కలిపి ఈ పిల్‌ను కూడా వచ్చే వారంలో విచారిస్తామని చెప్పింది. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్‌ను ఈ పిటిషన్‌కు జత చేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం ప్రకటించింది. క్యాబినెట్‌ హోదా కల్పనకు గతంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యను 2017లో అప్పటి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి హైకోర్టులో సవాలు చేశారని పిటిషనర్‌ న్యాయవాదులు చెప్పారు. తాము దాఖలు చేసిన పిల్‌కు రిజిస్ట్రీ నెంబర్‌ కేటాయించకపోవడం చెల్లదన్నారు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఓ నిర్ణయం తీసుకుంటారని., అధికార పగ్గాలు అందుకో గానే అందుకు విరుద్ధంగా చర్యలు ఉంటున్నాయని చెప్పారు. మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతానికి మించి క్యాబినెట్‌ ర్యాంక్‌ ఉండకూడదని ఆర్టికల్‌ 164 (1ఏ) నిర్ధేశిస్తోందని చెప్పారు. ఇప్పుడు 16 మంది మంత్రులుగా ఉన్నారనీ, మరో 14 మందికి క్యాబినెట్‌ హోదా కల్పన చెల్లదన్నారు. వాదనల అనంతరం హైకోర్టు పిల్‌కు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -