నవతెలంగాణ-హైదరాబాద్ : ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్! అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకరకంగా ప్రజల్ని తప్పుదోవపట్టించి వారి బ్యాంకు ఖాతాలను గుల్ల చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ పేరిట ఓ నకిలీ సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఖాతాదారులకు ఏపీకే ఫైల్స్‌ని పంపి దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ మోసపూరిత సూచనలు చేస్తున్నారు. దాంట్లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలని, లేదంటే ఎస్‌బీఐ యోనో యాప్ బ్లాక్ అయిపోతుందంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంపై కేంద్రం స్పందించింది. ఇలాంటివి నమ్మొద్దని ప్రజల్ని కోరింది.
ఇలాంటి సందేశాలు పూర్తిగా నకిలీవని ప్రజలకు సూచిస్తూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ప్రజలు ఎవరూ ఎలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం గానీ, తమ వ్యక్తిగత, బ్యాంకింగ్, ఆధార్ వంటి వివరాలను షేర్ చేయడం వంటివి చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఏవైనా అనుమానాస్పద సందేశాలు మీ దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకొనేందుకు వీలుగా [email protected]కు రిపోర్టు చేయాలని ఈ సందర్భంగా కోరింది. మరోవైపు, ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ సైతం విజ్ఞప్తి చేస్తోంది. ‘‘క్లిక్ చేసే ముందు ఆలోచించండి. బ్యాంకింగ్ యాప్‌ని అప్‌డేట్ చేసుకోవాలని చెబుతూ నకిలీ ఏపీకే లింకులను మోసగాళ్లు పంపిస్తున్నారు.. ఇది మీ సొమ్మును చోరీ చేసే ఓ స్కామ్. అలాంటివి ఏవైనా వస్తే క్లిక్ చేయొద్దు.. డౌన్‌లోడ్ చేయొద్దు.. అప్‌డేట్ చేయొద్దు. యాప్‌లను కేవలం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి. ఏవైనా సైబర్ మోసాలకు 1930కు రిపోర్టు చేయండి’’ అని విజ్ఞప్తి చేసింది.


